Ponniyin Selvan 2: పొన్నియిన్‌ సెల్వన్‌-2 అప్‌డేట్‌ వచ్చేసింది.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Ponniyin Selvan2: సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పొన్నియిన్‌సెల్వన్‌-2’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చిత్ర బృందం షేర్‌ చేసుకుంది.

Updated : 28 Dec 2022 16:42 IST

చెన్నై: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్‌ ఎపిక్‌యాక్షన్‌ డ్రామా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan). రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా చూసిన వారందరూ పార్ట్‌-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ (Ponniyin Selvan 2) గురించి ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకుంది. రెండో భాగం 2023, ఏప్రిల్‌ 28న (ponniyin selvan 2 release date) ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌), పొన్నియిన్‌సెల్వన్‌ (జయం రవి), వందియదేవన్‌ (కార్తి), నందిని (ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌) పాత్రలను చూపించారు. రెండో భాగంలో వీరి పాత్రలే కీలకం కానున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, జయం రవి, కార్తి, త్రిష ఇలా భారీ తారాగణం నటించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తొలి భాగంలో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. సుంద‌ర చోళుడి (ప్రకాశ్‌రాజ్‌)ని త‌ప్పించి మ‌ధురాంత‌కుడి (రెహమాన్‌)ని చ‌క్రవ‌ర్తిని చేయాలనుకున్న పళవేట్టురాయర్‌ (శరతకుమార్‌) కుట్ర భగ్నమైందా? పొన్నియిన్ సెల్వన్‌ (జయం రవి)ను ఖైదు చేసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? నందిని (ఐశ్వర్యా రాయ్‌) ఎవ‌రు? ఆమెకు, పొన్నియిన్ సెల్వన్‌కీ, ఆదిత్య క‌రికాల‌న్‌ (విక్రమ్‌)కీ ఉన్న సంబంధం ఏంటి? కుందవై (త్రిష) ఎలాంటి రాజనీతిజ్ఞత ఉపయోగించింది? తన మిత్రుడికి కోసం వందియదేవన్‌ (కార్తి) ఎలాంటి సాహసం చేశాడు? అనే విషయాలను రెండో భాగంలో మణిరత్నం చూపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని