Bigg boss 5: ఈ వారం నామినేట్‌ అయింది వీళ్లే.. శ్రీరామ్‌ vs కాజల్‌, సన్నీ

బిగ్‌బాస్‌(Bigg boss) హౌస్‌లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ హోరా హోరీగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు,

Updated : 23 Nov 2021 15:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌బాస్‌(Bigg boss 5) హౌస్‌లో ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియ హోరా హోరీగా సాగింది. ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు, వాదోపవాదాలతో రసవత్తరంగా ముగిసింది. కెప్టెన్‌ అయిన మానస్‌(Manas) మినహా ఇంటి సభ్యులు రవి(Ravi), సన్నీ(sunny), శ్రీరామ్‌(sri ram), కాజల్‌(kajal),  సిరి(siri), ప్రియాంక(Priyanka), షణ్ముఖ్‌(Shanmukh)లు ఈ వారం నామినేట్‌ అయ్యారు. అంతకుముందు సన్నీ బాత్రూమ్‌లు సరిగా క్లీన్‌ చేయటం లేదని కెప్టెన్‌ మానస్‌కు రవి ఫిర్యాదు చేశాడు. సన్నీతో చెప్పి శుభ్రంగా కడిగిస్తానని మానస్‌ సర్ది చెప్పాడు. ఆ తర్వాత బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అవ్వటానికి ముఖ్యమైంది నమ్మకమే అంటూ మానస్‌, సన్నీ మాట్లాడుకున్నారు. ఇద్దరం కలిసి మళ్లీ కెప్టెన్స్‌ అవుదామని అనుకున్నారు.

కుండ బద్దలు కొట్టు.. నామినేషన్‌లోకి నెట్టు..

ఈ వారం నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల దిష్టి బొమ్మలు, మట్టి కుండలు పెట్టాడు. హౌస్‌లో కొనసాగే అర్హత లేని కంటెస్టెంట్‌ ఎవరో ఆ వ్యక్తి దిష్టి బొమ్మకు కుండను తగిలించి తగిన కారణాలు చెప్పి పగలగొట్టమని చెప్పాడు. సన్నీ డ్యూటీలు సరిగా చేయటం లేదని రవి అతడిని నామినేట్‌ చేశాడు. సన్నీ బదులు తాను బాత్రూమ్‌లు కడిగినట్లు చెప్పాడు. ఈ నామినేషన్‌తోనైనా చక్కగా పనిచేయాలని సూచించాడు. షణ్ముఖ్‌-సిరి ముందే మాట్లాడుకుని వచ్చారని రవి తనతో అన్నాడు  నిజమా? అని కాజల్‌ ప్రశ్న రాయటం దాన్ని వీకెండ్‌లో నాగార్జున ప్రస్తావించటం నచ్చలేదని రవి మండిపడ్డాడు. ఈ వివాదంలోకి తన పేరు తీయడం సరిగా లేదని కాజల్‌ను నామినేట్‌ చేశాడు. తాను గేమ్‌ సరిగా ఆడటం లేదని షణ్ముఖ్‌ చెప్పడం నచ్చలేదని, ఏదైనా ఉంటే ముఖం మీద మాట్లాడమంటూ షణ్ముఖ్‌, సిరిలను ప్రియాంక నామినేట్‌ చేసింది.

కెప్టెన్‌, సంచాలక్‌గా రవి సరిగా వ్యవహరించలేదంటూ రవిని షణ్ముఖ్‌ నామినేట్‌ చేశాడు. తనకి ఏదో ఒక పని చెప్పకుండా ఇష్టం వచ్చిన పని చెప్పాడని షణ్ముఖ్ ఆరోపించాడు. ఇక టీ-షర్ట్‌ టాస్క్‌ విషయంలో సరిగా వ్యవహరించలేదని తెలిపాడు. తనని, సిరిని కలిపి అలా ప్రశ్న అడగటం నచ్చలేదని కాజల్‌ను నామినేట్‌ చేశాడు.

శ్రీరామ్‌ Vs కాజల్‌, సన్నీ

నామినేషన్స్‌ సందర్భంగా శ్రీరామ్‌, కాజల్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫైరింజన్‌ ఎక్కి నిర్ణయం తీసుకోకుండా సిరి, అనీ మాస్టర్‌ ఫొటోలు కాలిపోయేలా చేయటం తనకు నచ్చలేదని శ్రీరామ్‌ చెప్పాడు. ఇద్దరినీ నాశనం చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు. (గేమ్‌లో భాగంగా అంతకు ముందు రవి-శ్రీరామ్‌ మాట్లాడుకుంటూ కాజల్‌, సన్నీ ఫొటోలు వస్తే ఇద్దరివి కాలిపోయేలా చేద్దాం అనుకున్నారు.) మైనింగ్‌ హ్యాట్‌ పెట్టుకుని గేమ్‌ ఆడటానికి వచ్చిన తన నుంచి హ్యాట్‌ తీసుకున్నాడని అందుకే సన్నీని నామినేట్‌ చేస్తున్నట్లు చెప్పాడు. మానస్‌ తన స్నేహితుడని, అనీ మాస్టర్‌ మీద గౌరవం ఉందని అందుకే వారి హ్యాట్‌లు తీసుకోలేదని సన్నీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ విషయమై ముందే శ్రీరామ్‌ను అడిగినట్లు కూడా చెప్పాడు. ఈ సందర్భంగా సన్నీ, శ్రీరామ్‌ల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. గ్రూప్‌ గేమ్‌పై చర్చ రాగా, ‘తాను, రవి, షణ్ముఖ్, సిరిలు ఒక గ్రూప్‌ అంటూ, ఐదు కోట్ల తెలుగు వారు తానూ ఒక గ్రూప్‌’ అని శ్రీరామ్‌ అనగా, ‘ఆ గ్రూప్‌నకు నేనే లీడర్‌’ అంటూ సన్నీ పంచ్‌ డైలాగ్‌ వేశాడు.

‘నన్ను మచ్చా అని పిలవద్దు’: శ్రీరామ్‌ 

గత వారం రవి గేమ్‌ సరిగా ఆడలేదని తనకు అనిపించిదని, ఇక కెప్టెన్‌గా ఒకేసారి తనకు నాలుగైదు పనులు చెప్పాడని సన్నీ ఆరోపించాడు. ఇంట్లో ఎవరైనా ఫేక్‌ పర్సన్‌ ఉన్నారంటే అది రవినేనంటూ అతడిని నామినేట్‌ చేశాడు. తనని నామినేట్‌ చేసేందుకు చెప్పిన కారణం సరిగా లేదని, శ్రీరామ్‌ను సన్నీ నామినేట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనని ‘మచ్చా’ అని పిలవొద్దని, తన పేరు మైనంపాటి శ్రీరామచంద్ర అని శ్రీరామ్‌ అన్నాడు. ‘గేమ్‌ ఆడటం రాని వాళ్లు తనిని గేమ్‌ ఆడమని చెప్పటం హాస్యాస్పదం అంటూ హేళనగా మాట్లాడాడు.

తనని నామినేట్‌ చేసినందుకు ప్రతిగా ప్రియాంకను సిరి నామినేట్‌ చేసింది. ‘నీ ఇల్లు బంగారం కాను’ టాస్క్‌లో బంగారం దొంగిలించానంటూ తనకు కోల్‌ ఇవ్వటం నచ్చలేదని రవిని సిరి నామినేట్‌ చేసింది. ఆ తర్వాత రవి, శ్రీరామ్‌లను కాజల్‌ నామినేట్‌ చేసింది. ‘ఒకరి ఉసురు పోసుకుని ఎవిక్షన్‌ పాస్‌ తీసుకోవటం బాగోలేదు’ అని శ్రీరామ్‌ అనడం తనకి నచ్చలేదని కాజల్‌ చెప్పింది. ఒకరిని బాధపెట్టి ఆ పవర్‌ తానైతే తీసుకునేవాడిని కాదని శ్రీరామ్‌ చెప్పడం గమనార్హం. చివరిగా శ్రీరామ్‌, రవిలను మానస్‌ నామినేట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని