Puri Musings: రేపటి పేరు చెప్పి నాటకాలాడొద్దు.. HAPPY NOW HERE

వర్తమానంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని, భవిష్యత్‌ కోసం చింతిస్తూ బతకొద్దని దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘హ్యాపీ నౌ హియర్‌’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Updated : 31 Dec 2022 17:15 IST

హైదరాబాద్‌: భవిష్యత్‌లో సంతోషంగా ఉంటామని వర్తమానంలో ఉన్న ఆనందాన్ని వదిలేస్తున్నామని, ఇప్పుడు, ఈ క్షణమే కాదు.. ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా ఆస్వాదించాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్‌’ (Puri Musings) పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘హ్యాపీ నౌ హియర్‌’ గురించి మాట్లాడారు.

‘‘మనందరి కోరిక ఒకటే. సంతోషంగా ఉండటం. అలా ఉండాలంటే దాని ముందు చిన్న కష్టం కూడా ఉండాలి. ఎందుకంటే కష్టం తర్వాత సంతోషం వస్తుందని మనందరికీ తెలుసు. అందుకే ఆ కష్టం కూడా మనమే క్రియేట్‌ చేసుకుని, చింతిస్తూ ఉండటం అలవాటు చేసుకున్నాం. ‘హమ్మయ్య రేపు మన కష్టాలు తీరిపోతాయి’ అనుకుంటాం. అంటే, రేపటిలో మన ఆనందాలని వెతుక్కుంటాం. మన ఆనందాన్ని రేపటికి వాయిదా వేసేసినట్లే. ‘వచ్చే సంవత్సరం కుమ్మేద్దాం’ అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ క్షణం ఏమైంది? ‘నీకు దమ్ముంటే, ఈ రోజు కుమ్మేయ్‌.. వచ్చే సంవత్సరం ఎందుకు’’

‘‘కొత్త సంవత్సరంలో కొన్ని తీర్మానాలు రాసి పెట్టుకుంటాం. ‘జనవరి 1 నుంచి మందు మానేద్దాం.. పేకాట ఆపేద్దాం. ఉదయం నిద్రలేచి యోగాలాంటివి చేసేద్దాం’ అనుకుంటాం. మొదటి వరకూ ఎందుకు ఇవాళే తాగడం మానేయ్‌.. నీకు దమ్ముంటే ఈ డిసెంబరు 31 సెలబ్రేట్‌ చేయడం మానేయ్‌.. చక్కగా భోజనం చేసి, 9గంటలకే పడుకో.. అలా చేయగలవా? చేయవు. రాత్రి అంతా తాగి తందనాలు ఆడతావు. గోల చేయాలి. మరుసటి రోజు ఎప్పుడో లేవాలి. రేపటి ఆనందం కోసం ఈరోజు ఆనందాలను వదిలేస్తున్నావు. వర్తమానాన్ని మంట గలుపుతూ భవిష్యత్‌ ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. నీ చేతుల్లో ఉన్న ఇప్పుడు, ఈ క్షణాన్ని ఎప్పుడూ పట్టించుకోవు. దాంట్లో ఆనందం ఎప్పుడూ కనిపించదు. అందుకే ఆనందంగా ఉండాలనే కోరిక కలగానే మిగిలిపోతుంది’’

‘‘ఇవాళ నువ్వు ఆనందంగా లేకపోతే, నీ న్యూఇయర్‌ ఎప్పుడూ బాగుండదు. అలాగే, రేపటి ఆనందం కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నావంటే అర్థమేంటి? నీకు ఆనందంగా ఉండటం తెలియదు. మనశ్శాంతిగా ఉండటం తెలియదు. ‘ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, ఏదో ఒక రోజు నేను బాగుంటానులే. కష్టాలు తీరిపోతాయిలే’ అనుకుంటూ బతుకుతుంటే, ఆ రోజు ఎప్పుడూ రాదు. నిన్న గురించి ఆలోచిస్తూ ఈరోజు హ్యాపీగా ఉండటం. రేపట్లో ఆనందాన్ని వెతుక్కుంటూ బతకడం తప్పు కదా! ఈరోజు డిసెంబరు 31 ప్రపంచమంతా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. నీ స్నేహితులు అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడ చూసినా సందడి. ఇంత మంది ఎందుకు ఆనందంగా ఉన్నారో మనకు అనవసరం. వాతావరణం బాగుంది. వాళ్లతో కలిసిపో.. డ్యాన్స్‌ చెయ్‌. ఆనందించు. ఈరోజు ఆనందం కోసం ఏదైనా చేయి తప్ప, రేపటి న్యూఇయర్‌ కోసం ఏదో చేయొద్దు. ‘రేపు నా జీవితం బాగుంటుంద’ని తాగొద్దు.  ఈక్షణం, నా లైఫ్‌ బాగుందని తాగు. దయచేసి కొత్త సంవత్సరం తీర్మానాలు పెట్టుకోవద్దు. ఒక వేళ మారిపోవాలనుకుంటే ఈరోజే మారిపో. రేపు పేరు చెప్పి, నాటకాలు ఆడొద్దు. ఆనందం ఎప్పుడూ భవిష్యత్‌లో ఉండదు. వర్తమానంలోనే ఉంటుంది. హ్యాపీ నౌ హియర్‌..’’ అని పూరి జగన్నాథ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని