Harish Shankar: పక్కవాడి సినిమా పోతే చప్పట్లు కొట్టడం.. దారుణం!: హరీశ్‌ శంకర్‌

Harish Shankar: ‘బలగం’ మూవీ విజయోత్సవ సభలో హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అందరూ ఒక్కటిగానే ఉండాలని హితవు పలికారు.

Published : 12 Mar 2023 01:44 IST

హైదరాబాద్‌: ‘కేజీయఫ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇలా ఏ సినిమా హిట్టయినా ఇండస్ట్రీలో  ఉన్నవారంతా సెలబ్రేట్‌ చేసుకుంటారని, పక్కవాడి సినిమా పోతే చప్పట్లు కొట్టడమనేది కామన్‌సెన్స్‌ లేనివాళ్లు చేసే పని అని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) అన్నారు. వేణు దర్శకత్వం తెరకెక్కిన చిత్రం ‘బలగం’ (Balagam) . ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో హరీశ్‌ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సినిమా పరిశ్రమ ఉమ్మడి కుటుంబంలాంటిదని అన్నారు.

‘‘ఇది క్లాస్‌ సినిమా.. కమర్షియల్‌ సినిమా. ఇది మాస్‌ సినిమా అంటూ కొన్ని రోజులుగా దీనిపై చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఇండస్ట్రీ, మీడియా అవగాహన కోసం పెట్టుకునే పేర్లు. ఆడియన్స్‌ ఇవన్నీ చూడరు. మంచి సినిమానా? కాదా? అని మాత్రమే చూస్తారు. ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’ సినిమాలకు బళ్లు కట్టుకుని వెళ్లారు. వాటిలో ఏ సుమోలూ ఎగరలేదు. రక్తపాతాలు జరగలేదు. విపరీతమైన మాస్‌ పీపుల్‌ కూడా చూశారు. అది క్లాస్‌ సినిమానా? మాస్‌ సినిమానా అని ఎలా డిసైడ్‌ చేస్తాం. ‘సాగర సంగమం’లో ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఫ్లాష్‌ బ్యాక్‌ ఉంటుంది. కమల్‌హాసన్‌ డ్యాన్స్‌ గురించి శైలజగారికి చెబుతారు. ఆ సీన్‌ చూస్తున్న ప్రేక్షకుడికి ఒళ్లు పులకరిస్తుంది. అలాగే ‘నా పేరు బాషా.. మాణిక్‌ బాషా’ అన్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ‘బలగం’ చూసి అనిల్‌ రావిపూడి, వంశీ పైడిపల్లి, త్రినాథరావు లాంటి కమర్షియల్‌ దర్శకులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్ర పరిశ్రమ ఉమ్మడి కుటుంబం లాంటిది. ఒకడు రూ.300 కోట్ల సినిమా తీసినా, మరొకడు రూ.3కోట్ల సినిమా తీసినా అది మన సినిమానే. మనం ఫైట్‌ చేయడానికి బయట వంద విషయాలున్నాయి. ఒకడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటాడు. మరొకడు డైలాగ్స్‌ బాగోలేదని, లిరిక్స్‌ ఇలా పెట్టాలని, సెన్సార్‌ వాళ్లు ఎలా వదిలేశారని అంటుంటారు. మనమంతా కుటుంబంగా ఉండి ఇలాంటి వాటితో పోరాడాలి. మనలో మనం గొడవ పడకూడదు. సైకిల్‌ మీద వెళ్లేవాడు పిల్ల గాలిని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకుంటాడు. కారులో వెళ్లేవాడు మ్యూజిక్‌ వింటూ వేగంగా వెళతాడు. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమాలు తీయాలంటే పెద్ద స్టార్లు, డైరెక్టర్లు కావాలి. ఇలాంటి సినిమా తీయాలంటే పెద్ద మనసు ఉండాలి. అది దిల్‌రాజుగారి దగ్గర ఉంది’’ అని హరీశ్‌ శంకర్‌ చెప్పారు.

దర్శకుడు వేణు ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోలేదని హరీశ్‌ శంకర్‌ అన్నారు. ‘‘జబర్దస్త్‌’తో పాటు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎంతో అనుభవం ఉంది. వేణు తన మూలాలను మర్చిపోలేదు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు తేజను కూడా గుర్తు చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా తీశాడు. పెరుగన్నం, బిర్యాని ఎవరికి నచ్చింది వారు తింటారు. ఇండస్ట్రీలో ఉన్న మనం రెండూ అమ్ముతున్నాం కాబట్టి, మొదట బిర్యాని తినండి బాగుంటుంది. ఆ తర్వాత పెరుగన్నం తినండి ఇంకా బాగుంటుందని చెప్పండి. ఒక మనిషిని పొగడాలంటే, మరొక మనిషిని ఎందుకు తిట్టాలి. ‘కేజీయఫ్‌’, ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఏది హిట్టయినా మన అందరం సెలబ్రేట్‌ చేసుకుంటాం. ఎందుకంటే కొనేవాళ్ల దగ్గర డబ్బు ఉంటే మన తర్వాతి సినిమాను వాళ్లు కొంటారు. పక్కవాడి సినిమా పోతే చప్పట్లు కొట్టడం అనేది కామన్‌సెన్స్‌ లేని వాళ్లు చేసేది. ‘బలగం’ చూసి ఎమోషన్‌ అయి కన్నీటితో అందరూ థియేటర్‌ నుంచి బయటకు వస్తున్నారు. మేము మంచి కమర్షియల్‌ సినిమాలు చేస్తాం. మిమ్మల్ని డ్యాన్స్‌ వేయించే అలరించే చిత్రాలూ చేస్తాం’’ అని హరీశ్‌ శంకర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని