Adipurush: టీజర్‌తో పోలిస్తే ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఎలా ఉంది?
Adipurush: ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్‌దర్శకత్వంలో తెరకెక్కిన ఇతిహాస గాథ ‘ఆది పురుష్’. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. విమర్శల పాలైన టీజర్‌తో పోలిస్తే, ఇది బాగుందా?
హైదరాబాద్: ‘ఆది పురుష్’(Adipurush).. ప్రభాస్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం. ఎన్నో అంచనాల మధ్య కొన్ని రోజుల కిందట విడుదలైన టీజర్‌పై నెటిజన్లు పెదవి విరిచారు. ఈ క్రమంలో తాజాగా ‘ఆది పురుష్’ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ ఆ అంచనాలను అందుకుందా? లేదా?
అంచనాలను పెంచిన కాంబినేషన్..
రామాయణం.. ఎవరు ఏ భాషలో రాసినా, తీసినా అదొక అద్భుత కావ్యం. అందులోని వివిధ ఘట్టాలను ఇతివృత్తంగా తీసుకుని నాటి నుంచి నేటి వరకూ ఎంతో మంది దర్శకులు రామాయణాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఓం రౌత్ ‘ఆది పురుష్’ తెరకెక్కించారు. ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్ రాముడి పాత్ర చేస్తుండటం, ‘తానాజీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర బృందం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఆకట్టుకోలేకపోయిన టీజర్
‘ఆది పురుష్’ గురించి ఒక్కో అప్‌డేట్ వస్తుంటే, తెరపై విజువల్ వండర్ ఆవిష్కృతమవుతోందని అందరూ అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో విడుదలైన టీజర్ అందరినీ నిరాశపరిచింది. నాణ్యతలేని వీఎఫ్‌ఎక్స్, రామాయణంలోని పాత్రలకు ఆధునిక హంగులు జోడించడంపై చాలా మంది పెదవి విరిచారు. ‘రామాయణాన్ని కార్టూన్‌గా తీయడం లేదు కదా’ అంటూ ట్రోలింగ్ చేశారు. మరీ ముఖ్యంగా ఆజానుబాహుడైన ప్రభాస్ (Prabhas) రాముడి పాత్రలో తెరపై కదిలి వస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవని అభిమానులు ఆశించారు. కానీ, టీజర్ చూసిన తర్వాత అందులో సహజత్వం మచ్చుకైనా కనిపించలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శివ భక్తుడు, లంకాధిపతి రావణుడి పాత్రలో పోషించిన సైఫ్ అలీఖాన్‌ను చూసైతే అందరూ అవాక్కయ్యారు. ‘ఇదేంటి రావణుడు ఇలా ఉన్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు. ఇక టీజర్‌లో వానరసైన్యాన్ని చూసి నోరెళ్లబెట్టారు. ‘సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీశాం. మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లో చూస్తే ఆ క్వాలిటీ అర్థం కాదు. పెద్ద తెరపైనే చూడాలి. నేటి తరాన్ని మెప్పించేలా సినిమాను తీర్చిదిద్దాం’ అని చిత్ర బృందం సమర్థించుకునే ప్రయత్నం చేసినా, అవేవీ విమర్శలను ఆపలేకపోయాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సినిమా విడుదలను వాయిదా వేసి, వీఎఫ్‌ఎక్స్ సన్నివేశాల్లో నాణ్యతను పెంచే ప్రయత్నాలు చేసింది. అవసరమైన కొన్ని సన్నివేశాలను రీషూట్ చేశారు.
మరి ఇప్పుడు వచ్చిన ట్రైలర్ ఎలా ఉంది?
సినీ అభిమానులను టీజర్ మెప్పించలేకపోవడంతో చిత్ర బృందం ఈసారి కాస్త జాగ్రత్తగా వ్యవహరించింది. 3 నిమిషాల 19 సెకన్ల పాటు సాగిన ట్రైలర్.. టీజర్‌తో పోలిస్తే చాలా విషయాల్లో మెరుగ్గా ఉంది. ముఖ్యంగా ఐమ్యాక్స్ తెరపై 3డీ ట్రైలర్ విజువల్ ఫీస్ట్‌గా ఉంది. ప్రతి సన్నివేశం హైలైట్ అయ్యేలా అజయ్-అతుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మరీ ముఖ్యంగా ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ నేపథ్యంలో సాగే పాట ట్రైలర్ చూస్తున్న ప్రేక్షకుడిని హమ్మింగ్ చేసేలా ఉంది. అయితే, అక్కడక్కడా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో అవసరానికి మించి వీఎఫ్‌ఎక్స్ షాట్స్ వాడేశారు. ఇంకా కొన్ని సన్నివేశాలను మెరుగుపరచాల్సింది. ఒక చోట ప్రభాస్ లుక్ నేచురల్‌గా ఉంటే, మరొక చోట మోషన్ క్యాప్చర్ బొమ్మలాగానే అనిపించింది. బహుశా అవన్నీ రీషూట్ చేయడం కూడా కష్టం కావడంతో వదిలేసి ఉండవచ్చు. ట్రైలర్‌లో రావణుడి పాత్రను కాస్త సహజంగా చూపించారు. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ బాగుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, చిత్ర బృందం చెబుతున్నట్లు సినిమాను వెండితెరపై చూస్తేనే ఆ ఫీల్ ఉంటుందేమో. అది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇక ట్రైలర్ విషయానికొస్తే..
‘ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఇది రఘునందనుడి గాథ. యుగయుగాల్లో సజీవం.. జాగృతం.. నా రాఘవుడి కథే రామాయణం’ హనుమంతుడి పాత్ర ద్వారా ‘ఆది పురుష్’ కథను పరిచయం చేశారు. రామయాణాన్ని పూర్తి విజువల్ వండర్‌గా చూపించే ప్రయత్నం చేశారు ఓంరౌత్. ‘నా ప్రాణమే జానకిలో ఉంది. నా ప్రాణాలకన్నా మర్యాదే అధిక ప్రియమైనది’, ‘మనం జన్మతో కాదు.. చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం’ అంటూ రాఘవుడిగా ప్రభాస్ పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి. ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ అంటూ సాగే సాంగ్ అయితే, ప్రతి సన్నివేశాన్ని హైలైట్ చేసింది. వానరసేనను ఉద్దేశించి ‘నాకోసం పోరాడొద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీర గాథ చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. అహంకారం రొమ్ము చీల్చి, ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి’ తదితర సంభాషణలు మెప్పిస్తున్నాయి.
ప్రభాస్ (Prabhas) రాఘవుడిగా నటిస్తున్న సినిమాలో కృతి సనన్ జానకిగా కనిపించనుంది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమాన్‌గా దేవదత్త నాగే నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆది పురుష్’ జూన్ 16న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, వంశీ, ప్రమోద్, ఓంరౌత్ నిర్మిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ