harom hara review: రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్‌ పడిందా?

సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్‌ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 25 Jun 2024 16:21 IST

Harom Hara Review: చిత్రం: హరోం హర; నటీనటులు: సుధీర్‌బాబు, సునీల్, మాళవికా శర్మ, వి.జయప్రకాశ్, లక్కీ లక్ష్మణ్, అర్జున్‌ గౌడ, రవి కాలే, అక్షరా గౌడ తదితరులు; సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌; ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథన్‌; రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారక; నిర్మాతలు: సుమంత్‌ జి.నాయుడు; విడుదల తేదీ: 14-06-2024

ఫలితాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆది నుంచీ ప్రయోగాత్మక కథలతోనే అలరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు హీరో సుధీర్‌బాబు (Sudheer Babu). కానీ, ఇటీవల కాలంలో ఆయన నుంచి వచ్చిన ఏ ఒక్క చిత్రమూ హిట్టు మాట వినిపించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి విజయమే లక్ష్యంగా ‘హరోం హర’తో బాక్సాఫీస్‌ బరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్ర కథేంటి?(Harom Hara Review) ఈ సినిమాతోనైనా సుధీర్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కారా?

కథేంటంటే: అది 80వ దశకం. కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని తమ్మిరెడ్డి (లక్కీ లక్ష్మణ్‌), అతని తమ్ముడు బసవరెడ్డి (రవి కాలె) దారుణమైన అకృత్యాలకు పాల్పడుతుంటారు. కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేయడం.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం.. తమకెదురొచ్చిన వారిని దారుణంగా హతమార్చడం వాళ్లకు నెత్తుటితో పెట్టిన విద్య. అందుకే వాళ్లకు భయపడి ఆ ఊరిలో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అలాంటి కుప్పం ప్రాంతంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోకి ల్యాబ్‌ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రహ్మణ్యం. ఓసారి అనుకోని పరిస్థితుల్లో తమ్మిరెడ్డి గ్యాంగ్‌తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో తండ్రి శివారెడ్డి (జయప్రకాశ్‌) చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు సంపాదించడం కోసం తన మిత్రుడు, సస్పెండ్‌ అయిన పోలీస్‌ పళని స్వామి (సునీల్‌)తో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆయుధాల అక్రమ తయారీ వ్యాపారంలో సుబ్రహ్మణ్యం ఏస్థాయికి వెళ్లాడు? ఈ క్రమంలో అతనికి ఎంత మంది శత్రువులయ్యారు? వాళ్ల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? ఆఖరికి తమ్మిరెడ్డి గ్యాంగ్‌ నుంచి కుప్పం ప్రాంతాన్ని ఎలా కాపాడాడు?(Harom Hara Review) అన్నది మిగిలిన కథ.

ఎలా సాగిందంటే: ఈ చిత్ర టీజర్, ట్రైలర్లు చూసినప్పుడు అందర్నీ ఆకర్షించిన అంశం హీరో గన్‌ స్మిత్‌ పాత్రలో కనిపించడం. నిజానికి ఈ తరహా పాత్ర తెలుగులో ఇంత వరకు రాలేదు. ఇక ప్రచార చిత్రాల్లో కనిపించిన యాక్షన్‌ హంగామా, నేపథ్య సంగీతం, కలర్‌ టోన్‌ అన్నీ కొత్తదనం నింపుకొని ఆకర్షణీయంగా కనిపించాయి. కాకపోతే ఇన్ని విషయాల్లో బలంగా కనిపించిన ఈ చిత్రం.. కథనాన్ని నడిపిన విధానంలో మాత్రం పూర్తిగా రొటీన్‌ రోటి పచ్చడిలా మారిపోయింది. ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’, ‘సలార్‌’, ‘విక్రమ్‌’ ఇలా ఇటీవల కాలంలో వచ్చిన హిట్‌ యాక్షన్‌ థ్రిల్లర్లన్నింటినీ మిక్సీలో వేసి తీసిన వెర్షన్‌లా కనిపిస్తుంది. (Harom Hara Review) ఇక సినిమాలో కనిపించే తండ్రీకొడుకుల సెంటిమెంట్‌ కానీ, నాయకానాయికల లవ్‌ట్రాక్‌ గానీ ఏదీ ఎమోషనల్‌గా పెద్దగా కనెక్ట్‌ కాదు. అసలు ఈ కథలో హీరోకి.. విలన్‌కు మధ్య బలమైన సంఘర్షణే కనిపించదు.

‘పుష్ప’, ‘కేజీయఫ్‌’ చిత్రాల తరహాలో హీరో గురించి అతని అసిస్టెంట్‌ పళనిస్వామి ఇచ్చే ఎలివేషన్స్‌తో కథ సాదాసీదాగా మొదలవుతుంది. ఆ వెంటనే తమ్మిరెడ్డి అరాచకాలను చూపించి.. ఓ మంచి పాటతో సుబ్రహ్మణ్యం పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. తను వచ్చీ రాగానే అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో కొట్లాటకు దిగాల్సి రావడం.. ఈ క్రమంలో ఉద్యోగం పోగొట్టుకోవడం.. మరోవైపు ఊళ్లో తండ్రి చేసిన అప్పులు తీర్చే బాధ్యత భుజాలపై పడటం.. ఆ దశలో తుపాకుల తయారీకి నడుం బిగించడం కథ కాసేపు చకచకా పరుగులు తీసినట్లు అనిపిస్తుంది. కానీ, తర్వాత నుంచి ఆ ప్రయాణంలో వేగం కనిపించదు. తుపాకుల తయారు చేసే క్రమంలో హీరోకి ఎదురయ్యే సవాళ్లు ఏమీ కనిపించవు. ఇక దాన్ని ఓ వ్యాపారంలా మార్చుకొని ఓ శక్తిగా ఎదిగే తీరులోనూ సవాల్‌ విసిరే అంశాలు ఒక్కటీ ఉండవు. దీంతో ప్రేక్షకులు ఏ దశలోనూ సుబ్రహ్మణ్యం పాత్రతో కలిసి ప్రయాణం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. (Harom Hara Review) ఇక వీటన్నింటిని మధ్య వచ్చే నాయకానాయికల లవ్‌ట్రాక్, బలవంతంగా ఇరికించినట్లు కనిపించే ఫాదర్‌ సెంటిమెంట్‌ ట్రాక్‌ ప్రేక్షకుల ఇబ్బంది పెడతాయి. విరామ సన్నివేశాలు కాస్త ఆసక్తిరేకెత్తించేలా ఉన్నా.. ద్వితీయార్ధం ఆరంభమైన కాసేపటికే ఆ ఆసక్తి ఆవిరైపోతుంది. సెకండాఫ్‌ ఆరంభంలోనే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ సెట్‌ చేశారు దర్శకుడు. ఆ ఎపిసోడ్‌లో తమ్మిరెడ్డి ఎదురుగానే అతని సోదరుడ్ని చంపిన హీరో.. తనను మాత్రం పాత సినిమాల తరహాలో ప్రాణాలతో వదిలేస్తాడు. నిజానికి అక్కడే కథ ముగించి ఉంటే ప్రేక్షకులకు మరో అరగంట శిరోభారం తప్పేది. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కథంతా సాగతీత వ్యవహారమే. మధ్యలో ఒకటి రెండు యాక్షన్‌ ఎపిసోడ్‌లు కాస్త కాలక్షేపాన్నిచ్చినా.. ముగింపు మాత్రం ఓ ప్రహసనంలా సాగింది. నిజానికి క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఆరంభంలో కాస్త అలరించినా.. నిడివి ఎక్కువయ్యే సరికి శుభం కార్డు కోసం ఎదురు చూడాల్సి వస్తుంది.

Malvika Sharma: లాయర్‌+ యాక్టర్‌= మాళవిక శర్మ

ఎవరెలా చేశారంటే: సుధీర్‌బాబు తన కెరీర్‌లో ఇంత వరకు సుబ్రహ్మణ్యం వంటి మాస్‌ యాక్షన్‌ పాత్ర పోషించలేదు. కానీ, ఆ పాత్రకు తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో విశ్వరూపం చూపించిన ఆయన.. ఎమోషనల్‌ సీన్స్‌లో చాలా సెటిల్డ్‌గా నటించారు. మాళవిక తెరపై అందంగా కనిపించినా.. కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదు. పళనిస్వామి పాత్రలో సునీల్‌ తెరపై ఆద్యంతం కనిపిస్తారు. కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ఇక తెరపై పదుల సంఖ్యలో ప్రతినాయకులు కనిపించినా ఏ ఒక్కరి పాత్రా గుర్తుంచుకునేలా ఉండదు. (Harom Hara Review) దర్శకుడిలో మాస్‌ యాక్షన్‌ చిత్రాలు చేయగల సత్తా ఉన్నప్పటికీ కథ, కథనాల్లో కొత్తదనం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితం అందుకోలేకపోవచ్చు. అయితే కుప్పం యాసలో తను రాసుకున్న సంభాషణలు సహజత్వంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం సినిమాకి బలంగా నిలిచింది. ముఖ్యంగా హీరో ఇంట్రో పాటతో పాటు నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. అరవింద్‌ ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + సుధీర్‌బాబు నటన
  • + యాక్షన్‌ సీక్వెన్స్‌
  • + నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం
  • బలహీనతలు
  • - రొటీన్‌గా సాగే కథ, కథనాలు..
  • - కొరవడిన భావోద్వేగాలు
  • చివరిగా: ‘హరోం హర’.. సెప్పడానికి ఇంకేం లేదు! (Harom Hara Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని