SSMB29: మహేశ్‌తో సినిమా.. హాలీవుడ్‌ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం.. ఏంటా సీఏఏ?

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి ఓ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పలు అప్‌డేట్లను జక్కన్న హాలీవుడ్‌ మీడియాతో పంచుకున్నారు.

Published : 20 Jan 2023 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా తాను తెరకెక్కించనున్న #SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా గురించి దర్శకుడు రాజమౌళి (Rajamouli) ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ‘నాటు నాటు’ (ఆర్‌ఆర్‌ఆర్‌) పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన సందర్భంగా ఇటీవల అమెరికా వెళ్లిన ఆయన హాలీవుడ్‌ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. లేటెస్ట్‌ ఇంటర్వ్యూలో తన కొత్త సినిమా గురించి వివరించారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు విజయం దక్కక ముందే మహేశ్‌బాబుతో నేను సినిమా చేస్తున్నట్టు ప్రకటించా. పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రాజెక్టు అది. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా రూపొందనుంది. ప్రస్తుతం కథ రాసే పనిలో ఉన్నాం. ఈ చిత్రం కోసం ‘సీసీఏ’తో ఒప్పందం చేసుకున్నా. దాని ద్వారా ప్రపంచ సినిమాను అర్థం చేసుకోగల ప్రతిభావంతులు పరిచయమయ్యారు. ఇండియాలో ఫిల్మ్‌ మేకింగ్‌, యూఎస్‌లో ఫిల్మ్‌ మేకింగ్‌.. రెండింటి స్టైల్‌  పూర్తి భిన్నం. ఏం చేయాలి? సినిమా ఎలా తీయాలి? అనేదాన్ని ఫైనల్‌ చేసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది’’ అని రాజమౌళి తెలిపారు. సీఏఏతో ఆయన ఒప్పందం చేసుకున్నారనే వార్తలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ఆయనే చెప్పడంతో ‘సీఏఏ’ మరోసారి తెరపైకి వచ్చింది.

సీఏఏ అంటే?

సీఏఏ పూర్తి పేరు క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్‌ ఏజెన్సీ (Creative Artists Agency). ప్రతిభను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. 1975 నుంచి లాస్‌ఏంజెల్స్‌ కేంద్రంగా ఈ ఏజెన్సీ కార్యకలాపాలు సాగుతున్నాయి. ప్రపంచంలోని వేలాదిమంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు, సంగీత దర్శకులు, నటీనటులకు సీఏఏ ప్రాతినిథ్యం వహిస్తుంది. ఆయా విభాగాల్లో (24 క్రాఫ్ట్స్‌) నిపుణులైన వీరంతా అవసరం మేరకు ఆయా చిత్ర బృందాలతో కలిసి పనిచేస్తుంటారు. అంటే.. ఏ నిర్మాతైనా/దర్శకుడైనా తామో సినిమా తెరకెక్కించదలచి కథ కోసం ఏజెన్సీని సంప్రదిస్తే అక్కడ రైటర్లు స్టోరీలు ఇస్తుంటారు. అలాగే నటులు, టెక్నిషియన్లను అవసరం మేరకు ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసే ఆ నిపుణులు ఇప్పుడు తెలుగు సినిమాకు పనిచేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది. సినీ ప్రియుల్లో ఇంతకుమునుపెన్నడూలేని అంచనాలు నెలకొంటున్నాయి. ఈ ఏజెన్సీ ద్వారా సినిమాను భారీ స్థాయిలో ప్రచారం చేసుకోవచ్చనేది కొందరి మాట. రాజమౌళి సినిమాలంటే విజువల్ ట్రీట్‌ ప్రధానం కాబట్టి ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ విషయంలో ఆయన గ్రాఫిక్స్‌ వర్క్‌ కోసమే సీఏఏతో డీల్‌ కుదుర్చుకున్నారనే చర్చ సాగుతోంది. వెండితెరతోపాటు బుల్లితెరకు సంబంధించి బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ చేసే సీఏఏ కొన్నాళ్ల క్రితం క్రీడా రంగంలోనూ అడుగుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని