Harish Shankar: వాళ్లను బ్లాక్‌ చేయడానికి కారణమదే: హరీశ్‌ శంకర్‌

విమర్శలు స్వీకరించడంలో తాను వెనకాడనని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) తెలిపారు. అయితే, ట్విటర్‌ వేదికగా కొంతమంది నెటిజన్లను తాను బ్లాక్‌ చేయడానికి ఓ కారణం ఉందని ఆయన వెల్లడించారు.

Published : 14 May 2023 01:45 IST

హైదరాబాద్‌: ట్విటర్‌ వేదికగా తనపై విమర్శలు చేస్తోన్న పలువురు నెటిజన్లను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) గతంలో బ్లాక్‌ చేశారు. అయితే, అందుకు గల కారణాన్ని తాజాగా ఆయన బయటపెట్టారు. అభ్యంతరకర పదాలను వాడటం వల్లే వాళ్ల ఖాతాలను బ్లాక్‌ చేశానని చెప్పారు.

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustaad Bhagat Singh) గ్లింప్స్‌ చూసిన ఓ నెటిజన్ తన ఆనందాన్ని బయటపెడుతూ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టాడు. ‘‘సారీ అన్నా.. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. గ్లింప్స్‌ చూసిన తర్వాత గిల్టీగా ఫీలవుతున్నా. మీరు బ్లాక్‌ చేసిన వాళ్లందర్నీ దయచేసి అన్‌బ్లాక్‌ చేయండి’’ అని అతడు రాసుకొచ్చాడు. దీనిపై హరీశ్‌ స్పందిస్తూ.. ‘‘మనలో మనకు గిల్టీ ఫీలింగ్‌ ఏంటి తమ్ముడు. మనమంతా ఒక్కటే. సినిమాని ఎంజాయ్‌ చేయండి. బూతులు మాట్లాడిన వాళ్లను మాత్రమే నేను బ్లాక్‌ చేశాను. విమర్శలను స్వీకరించడానికి నేను వెనకాడను’’ అని వివరణ ఇచ్చారు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తోన్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. శ్రీలీల కథానాయిక. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఇది రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా ప్రకటించినప్పుడు ‘తెరీ’ రీమేక్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారంటూ సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో పలువురు అభిమానులు.. ‘‘మీ కాంబోలో వస్తోంది ‘తెరీ’ రీమేకా?’’, ‘‘తెరీ’ సినిమా ‘పోలీసోడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మళ్లీ అదే సినిమా ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ హరీశ్‌కు ట్వీట్స్‌ పెట్టారు. కొంతమంది అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన కొన్ని ప్రొఫైల్స్‌ను బ్లాక్‌ చేశారు. మరోవైపు, ఇటీవల విడుదలైన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ గ్లింప్స్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని