Vichitra sodarulu: పొట్టికమల్‌ ఇలా పుట్టాడు!

దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. గ్రాఫిక్స్‌ లేని ఆరోజుల్లోనే సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు

Published : 23 May 2022 12:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రెస్‌. గ్రాఫిక్స్‌ లేని ఆరోజుల్లోనే సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి, విజయ ఢంకా మోగించారు. ఇక సింగీతానికి కమల్‌హాసన్‌ తోడైతే అగ్నికి వాయువు తోడైనట్లే. ప్రయోగాలకు పెద్ద వేదిక కావాల్సిందే. వారి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలను చూస్తే ఇది మనకు ఇట్టే అర్థమవుతుంది. ‘అమావాస్య చంద్రుడు’, ‘పుష్పకవిమానం’ ‘విచిత్ర సోదరులు’ ఇలా పలు చిత్రాలు వారి కాంబినేషన్‌లో వచ్చాయి. వీటిలో ‘విచిత్ర సోదరులు’ చిత్రం కాస్త ప్రత్యేకం. ఎందుకంటే ఇందులో కమల్‌ పొట్టివాడిగా కనిపిస్తారు. అసలు కమల్‌హాసన్‌ను అలా ఎలా చూపించారో ఇప్పటికీ చాలామందికి పెద్ద ప్రశ్నే. దీని గురించి సింగీతం శ్రీనివాసరావే ఓ సందర్భంలో పంచుకున్నారిలా..

‘‘అమావాస్య చంద్రుడు’ పూర్తయిన తర్వాత మా కాంబినేషన్‌లో మరో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఇద్దరం అనుకున్నాం. ఆ సినిమాను రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ పతాకంపై కమల్‌ తానే స్వయంగా నిర్మిస్తానన్నారు. అయితే సినిమా ఇలా ఉంటే బాగుంటుందని ఐడియా ఇచ్చింది కూడా కమల్‌హాసనే. కానీ, తొలుత అనుకున్న స్క్రిప్ట్‌ ప్రకారం ‘పొట్టివాడి పాత్ర ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తుంది. కానీ, వారిద్దరూ ఇతన్ని ప్రేమించరు. ఆ సంగతి తెలిసి చివరికి అతను ఎంతో బాధపడతాడు.’ ఇది అనుకున్న కథ. నాలుగైదు రోజులు షూటింగ్‌ కూడా చేశాం. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత పంజు అరుణాచలానికి చెబితే కమల్‌లాంటి వ్యక్తి ఇలాంటి కథతో వస్తే సినిమా ఫ్లాప్‌ అవుతుందని, పగ, ప్రతీకారం కథలో ఉండాలని మార్పులు చెప్పారు. అప్పుడు సెట్స్‌పైకి వెళ్లాం. అయితే, మాకు అత్యంత కష్టమైన పని కమల్‌ను పొట్టివాడిగా చూపించడం. ఇప్పుడంటే గ్రాఫిక్స్‌లో చూపించొచ్చు కానీ, అప్పట్లో అలాంటివేవీ లేవు.’’

‘‘మామూలుగా కనపడేటప్పుడు కమల్‌ నిలబడి మాట్లాడతాడు. ఆయా సన్నివేశాల్లో కమల్‌ నడుం వరకు మాత్రమే లేదా క్లోజప్‌షాట్‌లను మాత్రమే తీశాం. ఇక స్క్రీన్‌పై కమల్‌ పొట్టివాడిగా కనిపించేందుకు ఆయన మోకాళ్లు పట్టేలా, వెనుకవైపు ఓపెన్‌ ఉండేలా 18 అంగుళాల తేలికపాటి షూను ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని తొడిగాం. ఇక నేలమీద కనిపించేటప్పుడు కమల్‌ కాళ్లను భూమిలోపల పాతిపెట్టే వాళ్లం. కమల్‌ ఎక్కడ, ఎప్పుడు ఎలా ఉండాలనే విషయాలన్నీ జపాన్‌ అనే సెట్‌ బాయ్‌ చూసుకునేవాడు. కమల్‌ నడిచే సన్నివేశాల్లో కెమెరా ట్రిక్‌ను ఉపయోగించి తీశాం. నడక సహజంగా ఉండటానికి కమల్‌ చాలా కష్టపడ్డారు. ఇక సోఫాలో కూర్చున్నప్పుడు, బల్లపై నిలబడినప్పుడు కమల్‌ కాళ్లను వెనక్కి మడిచి పైకిలేపి కట్టేవాళ్లం. మానిటర్‌ కూడా లేని ఆరోజుల్లో రీటేక్‌లు లేకుండా కమల్‌ పడిన కష్టం మాటల్లో చెప్పలేం. ‘బుజ్జి పెళ్లి కొడుక్కి రాజయోగమురా’ అనే పాటలో కమల్‌ కాళ్లు వూపే సన్నివేశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా సోఫాను తయారు చేయించి, దానిలోపలికి కమల్‌ దిగి నడుం వరకూ కనపడేలా కూర్చోబెట్టాం. ఆయనకు ముందువైపు కృత్రిమ కాళ్లను అమర్చి ఆ కాళ్లకు వైర్‌ను తగిలించి వూపేవాళ్లం. దీనికి కమల్‌ కష్టంతో పాటు, జపాన్‌ అనే వ్యక్తి సహకారం మర్చిపోలేనిది. అందుకే ‘జపాన్‌ అనే వ్యక్తి లేకపోతే విచిత్ర సోదరులు అనే సినిమా లేదు’ అని సిల్వర్‌ జూబ్లీలో కమల్‌ మెచ్చుకున్నారు.’’ అంటూ ఆనాటి సంగతులను పంచుకున్నారు సింగీతం శ్రీనివాసరావు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని