Hansika: ఆ ఒక్క కారణంతో.. నాకు దుస్తులు ఇవ్వడానికి అంగీకరించలేదు: హన్సిక

కెరీర్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి వెల్లడించారు నటి హన్సిక (Hansika). 

Published : 19 May 2023 01:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఏడు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు నటి హన్సిక (Hansika). ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా తన తదుపరి చిత్రాల ప్రమోషన్స్‌ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు.

‘‘ఎనిమిదేళ్లకే బాలనటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నేను ‘దేశముదురు’తో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ సినిమా తర్వాత సౌత్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో నటించాను. త్వరలో నేను నటించిన ఏడు సినిమాలు / సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి’’ అని చెప్పిన ఆమె కెరీర్‌ మొదలుపెట్టిన కొత్తలో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి మాట్లాడుతూ.. ‘‘దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ సౌత్‌ నటిననే కారణంతో పేరుపొందిన కొంతమంది డిజైనర్లు నాకు దుస్తులు ఇవ్వడానికి అంగీకరించలేదు. సినిమా రిలీజ్‌ ఈవెంట్స్‌ కోసం దుస్తులు డిజైన్‌ చేస్తారా? అని ఎవరినైనా అడిగితే నో అని ముఖంపై చెప్పేవాళ్లు. అలా చెప్పిన చాలామంది ఇప్పుడు నాకు దుస్తులు డిజైన్‌ చేస్తానని వస్తున్నారు’’ అని హన్సిక బదులిచ్చారు.

ఇక, డిజైనర్‌ దుస్తుల గురించి విజయ్‌ వర్మ సైతం ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. మొదటిసారి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనప్పుడు తనకు దుస్తులు డిజైన్‌ చేయమని ఎంతోమంది సెలబ్రిటీ డిజైనర్లను తాను సంప్రదించానని, కాకపోతే వాళ్లు అంగీకరించలేదని, అది తనను ఎంతో బాధించిందని ఆయన చెప్పారు. ‘విజయ్‌ వర్మ ఎవరు?’ అని వాళ్లు ప్రశ్నించారని ఆయన తెలిపారు. విజయ్ వర్మ చేసిన వ్యాఖ్యలు మర్చిపోక ముందే హన్సిక సైతం తనతో డిజైనర్లు వ్యవహరించిన తీరును బయటపెట్టారు. దక్షిణాది సినిమాలకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు డిజైనర్లు సైతం ఇక్కడి వాళ్లకు దుస్తులు సిద్ధం చేయడానికి అంగీకరిస్తున్నారని ఆమె వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని