james bond: జేమ్స్‌ బాండ్‌ పాత్ర పుట్టిందిలా.. ఆయన అలా చేయకపోతే బాండ్‌ లేడు..

25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. బాండ్‌గా డానియల్ క్రేగ్‌కు ఇదే చివరి చిత్రం.  ఈ సందర్భంగా జేమ్స్‌బాండ్ పుట్టుపూర్వోత్తరాలపై ఓ కథనం. 

Updated : 10 Aug 2022 12:19 IST

జేమ్స్‌బాండ్‌ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రేక్షకాదరణ ఉందో తెలిసిందే. ‘మై నేమ్‌ ఈజ్‌ బాండ్‌, జేమ్స్‌బాండ్‌’ అనే డైలాగ్‌ ఇప్పటికీ అభిమానులను కేరింతలు పెట్టిస్తుంది. విలాసవంతమైన జీవితం, ఇట్టే ఆకట్టుకునే ఆహార్యం‌, ఒళ్లు గగుర్పొడిచే  పోరాటాలు, అందమైన మగువలు, అంతుచిక్కని ఆపరేషన్లు ఇలా హాలీవుడ్‌ తెరపై బాండ్‌ ఓ ప్రత్యేక ముద్ర వేశాడు. అందుకే ఈ రహస్య గూఢచారి సినిమాలు 50 ఏళ్లుగా అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ హాలీవుడ్‌లో 24 బాండ్‌ చిత్రాలొచ్చాయి. 25వ చిత్రంగా ‘నో టైమ్‌ టు డై’ ఈ నెల 30న థియేటర్లలోకి రానుంది. బాండ్‌గా డేనియల్ క్రెయిగ్‌కు ఇదే చివరి చిత్రం.  అసలు ఇంతకీ ఈ బాండ్‌ పాత్ర ఎలా పుట్టింది?

యుద్ధంలో పుట్టిన ఆలోచన

(పుస్తక రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌)

జేమ్స్‌బాండ్‌ను బ్రిటీష్‌ నవలా రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ సృష్టించారు. ఆయన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్‌లో ఉన్నతాధికారిగా పనిచేశారు. అక్కడ తనకు తారసపడిన సీక్రెట్‌ ఏజెంట్లను స్ఫూర్తిగా తీసుకొని, తన సృజనాత్మకత జోడించి జేమ్స్‌బాండ్‌ పాత్రను అల్లుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఇలాంటి గూఢచారి చుట్టూ ఓ నవల రాయాలనుందన్న ఆలోచనను స్నేహితులతో పంచుకున్నారు ఫ్లెమింగ్‌. కానీ వివిధ కారణాల వల్ల వెంటనే రాయలేకపోయారాయన. యుద్ధం ముగిసిన తర్వాత జమైకాలో గడిపేందుకు వెళ్లాడు. అక్కడే జేమ్స్‌బాండ్‌ పాత్రకు బీజం పడింది. 

పెళ్లి గోల నుంచి మరల్చుకోడానికి

1952వ సంవత్సరంలో గర్భవతి అయిన తన ప్రేయసి అన్‌ చర్టెరిస్‌ను పెళ్లి చేసుకోడానికి కొద్ది రోజుల ముందు ఫ్లెమింగ్‌ మదిలో బాండ్‌ పాత్ర మెదిలింది. పెళ్లి తదితర గందరగోళాల నుంచి తనను తాను మరల్చుకోడానికి ఓ పుస్తకాన్ని రాయడానికి సమయాత్తమయ్యాడు. అలా రాసిన నవల పేరే ‘కాసినో రాయల్‌’. రాయడం మొదలుపెట్టి కేవలం నెలలోనే మొత్తం నవలను పూర్తిచేశాడు. తను ఎదుర్కొన్న సంఘటనలకు తోడు కొన్ని ఊహాజనిత పాత్రలు, మలుపులను జోడించి సూపర్‌ హిట్‌ నవలకు రూపమిచ్చాడు. ఆ నవల్లోని తారసపడే పాత్రలకు తన స్నేహితులు, బంధువుల పేర్లనే వాడుకోవడం విశేషం. 

మాజీ ప్రేయసి మాట వినుంటే!

ఆ పుస్తకాన్ని పూర్తిచేశాక ఎలా ఉందో చెప్పమని తన మాజీ ప్రేయసికి చూపించాడు ఫ్లెమింగ్‌. దాన్ని చదివిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రచురించొద్దని సూచించిందామె. అయితే తన సలహాను ఖాతరు చేయని ఫ్లెమింగ్‌ ప్రచురించేందుకు సిద్ధపడ్డాడు. అలా ‘కాసినో రాయల్‌’ పుస్తకం విడుదలై బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచింది.  ఆ తర్వాత పన్నెండు జేమ్స్‌ బాండ్‌ పుస్తకాలు, రెండు కథల పుస్తకాలను ప్రచురించాడు. 1964లో ఆయన చనిపోయిన తర్వాత రెండు పుస్తకాలు వెలువడటం విశేషం. జాన్‌ ఎఫ్‌. కెన్నడీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తన అభిమాన పుస్తకాల్లో బాండ్‌ నవల కూడా ఒకటని ప్రకటించడంతో అమెరికాలో జేమ్స్‌బాండ్‌కు విపరీతమైన పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఒక వేళ మాజీ ప్రేయసి మాట విని పుస్తకాన్ని ప్రచురించకుండా ఆగిపోయింటే..సినీ, నవలా ప్రపంచాలు గత యాభై యేళ్లుగా అలరించిన జేమ్స్‌బాండ్‌ను పోగొట్టుకునేవి. 

బాండ్‌కు వాళ్లే ప్రేరణ

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తాను కలుసుకున్న రహస్య గూఢచారులు, ఎదురైన సంఘటనల సమాహారంగానే జేమ్స్‌బాండ్‌ అవతరించాడని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌. తాను ఎంతగానో ఆరాధించే తన సోదరుడు పీటర్‌తో పాటు మరికొందరు రహస్య ఏజెంట్ల నుంచి ఈ పాత్రకు ప్రేరణ పొందాడు. వారిలో తనతోపాటు పనిచేసిన సాండీ గ్లేన్‌, వింగ్‌ కమాండర్‌ ఫారెస్ట్‌ థామస్‌, పాట్రిక్‌ జాబ్‌, సిడ్నీ కాటన్‌ లాంటి ఎందరినో తన పాత్ర తీరుతెన్నుల రూపకల్పనలకు వాడుకున్నాడు. అయితే  బ్రిటీష్‌ ఎంబసీలో రహస్య గూఢాచారిగా పనిచేసిన జేమ్స్‌ అల్బర్ట్‌ బాండ్‌ జీవితం ఆధారంగానే ఫ్లెమింగ్‌ ఈ పాత్రను తీర్చిదిద్దారని మరికొందరంటారు.

పేరు వెనక కథ

తను సృష్టించిన ఆ రహస్య గూఢచారికి అందరూ సులభంగా పలికే పేరు పెట్టాలని అనుకున్నారు రచయిత ఫ్లెమింగ్‌. ఆయనకు పక్షులంటే ఆసక్తి. తరచుగా పక్షుల గురించి తెలుసుకోవడం, చదవడంలాంటివి చేసేవారాయన.  వెస్టిండీస్‌లోని పక్షుల సమాచారాన్ని తెలిపే ‘బర్డ్స్‌ ఆఫ్‌ వెస్టిండీస్‌’ పుస్తకమొకటి ఆయన దగ్గరుంది.  అమెరికాకు చెందిన ఆర్నిథాలజిస్ట్(పక్షి శాస్త్రవేత్త) జేమ్స్‌ బాండ్ ఆ పుస్తకానికి రచయిత‌.  తను సృష్టించిన పాత్రకు ఆయన పేరైతేనే సరిపోతుందిని జేమ్స్‌బాండ్‌ అని పెట్టినట్లు ఒక సందర్భంలో రచయిత చెప్పారు.  అలా ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్న రహస్య గూఢచారికి ఓ పక్షుల పుస్తకం కారణమైంది. 

పుస్తకం నుంచి సినిమాకు

బాండ్‌ నవలలు బెస్ట్‌ సెల్లర్‌గా నిలవడమే కాదు. వేర్వేరు వేదికలపైనా బాండ్‌ బ్రాండ్‌ను నిలబెట్టాయి.  రేడియో, టెలివిజన్‌ కార్యక్రమాల్లో  సీక్రెట్‌ ఏజెంట్‌ పాత్రలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ నవల దృశ్యరూపం దాల్చడానికి మాత్రం పదేళ్ల కాలం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాక జేమ్స్‌బాండ్‌ పాత్ర కాసులు కురిపిస్తుందని బలంగా నమ్మారు హాలీవుడ్‌ నిర్మాతలు. అలా మొదటి బాండ్‌ చిత్రం ‘డాక్టర్‌ నో’ మొదలైంది.  1958లో ఆయన రాసిన ఓ నవల ఆధారంగా ‘డాక్టర్‌ నో’ సినిమా తెరకెక్కింది.  1963లో థియేటర్లలో విడుదలైందీ సినిమా.   సీన్‌ కానరీ మొదటి జేమ్స్‌బాండ్‌గా విశ్వరూపం చూపించాడు. మొదటి సినిమాతోనే సంచలనమైపోయింది బాండ్‌ పాత్ర‌ . బాండ్‌ స్టైల్‌కి, సీన్‌ కానరీ నటనకు ఫిదా అయిపోయిది ప్రేక్షకలోకం.  ఫ్లెమింగ్‌  చనిపోయిన తర్వాత కూడా ఇతర రచయితలు జేమ్స్‌బాండ్‌ నవలలను కొనసాగించారు. వాటిని సినిమాలుగానూ మలిచారు.  

ఇద్దరిదీ ఒకే బ్రాండ్‌

జేమ్స్‌బాండ్‌ పాత్రకు సిగరెట్లంటే పిచ్చి.  ఫ్లెమింగ్‌ రాసిన నవలల్లో  రోజుకు 60 నుంచి 70 సిగరెట్లు పీల్చేస్తాడు. నిజ జీవితంలో ఆ పాత్ర సృష్టికర్త ఫ్లెమింగ్‌కి కూడా ఈ సిగరెట్లంటే మోజుంది.  జేమ్స్‌ బాండ్‌ తనకోసం తయారు చేసిన ప్రత్యేకమైన మోర్లండ్‌ సిగరెట్లను మాత్రమే తీసుకుంటాడు. నిజజీవితంలోనూ  ఫ్లెమింగ్‌ వాటినే ఇష్టపడతాడు. అలా తన అభిరుచులనే బాండ్‌కు కూడా ఉండేలా రాసుకున్నాడు.  జేమ్స్‌బాండ్‌ సిగరెట్‌ను స్టైల్‌గా వెలిగించే తీరు జనాలను సమ్మోహితులను చేసింది. డేనియల్‌ క్రెయిగ్‌ ఒక్కడే తెరపై సిగరెట్లు కాల్చని బాండ్‌గా దర్శనమిచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్న జేమ్స్‌బాండ్‌ సినిమాలు..వాటిలో ఉండే హింస, ఇతరాత్ర కారణాల వల్ల  విమర్శలను అదే స్థాయిలో ఎదుర్కొంది.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని