Happy Birthday: ఓటీటీలోకి ‘హ్యాపీ బర్త్‌డే’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

‘హ్యాపీ బర్త్‌డే’ ఓటీటీ విడుదల ఖరారైంది. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఎప్పుడు వస్తుందంటే....

Published : 02 Aug 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday). ఈ క్రైమ్‌ కామెడీ సినిమా జులై 8న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 8 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (Netflix) స్ట్రీమింగ్‌ కానున్నట్టు సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నరేష్‌ అగస్త్య, సత్య, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు తమదైన కామెడీతో నవ్వులు పూయించారు.

క‌థేంటంటే: జిండియా అనే ఓ కాల్పనిక దేశంలో జ‌రిగే క‌థ ఇది. ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్‌). దేశంలోని తుపాకీ చ‌ట్టాల‌ను స‌వ‌రించి.. ఓ నూత‌న తుపాకీ చ‌ట్టాన్ని తీసుకొస్తాడు. ఫ‌లితంగా దేశ‌వ్యాప్తంగా తుపాకీ సంస్కృతి పెచ్చు మీరుతుంది. జ‌నమంతా కూర‌గాయ‌లు కొన్న‌ట్లు ఎడాపెడా తుపాకులు కొనేసుకుంటారు. క‌ట్ చేస్తే.. క‌థ రిట్జ్ హోట‌ల్‌కు మారుతుంది. హ్యాపీ అలియాస్ ప‌సుపులేటి హ్యాపీ త్రిపాఠి (లావ‌ణ్య త్రిపాఠి) త‌న బ‌ర్త్‌డే పార్టీ కోసం ఆ హోట‌ల్‌కు వెళ్తుంది. అదే స‌మ‌యంలో ల‌క్కీ (న‌రేష్ అగ‌స్త్య‌) తాను దొంగిలించిన ఓ వ‌జ్రాల లైట‌ర్‌ను హ్యాపీ హ్యాండ్ బ్యాగ్‌లో వేస్తాడు. త‌ర్వాత ఆమె పోష్ ప‌బ్‌కు వెళ్లగా.. అక్క‌డి బేర‌ర్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపిచ్చి త‌న‌ని కిడ్నాప్ చేస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? హ్యాపీ బ్యాగ్‌లో ఉన్న లైట‌ర్‌లో ఏముంది? దానికీ రిత్విక్ సోధికి ఉన్న లింకేంటి? అస‌లు ల‌క్కీ, హ్యాపీల క‌థేంటి? వారిద్ద‌రికీ ఉన్న సంబంధం ఏంటి? ఈ క‌థ‌లో గూండా (రాహుల్ రామ‌కృష్ణ‌), మాక్స్ పెయిన్ (స‌త్య) పాత్ర‌ల‌కున్న ప్రాధాన్య‌త ఏంటి? అన్నదే మిగతా కథ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని