Hema Chandra - Sravana Bhargavi: విడాకుల వార్తలపై హేమచంద్ర, శ్రావణ భార్గవి క్లారిటీ

టాలీవుడ్‌ సింగర్స్‌ జోడీ హేమచంద్ర (Hema Chandra), శ్రావణ భార్గవి (Shravana Bhargavi) విడిపోతున్నారంటూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది....

Published : 29 Jun 2022 15:07 IST

ఇన్‌స్టాలో పోస్టులు పెట్టిన స్టార్‌ సింగర్స్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సింగర్స్‌ జోడీ హేమచంద్ర (Hema Chandra), శ్రావణ భార్గవి (Sravana Bhargavi) విడిపోతున్నారంటూ గత కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అవన్నీ అవాస్తవాలు అని ఈ జోడీ వెల్లడించింది. ఈ మేరకు హేమచంద్ర, శ్రావణ భార్గవి ఇన్‌స్టా వేదికగా తాజాగా పోస్టులు పెట్టారు.

‘‘నా సోలో పాటల కంటే ఇలాంటి అనవసర, అప్రస్తుత, పనికిరాని సమాచారం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది’’ అని హేమచంద్ర పోస్ట్‌ పెట్టారు. ‘‘గడిచిన కొన్ని రోజుల నుంచి నా యూట్యూబ్‌ ఛానల్‌ వ్యూస్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ విపరీతంగా పెరిగిపోయారు. సాధారణం కంటే ఇప్పుడు ఎక్కువ వర్క్‌, సంపాదన లభిస్తోంది. తప్పో ఒప్పో కానీ మీడియా నాకో వరం’’ అని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. వీరిద్దరూ పెట్టిన పోస్టులతో వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్‌లో రాణిస్తున్న తరుణంలోనే హేమచంద్ర - శ్రావణ భార్గవి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 2009లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని, గత కొన్నిరోజులుగా విడివిడిగా ఉంటున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ సింగర్స్‌ పెట్టిన పోస్టులతో ఆ వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది.

‘పరుగు’లో ‘హృదయం ఓర్చుకోలేనిది’, ‘బాణం’లో ‘నాలో నేనేనా’, ‘బిల్లా’లో ‘బొమ్మాళి’, ‘శక్తి’లో ‘ప్రేమదేశం యువరాణి’ పాటలు హేమచంద్రకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పలువురు హీరోలకు డబ్బింగ్‌ చెప్తుంటారు. ‘సింహా’లోని ‘సింహమంటి చిన్నోడే’తో పాటు ‘బద్రీనాథ్‌’, ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘తీన్‌మార్‌’, ‘సోలో’ చిత్రాలతో శ్రావణ భార్గవికి సింగర్‌గా అందర్నీ అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని