Updated : 08 Jul 2022 15:17 IST

Happy Birthday review: రివ్యూ: హ్యాపీబర్త్‌డే

Happy Birthday review: చిత్రం: హ్యాపీ బ‌ర్త్‌డే; న‌టీన‌టులు: లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, స‌త్య‌, గుండు సుద‌ర్శ‌న్‌, గెట‌ప్ శ్రీను, రాహుల్ రామ‌కృష్ణ‌ త‌దిత‌రులు; సంగీతం: కాల భైర‌వ‌; కూర్పు: కార్తీక్ శ్రీనివాస్‌; ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ సారంగం; ద‌ర్శ‌క‌త్వం: రితేష్ రానా; నిర్మాణ సంస్థ‌లు: క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్‌; విడుద‌ల తేదీ: 08-07-2022

‘మ‌త్తు వ‌ద‌ల‌రా’తో తొలి ప్ర‌య‌త్నంలో సినీ ప్రియుల్ని మెప్పించిన ద‌ర్శ‌కుడు రితేష్ రానా. ఆయ‌న రెండో ప్ర‌య‌త్నంగా తెర‌కెక్కించిన చిత్రం ‘హ్యాపీ బ‌ర్త్ డే’. లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. స‌ర్రియ‌ల్ వ‌ర‌ల్డ్‌లో జ‌రిగే ఓ విభిన్న‌మైన క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందింది. టీజ‌ర్, ట్రైల‌ర్లు వినోదాత్మ‌కంగా.. థ్రిల్లింగ్‌గా ఉండ‌టంతో విడుద‌ల‌కు ముందే సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఈ చిత్రం ఏ మేర‌కు స‌ఫ‌ల‌మైంది? ఈ స‌ర్రియ‌ల్ వ‌రల్డ్‌లో సాగే క‌థ ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది?

క‌థేంటంటే: జిండియా అనే ఓ కాల్పనిక దేశంలో జ‌రిగే క‌థ ఇది. ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి రిత్విక్ సోధి (వెన్నెల కిషోర్‌). దేశంలోని తుపాకీ చ‌ట్టాల‌ను స‌వ‌రించి.. ఓ నూత‌న తుపాకీ చ‌ట్టాన్ని తీసుకొస్తాడు. ఫ‌లితంగా దేశ‌వ్యాప్తంగా తుపాకీ సంస్కృతి పెచ్చు మీరుతుంది. జ‌నమంతా కూర‌గాయ‌లు కొన్న‌ట్లు ఎడాపెడా తుపాకులు కొనేసుకుంటారు. క‌ట్ చేస్తే.. క‌థ రిట్జ్ హోట‌ల్‌కు మారుతుంది. హ్యాపీ అలియాస్ ప‌సుపులేటి హ్యాపీ త్రిపాఠి (లావ‌ణ్య త్రిపాఠి) త‌న బ‌ర్త్‌డే పార్టీ కోసం ఆ హోట‌ల్‌కు వెళ్తుంది. అదే స‌మ‌యంలో ల‌క్కీ (న‌రేష్ అగ‌స్త్య‌) తాను దొంగిలించిన ఓ వ‌జ్రాల లైట‌ర్‌ను హ్యాపీ హ్యాండ్ బ్యాగ్‌లో వేస్తాడు. త‌ర్వాత ఆమె పోష్ ప‌బ్‌కు వెళ్లగా.. అక్క‌డి బేర‌ర్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపిచ్చి త‌న‌ని కిడ్నాప్ చేస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? హ్యాపీ బ్యాగ్‌లో ఉన్న లైట‌ర్‌లో ఏముంది?  దానికీ రిత్విక్ సోధికి ఉన్న లింకేంటి? అస‌లు ల‌క్కీ, హ్యాపీల క‌థేంటి?వారిద్ద‌రికీ ఉన్న సంబంధం ఏంటి? ఈ క‌థ‌లో గూండా (రాహుల్ రామ‌కృష్ణ‌), మాక్స్ పెయిన్ (స‌త్య) పాత్ర‌ల‌కున్న ప్రాధాన్య‌త ఏంటి?ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స‌ర్రియ‌ల్ జాన‌ర్ తెలుగు తెర‌కు కొత్తేమీ కాదు. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెర‌కెక్కించిన వినోదాత్మ‌క చిత్రం ‘జంబల‌క‌డిపంబ’ ఈ కోవ‌కు చెందినదే. అందులో జ‌రిగే క‌థ చూస్తే.. వాస్త‌వ ప్ర‌పంచంలో ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా అనిపిస్తుంది. కానీ, ఆ క‌థ.. అందులోని పాత్ర‌ల నుంచి పుట్టిన వినోదం సినీప్రియుల్ని క‌డుపుబ్బా న‌వ్వించింది. అయితే ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ క‌థ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇందులోని ఊహా ప్ర‌పంచం.. క‌నిపించే పాత్ర‌లు.. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. జిండియా అనే ఓ కాల్పానిక ప్ర‌పంచంలో సెట్ చేసిన క‌థ ఇది. దీన్ని ప‌లు భాగాలుగా ఒక్కో పాత్ర‌తో ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం చేశారు రితేష్‌. తొలుత రిత్విక్ పార్ల‌మెంట్‌లో నూత‌న తుపాకీ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత త‌నిచ్చే మీడియా ఇంట‌ర్వ్యూ న‌వ్వులు పూయిస్తుంది. ఆ వెంట‌నే హ్యాపీ పాత్ర‌ను ప్ర‌వేశ పెట్టి.. ఆమె ద్వారా క‌థ ముందుకు న‌డిపించారు. త‌ను రిట్జ్ హోట‌ల్‌లోకి ప్ర‌వేశించాక వ‌చ్చే స‌న్నివేశాలు, పోష్ ప‌బ్‌లోకి వెళ్లాక ఆమె కిడ్నాప్ అవ‌డం.. ఉత్సుక‌తను క‌లిగిస్తాయి. ఇక అక్క‌డి నుంచి ల‌క్కీ పాత్ర‌ను, ఆ త‌ర్వాత మాక్స్ పెయిన్ పాత్ర‌ను.. ఇలా సినిమాలోని ఒక్కో పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూ.. ఆయా పాత్ర‌ల దృక్కోణం నుంచి క‌థ ముందుకు న‌డిపించారు రితేష్‌. 

ప్ర‌ధ‌మార్ధమంతా ఇలా ఆయా పాత్ర‌ల ప‌రిచ‌యాల‌తోనే ముందుకు సాగుతుంది.  వీటిలో కొన్ని క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్ల‌లా అడ్డుత‌గల‌గా.. కొన్ని మాత్రం న‌వ్వులు పూయించాయి. గేర్ లెస్ కారును న‌డ‌ప‌డం కోసం స‌త్య చేసే ప్ర‌య‌త్నం క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. గెట‌ప్ శ్రీను, రాకెట్ రాఘవ  ట్రాక్‌తో పాటు హ‌ర్ష ఎపిసోడ్స్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. విరామానికి ముందు లావ‌ణ్య పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ద్వితీయార్ధంలో ఏం జ‌ర‌గ‌నుందా? అన్న ఉత్సుక‌త క‌లుగుతుంది. అయితే ద‌ర్శ‌కుడు దానికి త‌గ్గ‌ట్లుగా ర‌స‌వ‌త్త‌రంగా క‌థ న‌డ‌ప‌డంలో త‌డ‌బ‌డ్డాడు. హ్యాపీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్.. రిత్విక్‌ను దెబ్బ‌తియ‌డం కోసం ఆమె చేసే ప్ర‌య‌త్నాలు ఏమాత్రం మెప్పించ‌వు. మ‌ధ్య మ‌ధ్య‌లో వ‌చ్చే ల‌క్కీ సిస్ట‌ర్ సెంటిమెంట్ సీన్స్ కాసిన్ని న‌వ్వులు పూయిస్తాయి. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ చిత్రంలోని సీరియ‌ల్ ట్రాక్‌ను ఇందులోనూ కంటిన్యూ చేశారు రితేష్‌. ఆ ఎపిసోడ్ చ‌క్క‌గా క్లిక్ అయింది. ఇక క్లైమాక్స్‌కు ముందొచ్చే వెన్నెల కిషోర్ - స‌త్య‌ల ట్రాన్స్‌లేష‌న్ ఎపిసోడ్ పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్విస్తుంది. అయితే సినిమాని ముగించిన తీరు ఏమాత్రం మెప్పించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే:  హ్యాపీ పాత్ర‌లో లావ‌ణ్య చ‌క్క‌గా ఒదిగిపోయింది. అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఆమె కామెడీ  టైమింగ్ ఆక‌ట్టుకుంటుంది. న‌ట‌న ప‌రంగా కొత్త‌గా చూపించ‌డానికి ఆమెకు పెద్ద‌గా ఆస్కారం దొర‌క‌లేదు. మాట‌లు లేకుండా సైగ‌ల‌తోనే న‌టించే ల‌క్కీ పాత్ర‌లో న‌రేష్ అగ‌స్త్య ఆక‌ట్టుకుంటాడు. రిత్విక్ సోధిగా వెన్నెల కిషోర్‌, మాక్స్ పెయిన్‌గా స‌త్య త‌మ త‌మ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తారు. రాహుల్ రామ‌కృష్ణ‌, గుండు సుద‌ర్శ‌న్‌, గెట‌ప్ శ్రీనుల పాత్ర‌లు ప‌రిధిమేర ఆక‌ట్టుకుంటాయి. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’తో రితేష్‌పై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా ఆరంభించిన తీరు.. స్ర్కీన్‌ప్లేని తీర్చిదిద్దుకున్న విధానం ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే చాలా కొత్త‌గా ఉంటుంది. అయితే మంచి ఫిక్ష‌న‌ల్ స్టోరీ రాసుకున్న ద‌ర్శ‌కుడు.. దాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా న‌డిపించ‌డంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. ప్ర‌ధ‌మార్ధం కాస్త థ్రిల్లింగ్‌గా న‌డిచినా.. ద్వితీయార్ధం స‌హ‌నానికి ప‌రీక్ష‌లా సాగుతుంది. క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా కాల భైర‌వ అందించిన నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బ‌లాలు

+ కొత్త ప్ర‌పంచంలో న‌డిచే క‌థ‌

+ ఆరంభ స‌న్నివేశాలు

+ వెన్నెల కిషోర్‌, స‌త్య కామెడీ

బ‌ల‌హీన‌త‌లు

- గంద‌ర‌గోళంగా అనిపించే క‌థ‌నం

ద్వితీయార్ధం

చివ‌రిగా: అక్కడక్కడా నవ్వులు తప్ప పెద్దగా సంద‌డి లేని ‘బ‌ర్త్ డే పార్టీ’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని