multiverse movies: కొత్త సినీ ప్రపంచం.. ఈ సినిమాల ప్రత్యేకతేంటో తెలుసా?

సినిమా ప్రపంచం వేగంగా మారిపోతోంది. మల్టీస్టారర్‌/పాన్‌ ఇండియా చిత్రాలు అన్ని భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి.

Published : 17 Jun 2022 09:51 IST

భారతీయ వెండితెరపై మల్టీ యూనివర్స్‌ మూవీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా ప్రపంచం వేగంగా మారిపోతోంది. మల్టీస్టారర్‌/పాన్‌ ఇండియా చిత్రాలు అన్ని భాషల్లోనూ తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త పంథా భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతోంది. అదే మల్టీ యూనివర్స్‌(multiverse movies). ‘అవెంజర్స్‌’ వంటి చిత్రాల ద్వారా హాలీవుడ్‌లో ఇది ఇప్పటికే ట్రెండ్‌ సృష్టించగా, ఇప్పుడు భారతీయ భాషల్లో ఈ హవా కొనసాగుతోంది.

ఏంటీ మల్టీ యూనివర్స్‌: ఒక హీరో లేదా నటుడు సినిమా ఆసాంతం కనిపిస్తే అది సాధారణ చిత్రం. ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు/నటులు ఒకే తెరపై కనిపిస్తే అది మల్టీస్టారర్‌.  వేర్వేరు కథల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాత్రలు ఒక సినిమాలో ఒక పాయింట్‌ దగ్గర కనెక్ట్‌ కావటం, వారందరూ ఒక లక్ష్యం కోసం ముందుకు సాగే చిత్రాలనే ‘మల్టీ యూనివర్స్‌ మూవీస్‌’ అంటారు.  ‘అవెంజర్స్‌’ చిత్రంలో కనిపించే ఐరన్‌మ్యాన్‌, కెప్టెన్‌ అమెరికా, థోర్‌, హల్క్‌, బ్లాక్‌ విడో, హాక్‌ ఐ ఇలా సూపర్‌ వేర్వేరు కథలతో ప్రేక్షకులకు పరిచయమై చివరిగా ఒక లక్ష్యం కోసం కలుస్తారు. దీన్నే మల్టీ యూనివర్స్‌ అంటారు.  ఇప్పుడు ప్రశాంత్‌నీల్‌, లోకేశ్‌ కనకరాజ్‌, అయాన్‌ ముఖర్జీ వంటి దర్శకులు ఇలాంటి మల్టీ యూనివర్స్‌నే భారతీయ ప్రేక్షకులను అందించేందుకు సిద్ధమవుతున్నారు.

కేజీయఫ్‌+సలార్‌+ఎన్టీఆర్‌ 31 ఏదైనా సంబంధం ఉందా?

‘కేజీయఫ్‌2’తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్(Prasanth neel). ప్రస్తుతం ప్రభాస్‌(Prabhas) కథానాయకుడిగా ‘సలార్‌’(Salaar) తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్‌(NTR31)తో మరో సినిమా చేస్తున్నారు. ఇటీవల తారక్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీలుక్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పటివరకూ ప్రశాంత్‌ తీసిన సినిమాలను చూస్తూ ఆయన తీయబోయే తర్వాతి సినిమాలకు కనెక్షన్‌ ఉన్నట్లు అర్థమవుతోంది. అంటే  నీల్‌ తనదైన‘మల్టీ యూనివర్స్‌’ను సృష్టించబోతున్నారు. కేజీయఫ్‌, సలార్‌, ఎన్టీఆర్‌ 31 సినిమాల థీమ్‌ డార్క్‌ గ్రే కలర్‌లో ఉన్నాయి. హీరోలందరూ రఫ్‌లుక్‌లోనే కనిపిస్తున్నారు. కేజీయఫ్‌ గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యం అయితే, సలార్‌ కోల్‌ మైనింగ్‌ అని టాక్‌. మరి ఎన్టీఆర్‌ మూవీ నేపథ్యం ఏంటో తెలియదు.

ఇంతేకాదు, మరో విషయంలోనూ ఈ మూడు సినిమాల మధ్య పోలికలు ఉన్నాయి. ‘కేజీయఫ్‌2’లో ఈశ్వరీరావు కుమారుడి పేరు ‘ఫర్మాన్‌’. రాఖీభాయ్‌ దగ్గర పనిచేస్తూ అధీర చేతికి చిక్కుతాడు. అయితే, అతడిని చంపేశారా? లేదా? అన్నది స్పష్టంగా చూపించలేదు. ఈ క్రమంలో ‘ఫర్మాన్‌’ మెడలో ఉన్న లాకెట్‌ ‘సలార్‌’లో ప్రభాస్‌ మెడలో ఉన్న లాకెట్‌ ఒకేలా ఉన్నాయి. మరి ఫర్మాన్‌ బతికే ఉన్నాడా? సలార్‌లో ప్రభాస్‌ పాత్ర అదేనా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. మరోవైపు ‘సలార్‌’లో జగపతిబాబు రాజమన్నార్‌ అనే విభిన్నమైన పాత్ర పోషిస్తున్నారు. గుబురు గడ్డం, కోరమీసంతో మాస్‌ లుక్‌లో జగపతిబాబు కనిపించారు. తాజాగా ఎన్టీఆర్‌ 31 ప్రీలుక్‌లో ఎన్టీఆర్‌ అచ్చం అలాగే ఉన్నారు.  అసలు ఈ మూడు సినిమాలకూ మధ్య సంబంధం ఉందా? లేదా? ‘కేజీయఫ్‌3’ ఉంటుందా? ఉంటే ఆ కథ ఎలా నడుస్తుంది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


లోకేష్‌ కనకరాజ్‌ యూనివర్స్‌

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh kanakaraj).  ‘మా నగరం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్‌  ఆ తర్వాత ‘ఖైదీ’(khaidi)తో అందరి దృష్టిని ఆకర్షించాడు. లోకేశ్‌ మల్టీ యూనివర్స్‌కు ఈ చిత్రమే బీజం. ఆ తర్వాత విజయ్‌తో తీసిన ‘మాస్టర్‌’ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల విడుదలైన ‘విక్రమ్‌’(Vikram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ రెండు చిత్రాలు డ్రగ్‌ మాఫియా నేపథ్యంలో సాగేవే. ఈ చిత్రాలను కనెక్ట్‌ చేస్తూ లోకేశ్‌ సరికొత్త మల్టీవర్స్‌ సృష్టించబోతున్నారు. ‘ఖైదీ’ క్లైమాక్స్‌లో ఆది శంకరుడు-ఢిల్లీకి మధ్య ఏం జరిగిందో చూపించకుండా సస్పెన్స్‌ క్రియేట్‌ చేశారు. అలాగే ‘విక్రమ్‌’ క్లైమాక్స్‌లో రోలెక్స్‌(suriya) పాత్రను ప్రవేశపెట్టి సినిమాపై అంచనాలను పెంచేశారు. పైగా ఆ పాత్రను సూర్య చేస్తుండటంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఒకవైపు ఏజెంట్‌ ‘విక్రమ్‌’(Vikram) కథ నడుస్తుండగానే మరోవైపు ఢిల్లీ పాత్ర రెఫరెన్స్‌ కూడా ఇందులో చూపించారు.

ఈ సినిమా తర్వాత లోకేశ్‌ విజయ్‌తో ఓ సినిమా చేస్తారని టాక్‌. మరి ఈ చిత్రం వీటికి కనెక్ట్‌ అయి ఉంటుందా? లేదా కొత్త కథా? అన్నది తెలియదు. అయితే, సూర్యతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ‘విక్రమ్‌’ ప్రచారం సందర్భంగా కమల్‌హాసన్‌(kamal haasan) ప్రకటించారు. అంటే ‘విక్రమ్‌-2’ కచ్చితంగా వస్తుందని చెప్పకనే చెప్పారు. అందులో కమాండర్‌ విక్రమ్‌తో పాటు, నలుగురు ఏజెంట్లు ఎలా తప్పించుకున్నారన్న విషయంతో పాటు, అసలు రోలెక్స్‌ కథ ఏంటనేది చూపించవచ్చు. లేదా, పూర్తిగా రోలెక్స్‌ డ్రగ్‌ మాఫియాను శాసించే స్థాయికి ఎలా చేరాడన్న విషయాన్ని తీయవచ్చు. ‘10ఏళ్లు జైలులో ఉన్నానన్నది మాత్రమే మీకు తెలుసు. జైలుకు వెళ్లకముందు ఏం చేసేవాడినో మీకు తెలియదు కదా సర్‌’ పోలీస్‌ ఆఫీసర్‌తో అంటాడు ‘ఖైదీ’లో ఢిల్లీ. మరి ఢిల్లీ గతమేంటి? అతడి భార్య ఎలా చనిపోయింది? ఆది శంకరుడుతో గొడవ ఏంటి? తెలియాలి.

ఇక ఇవి కాకుండా ‘ఖైదీ’, ‘విక్రమ్‌’లలో కొన్ని కీలక పాత్రలు ఉన్నాయి. వాటిని ఎలా డీల్‌ చేస్తారో చూడాలి. పోలీస్‌ ఆఫీసర్‌ బిజోయ్‌, బ్లాక్‌ స్క్వాడ్‌లోని మిగిలిన ఆఫీసర్లు, ఏజెంట్‌ టీనా, కానిస్టేబుల్‌ నెపోలియన్‌, విలన్‌ గ్యాంగ్‌లో ఉండే అమర్‌ ఈ పాత్రలన్నీ చాలా ముఖ్యమైనవే. వీటిని ఎలా చూపిస్తారు? ఏ సినిమాలో వీటిని కలిపి తీస్తారన్నది ఆసక్తికరం. ఢిల్లీ, విక్రమ్‌, రోలెక్స్‌ పాత్రలే కాదు, కొత్త పాత్రలు యాడ్‌ అవుతూ ఉంటాయి. ‘కేజీయఫ్‌2’లో చెప్పినట్లు ‘తలలు శాశ్వతం కాదు.. కిరీటాలే శాశ్వతం’మరి లోకేశ్‌ కనకరాజ్‌ యూనివర్స్‌లో వచ్చి చేరే పావులేవో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


అస్త్ర యూనివర్స్‌ ‘బ్రహ్మాస్త్ర’

రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, అమితాబ్‌, నాగార్జున కీలక పాత్రల్లో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా రానున్న ఈసినిమా ఫస్ట్‌ ఫార్ట్‌ బ్రహ్మాస్త్ర పార్ట్‌-1: శివ  ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ చూస్తే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో మూవీని తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. అదే సమయంలో ఈ సినిమా కూడా ఒక మల్టీ యూనివర్స్‌ మూవీ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే పార్ట్‌-1లో కేవలం శివ గురించి మాత్రమే చెబుతున్నారు. మిగిలిన రెండు పార్ట్‌ల్లో దీన్నే కొనసాగిస్తారా? లేక కొత్త పాత్రలు వచ్చి చేరతాయా? అన్న దానిపై సందిగ్ధత ఉంది. మరి అయాన్‌ ముఖర్జీ ప్రజెంటేషన్‌ ఎలా ఉందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని