Lucifer2: ‘లూసిఫర్‌2’.. స్టీఫెన్‌ గట్టుపల్లి అలియాస్‌ అబ్రహాం ఖురేషి ఎవరు?

మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది.

Published : 18 Aug 2022 01:59 IST

హైదరాబాద్‌: మోహన్‌లాల్‌ కథానాయకుడిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లూసిఫర్‌’. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్‌ కమ్‌ సీక్వెల్‌ రాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వెల్లడించారు. ఈ మేరకు వీడియోను పంచుకున్నారు. తాజా చిత్రానికి  ‘లూసిఫర్‌2: ఎంపురాన్‌(రాజు కన్నా గొప్పవాడు)’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

‘లూసిఫర్‌’లో మోహన్‌లాల్‌ స్టీఫెన్‌ గట్టుపల్లి అనే రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు. అయితే రాజకీయ నాయకుడు కాకముందు ఈ ప్రపంచాన్నే శాసించే ఓ మాఫియాకు అతడు అధినేత. పేరు అబ్రహాం ఖురేషి. ఒక సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించిన స్టీఫెన్‌.. అబ్రహాం ఖురేషి ఎలా అయ్యాడు? అతడు చేసిన పనులు ఏంటి? ఎందుకు రాజకీయ నాయకుడిలా మారాల్సి వచ్చింది? మసూద్‌(పృథ్వీరాజ్‌)తో పరిచయం ఎలా ఏర్పడింది? తెలియాలంటే ‘లూసిఫర్‌2’ చూడాల్సిందే.

‘లూసిఫర్‌’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘గాడ్‌ఫాదర్‌’ అనే టైటిల్‌ను పెట్టారు. మలయాళంలో పృథ్వీరాజ్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా దసరా కానుకగా రానుంది. ఇప్పుడు ‘లూసిఫర్‌2’ ప్రకటించడంతో మరి చిరంజీవి దీన్ని కూడా రీమేక్‌ చేస్తారా? చేస్తే ఎవరు దర్శకత్వం వహిస్తారు? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని