Mahesh babu: మహేశ్‌బాబు హీరో మాత్రమే కాదు.. అంతకుమించి..!

దూమపానం, మద్యపానం, ఆరోగ్యానికి హానికరం అని సినిమా ప్రారంభానికి ముందు థియేటర్‌ తెరపై వేస్తారు.. కానీ సినిమాల్లో మాత్రం హీరోలే సిగరెట్లు కాలుస్తారు. మద్యం తాగి సీసాలు పగలగొడుతారు. అయితే.. అలాంటి సన్నివేశాల్లో నటించబోనని తేల్చి చెప్పిన ఏకైక హీరో మహేశ్‌బాబు. ఇది చాలు కదా.

Updated : 09 Aug 2021 09:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ పేరులో ఉంది మూడు అక్షరాలే.. కానీ, అమ్మాయిలకు అతను కలల ‘రాకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్‌’లా రోల్‌మోడల్‌. అభిమానుల గుండెల్లో ‘మహర్షి’. మాస్‌కు ‘పోకిరి’, క్లాస్‌కు ‘మురారి’. నిర్మాతల పాలిట ‘శ్రీమంతుడు’.. అవసరమైన వారికి సాయం చేస్తూ అండగా నిలిచే కనిపించని ఒక ‘నిజం’. అందుకే ఆయన అందరి అభిమాన నటుడయ్యారు. మహేశ్‌ హీరో అన్నది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు తిప్పి చూస్తే.. అదే ఈ కథనం.  అభిమానుల మనసుకు దగ్గరగా.. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే మహేశ్‌బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘నాని’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

నిజమైన ఫ్యామిలీమ్యాన్‌

తనయుడిగా.. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్‌. ఈ విషయంలో మహేశ్‌బాబు టాప్‌లో ఉంటారు. నంబవర్‌‘వన్‌’ స్థానానికి చేరుకోవడం ఒక ఎత్తయితే.. అగ్రపీఠాన్ని కాపాడుకోవడం మరో ఎత్తు. సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడిగా సినిమాల్లోకి వచ్చి.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నార మహేశ్‌. మంచి కథ దొరికితే తన తండ్రి కృష్ణతో ఒక సినిమా చేయాలని ఉందని ఆయనో సందర్భంలో చెప్పారు. తన తండ్రి చేసిన సినిమాలను రీమేక్‌ చేసే సాహసం చేయబోనని, ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్ని పర్వతం’ తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాలంటారు.

భర్తగా.. తన తండ్రి తర్వాత అంతమంచి విమర్శకురాలు తన భార్య నమ్రత అంటారు మహేశ్‌. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమని చెబుతారు. బయట ఎన్ని టెన్షన్లున్నా ఇంటికి వస్తే అవన్నీ పోతాయట. ఇంట్లో ఆనందంగా ఉంటేనే బయట కూడా ఆనందంగా ఉండగలం.. అందుకే నమ్రత వచ్చాక జీవితమే మారిపోయిందంటుంటారు.

తండ్రిగా.. తండ్రి అయ్యాకే ప్రతి మగాడిలోనూ పరిపక్వత వస్తుందని.. తనలోనూ గౌతమ్‌ ఈ భూమ్మీద అడుగుపెట్టిన తర్వాతే ఎంతో మార్పు వచ్చిందని మహేశ్‌ అంటారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా పిల్లలు, కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. గౌతమ్‌, సితారతో కలిసి మహేశ్‌ చిన్న పిల్లాడిలా మారి వీడియో గేమ్స్‌ అడుతుంటారు.


సమాజ సేవలో ‘సైనికుడు’..

నటుడిగా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో.. వ్యక్తిగా అంతే మంచి పేరు తెచ్చుకున్నారు మహేశ్‌బాబు. హుదుద్‌ సమయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.2.5 కోట్లు విరాళం ఇచ్చారు. సినిమా కార్మికులకు కోసం రూ.25 లక్షలు అందజేశారు. #MBForSavingHearts పేరుతో వందల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు. చేయిస్తూనే ఉన్నారు. కరోనాపై పోరాడేందుకు తెలుగు రాష్ట్రాలకు మహేశ్‌బాబు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. గుంటూరులోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయించారు. ఇటీవల వ్యాక్సిన్లు కూడా వేయించారు. మహబూబ్‌నగర్‌లోని సిద్ధాపురం గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. 


సమాజంపై బాధ్యత.. మద్యపానం, ధూమపానం సన్నివేశాలకు నో.. 

‘‘కొంతకాలం క్రితం వరకు సిగరెట్‌ తాగేవాడిని. అలాన్‌ కార్‌ రాసిన ‘ది ఈజీ వేటూ స్టాప్‌ స్మోకింగ్‌’ పుస్తకం చదివాను. రోజులు కనీసం వంద సిగరెట్లు తాగే అలవాటు ఉన్న అలాన్‌ మానేయగా లేనిది నేను మానేయలేనా అనుకొని మానేశాను. నిజానికి స్మోకింగ్‌ చాలా ప్రమాదకరం అందుకే నా సినిమాల్లో పొగతాగే సన్నివేశాలు చేయను’’ అని మహేశ్‌ ఓ సందర్భంలో చెప్పారు. ఇక ప్రొడ్యూసర్లకు భారం కాకూడదని విడిరోజుల్లోనే కాదు, షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లోనూ మహేశ్‌ తన ఫ్యామిలీ ట్రావెల్‌, అసిస్టెంట్ల జీతాలు.. ఖర్చులు, అన్నీ ఆయన భరిస్తారు.


అందుకే ట్విటర్‌లోకి..

‘‘తర్వాతి సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి చాలామంది అభిమానంతో అడుగుతుంటారు. వాటికి సంబంధించి కొన్ని వెబ్‌సైట్లలో తప్పుడు వార్తలు వస్తుంటాయి. ఆ గందరగోళం పోగొట్టాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో ‘ట్విటర్‌’ తట్టింది. అందుకే.. ట్విటర్‌లోనే నా గురించి, నా సినిమాల గురించి అభిమానులతో పంచుకోవాలని నిర్ణయించుకొని ట్విటర్‌లోకి వచ్చాను’’ అని మహేశ్‌ ఓ సందర్భంలో వివరించారు. ప్రస్తుతం ట్విటర్‌లో మహేశ్‌బాబుకు 11.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. మహేశ్‌ జన్మదినం సందర్భంగా ట్విటర్‌లో 100 మిలియన్ల ట్వీట్‌లతో అభిమానులు రికార్డు సృష్టించారు.


మరిన్ని విషయాలు..

* వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారిని గౌరవించే మేడమ్‌ టుస్సాడ్స్‌లో మహేశ్‌బాబు మైనపు విగ్రహం చోటు దక్కించుకుంది.

* మహేశ్‌బాబు డజనుకుపైగా సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. కేవలం ప్రైవేటు సంస్థలకే కాదు. ‘హీల్‌ ఏ చైల్డ్‌’ అనే స్వచ్ఛంద సంస్థకు కూడా గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

* 2013లో మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్‌గా మహేశ్‌ నిలిచారు.

* సినిమా విషయంలోనూ ప్రేక్షకులను అలరించడంతో పాటు నిర్మాతలకు లాభం తెచ్చిపెట్టే కమర్షియల్‌ సినిమాలే చేస్తూ నిర్మాతల హీరో అనిపించుకున్నారు. 

మహేశ్‌బాబు కొన్ని సందర్భాల్లో చెప్పిన మాటలు.. * నాకు కోపం రాదు.. దానంత చెడ్డది మరోటి లేదు.. నేను ఇష్టపడే, సినిమా చేయాలనుకునే దర్శకుల్లో మొదటివ్యక్తి మణిరత్నం.. * నాకు రీమేక్‌లు నచ్చవు..
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని