Allu arjun: అల్లు అర్జున్‌ ఎలా ఉన్నా హీరోనే..: హేమ మాలిని

అల్లు అర్జున్‌పై (Allu arjun) అలనాటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ హేమమాలిని (Hema malini) ప్రశంసలు కురిపించారు. ఎలాంటి గెటప్‌లోనైనా బన్నీ హీరోలా ఉంటాడని అన్నారు.

Published : 12 May 2023 12:03 IST

హైదరాబాద్‌: ప్రతి సినిమాలోనూ వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్‌. సినీ ప్రియులే కాదు అగ్ర నటీనటులు కూడా బన్నీపై ప్రశంసలు కురిపించిన సందర్భాలు ఎన్నో. తాజాగా అల్లు అర్జున్‌ (Allu arjun) గురించి అలనాటి ‘బాలీవుడ్‌ డ్రీమ్‌గర్ల్‌’ హేమమాలిని (Hema malini) మాట్లాడారు. ఆయన నటించిన పాత్రల గురించి ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు.

ఓ ఇంటర్వ్యూలో అతడి గురించి హేమమాలిని మాట్లాడుతూ.. ‘‘నాకు బన్నీ నటించిన ‘పుష్ప’ (Pushpa) చాలా నచ్చింది. అందులో అతడి లుక్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాలో అతడి డ్యాన్స్‌ను చాలా మంది అనుకరించారు. సెలబ్రిటీలు కూడా ఆ డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేశారు. గతంలో నేను చూసిన ఒక సినిమాలో అల్లు అర్జున్‌ చాలా అందంగా.. స్టైల్‌గా ఉన్నాడు. అలా ఉండే అతడు.. ‘పుష్ప’ కోసం పూర్తిగా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. లుంగీ కట్టుకుని మాస్‌గా కనిపించాడు. ఎలాంటి గెటప్‌ వేసినా అతడు హీరోలానే ఉంటాడు. అలా డీ గ్లామర్‌ పాత్రలో నటించడానికి అతడు అంగీకరించడం ఎంతో అభినందనీయమైన విషయం. మన హిందీ సినిమాల్లో హీరోలు అలా కనిపించడానికి, అలాంటి పాత్రలు చేయడానికి ఆలోచిస్తారు. ఒక సినిమాలో కాస్త నల్లగా కనిపించాలంటే హీరో ధర్మేంద్ర వెనుకాడారు. ఈ విషయం నాకు ఇప్పటికీ గుర్తే’’ అని అన్నారు.

ఇక ‘పుష్ప’తో బన్నీ క్రేజ్‌ అంతర్జాతీయ స్థాయికి చేరింది. విదేశాల్లోనూ అతడి సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఐకాన్‌ స్టార్‌ పుష్ప సీక్వెల్‌లో (Pushpa 2) నటిస్తున్నాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన బన్నీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని