k viswanath:‘అబ్బే ఆడదండీ’ అన్నవారంతా అవాక్కయ్యారు!

అపురూప దృశ్యకావ్యం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే దర్శకుడు కె.విశ్వనాథ్‌ శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. అప్పట్లో ఆ సినిమా విడుదల చేద్దామంటే కొనేవారే కరవైన దగ్గరి నుంచి జాతీయ అవార్డు అందుకునే వరకూ ఏం జరిగిందో తెలుసా..?

Updated : 03 Feb 2023 07:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ చరిత్రలో ‘శంకరాభరణం’ (sankarabharanam)ఒక ఆణిముత్యం. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా, ఎన్ని పేరాలు రాసినా తనివి తీరదు.  అప్పట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య సినిమాలపై చర్చ వస్తే, ఎదుటి వ్యక్తికి ఎదురయ్యే మొదటి ప్రశ్న ‘శంకరాభరణం ఎన్నిసార్లు చూశారు?’. అప్పట్లో ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తే అంతగొప్ప. ఇక అవార్డు, రివార్డులు ‘శంకరశాస్త్రి’ పాదాక్రాంతమయ్యాయి. అలాంటి గొప్ప చిత్రాన్ని మనకు అందించి ఆ సినిమా విడుదలైన రోజే దర్శకుడు కె.విశ్వనాథ్‌ శివైక్యం కావడం అందరినీ కలిచివేస్తోంది. ‘శంకరాభరణం’ విడుదల చేద్దామంటే కొనేవారే కరవైన దగ్గరి నుంచి జాతీయ అవార్డు అందుకునే వరకూ ఏం జరిగిందో తెలుసా..?

‘శంరాభరణం’లాంటి కథతో సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకుడు విశ్వనాథ్‌(k viswanath) మదిలో మెదిలిన ఆలోచన ఒక కొత్త వ్యక్తిని పెట్టి ఈ కథతో తీయాలనుకున్నారు. ఆ సమయంలో ‘రారా కృష్ణయ్య’లో నటించిన జొన్నలగడ్డ వెంకట సోమయాజులుని శంకరశాస్త్రి పాత్ర కోసం తీసుకున్నారు. అలాగే మంజు భార్గవి కూడా అప్పటికి పెద్ద పేరున్న నటేమీ కాదు. ఇక షూటింగ్‌కు వెళ్లాక ప్రతి షాటునీ శ్రమతో, ప్రతి దృశ్యాన్ని శ్రద్ధతో తీశారు. మొదటి కాపీ వచ్చిన తర్వాత దగ్గర వాళ్లంతా చూసి విశ్వనాథ్‌కి జేజేలు పలికారు.

ఇక ఆ సినిమా ప్రజల దగ్గరకు వెళ్లాలి. ఆ రోజుల్లో పంపిణీదారులు లేరు. కొనుగోలు దారులే దారి. అప్పట్లో ఆ హీరోల సినిమాలకు జిల్లాల వారీగా కొన్ని ధరలుండేవి. నిర్మాత, కొనుగోలుదారు చేరుతాడనుకొని వ్యాపారం చేసేవారు. ‘శంకరాభరణం’ కొనుగోలుదారుల ముందుకు వెళ్లింది. ‘నడిగర్‌ సంఘం’ ఆవరణలోని థియేటర్‌ బుక్‌ చేసి సినిమా వేశారు. కొందరు మిత్రులు, పరిశ్రమలోని ముఖ్యమైన వాళ్లూ వచ్చారు. సినిమా పూర్తయింది. ‘బాగుందండీ’ అన్నవాళ్లేగానీ, కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. పైగా వ్యాఖ్యానాలు. ‘మంజుభార్గవికి పేరు లేదు. జయమాలినిని పెట్టి ఉంటే బాగుండేది’ అని ఒకరు. ‘కొత్తవాడు కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పెట్టి తీసి ఉంటే ఆయన కోసం కొనేవాళ్లం’ అని ఒకరు ‘జనం చూడరండీ పాటలు, డ్యాన్సులు ఎవడిక్కావాలి? అట్టర్‌ ఫ్లాప్‌ అవుతుంది. నా చేతులు కాల్చుకోలేను’ ఇంకొకరు. ఇలా విమర్శలు చేశారు. కానీ, ఎంతో కొంతకి కొంటామన్నవాళ్లు లేరు.

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు డీలా పడిపోయారు. విశ్వనాథ్‌ నిరాశ పడినా జనంలోకి వెళ్తే ఆదరణ లభిస్తుందని నమ్మకం. కానీ వెళ్లడం ఎలా? కనీసం పారితోషికం కూడా తీసుకోలేదు. సినిమా విడుదలై బాగా నడిస్తే వచ్చిన దానిలో లాభం తీసుకుందామనుకున్నారు. అలాగే ఒప్పందం చేసుకున్నారు. ప్రయత్నాలు చేసి చేసి ఏడిద నాగేశ్వరరావు ఎంతకో కొంతకి, నష్టానికే కొన్ని జిల్లాలకు అమ్మేశారు. కొన్ని జిల్లాలు అమ్ముడు పోలేదు. సినిమా విడుదలైంది. సినిమా భాషలో చెప్పాలంటే ఓపెనింగ్స్‌ లేవు. మూడో రోజు, నాలుగో రోజు థియేటర్లు వెలవెల బోయాయి. ‘బాగుంది’ అన్న మాట మాత్రం వినిపిస్తోంది. నిదానంగా ‘బాగుంది.. బాగుంది’ అన్న మాటే ప్రచార సాధనమై రెండో వారం నుంచి అందుకుంది.

ప్రేక్షకులు ఆనంద పరవశులైపోయారు. రెండోసారీ, మూడోసారి చూడటం ఆరంభించారు. మామూలు హిట్‌ కాదు.. పెద్ద హిట్‌, మూడో వారంలో బ్లాక్‌లో టిక్కెట్లు కొని మరీ చూశారు కొందరు. దర్శక-నిర్మాతల ఆనందానికి అవధులు లేవు. ఎక్కడ చూసినా ‘శంకరాభరణం’ పాటలే. తమిళ, కన్నడ భాషల్లో కూడా బాగా ఆడింది. మలయాళంలో మాటలు డబ్‌ చేసి, పాటలను తెలుగులోనే ఉంచి విడుదల చేశారు. అక్కడా పెద్ద హిట్‌. కొనలేకపోయినవాళ్లు నెత్తినోరూ కొట్టుకొన్నారు. అమ్ముడుపోక తానే అట్టిపెట్టుకున్న జిల్లాల ద్వారా నిర్మాతకు కలెక్షన్ల పంట పండింది. అవార్డు, రివార్డులు మిగిలినదంతా చరిత్ర.

ఈ సినిమా విడుదలైన తర్వాత విశ్వనాథ్‌ కారులో విశాఖపట్నం వెళ్తున్నారట. కారు డ్రైవర్‌తో విశ్వనాథ్‌ మాట్లాడుతూ ‘సినిమా చూశావా’అని అడిగితే, ‘పదిసార్లు చూశాను సర్‌’ అన్నాడట. ‘అన్నిసార్లు చూడటానికి అందులో ఏముంది’ అని అడిగారట. ‘ఏమో తెలియదు సర్‌. థియేటర్‌కు వెళ్లిన ప్రతిసారి గుడికి వెళ్లిన భావన కలుగుతోంది’ అన్నాడట. సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లిన చాలా మంది చెప్పులు విడిచి మరీ ‘శంకరాభరణం’ (sankarabharanam) చూశారంటే అతిశయోక్తికాదు. సినీ పరిశ్రమ వర్గాలనే కాదు, సామాన్యులను సైతం మెప్పించిందీ చిత్రం.  ఒకరోజు దర్శకుడు బాపు ఈ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లారట. అప్పటికి ఆయన ‘శంకరాభరణం’ ఏడెనిమిదిసార్లు చూశారు. విరామ సమయంలో బయటకు వస్తే, ఇద్దరు పాఠశాల అమ్మాయిలు బాపు దగ్గరకు వచ్చి ‘ఆటోగ్రాఫ్‌ ఇస్తారా’ అని అడిగారట. ‘నా దగ్గర పెన్ను లేదు’ అని బాపు సమాధానం ఇస్తే, తమ వద్ద ఉన్న జామెట్రీ బాక్సులో పెన్సిల్‌ ఇచ్చి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ, ‘ఈ సినిమాకు మీరే కదా దర్శకులు’ అని అడిగారట. ‘నేను కాదమ్మా’ అని బాపు సమాధానం ఇవ్వగానే, పక్కనున్న స్నేహితురాలితో ‘బాక్సులోని రబ్బరు ఇటు ఇవ్వవే’ అని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న అమ్మాయి అన్నదట. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా బాపునే పంచుకున్నారు. అది విశ్వనాథ్‌ సినిమా అంటే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని