ATM: వినూత్న కథాంశంతో.. ‘ఏటీఎం’

దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజుల కాంబినేషన్‌లో ‘ఏటీఎం’ (ఎనీ టైమ్‌ మెమొరీ) పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందనుంది. దీనికి హరీష్‌ కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా

Updated : 28 Jan 2022 07:04 IST

దర్శకుడు హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజుల కాంబినేషన్‌లో ‘ఏటీఎం’ (ఎనీ టైమ్‌ మెమొరీ) పేరుతో ఓ వెబ్‌సిరీస్‌ రూపొందనుంది. దీనికి హరీష్‌ కథ అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. సి.చంద్రమోహన్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి వెబ్‌సిరీస్‌ ఇది. హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి, హరీష్‌ శంకర్‌ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో విడుదల కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ ‘‘మా మేనేజర్‌ కల్యాణ్‌ వల్లే ఈ సిరీస్‌ చేశాం. తన వల్లే నేనీ కథ రాశాను. దీన్ని చంద్రమోహన్‌ ఎపిసోడ్‌లుగా విడగొట్టి.. మళ్లీ నాకు వినూత్నంగా చెప్పాడు. తను మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు. ఈ సిరీస్‌తో జర్నలిస్ట్‌ ఫణిని రచయితగా పరిచయం చేస్తున్నాం. ఈ సిరీస్‌తో మా దిల్‌రాజన్న, హన్షిత, హర్షిత్‌, శిరీష్‌ డిజిటల్‌ రంగంలోకి ప్రవేశించారు. జీ5 సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

‘‘డిస్ట్రిబ్యూటర్‌గా విజయాలు సాధించిన తర్వాత నెక్స్ట్‌ ఏంటి? అనుకున్నప్పుడు నిర్మాతగా మారాలనుకున్నా. అలా ‘దిల్‌’తో నిర్మాతగా మారా. ఇప్పుడు సినిమాలో మార్పులొస్తున్నాయి. తర్వాత ఏంటి? అనే ప్రశ్న ఎదురైంది. ఈ క్రమంలోనే దిల్‌రాజు ప్రొడక్షన్‌ను ప్రారంభించి.. హిందీలో ‘జెర్సీ’, ‘హిట్‌’ చిత్రాలు పూర్తి చేశా. తెలుగులో కొత్తగా ఏం చేయాలి అనుకున్నప్పుడు హరీష్‌ నాకు ఫోన్‌ చేసి చంద్రమోహన్‌ కాన్సెప్ట్‌ గురించి చెప్పాడు. నాకది బాగా నచ్చడంతో జీ5తో కలిసి ఈ సిరీస్‌ ప్రారంభించాం. కొత్త కాన్సెప్ట్‌తో.. హరీష్‌ శంకర్‌ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ చేస్తున్నాం. త్వరలో మరిన్ని కొత్త కంటెంట్‌ సినిమాల్ని తీసుకురానున్నాం’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. దర్శకుడు చంద్రమోహన్‌ మాట్లాడుతూ ‘‘నాకీ అవకాశమిచ్చిన హరీష్‌ శంకర్‌, నిర్మాత దిల్‌రాజు గారికి థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత హన్షిత, జీ5 ప్రతినిధి పద్మ, ఫణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని