Multiverses: ఇండస్ట్రీ నయా ట్రెండ్‌.. సినిమాటిక్‌ యూనివర్స్‌

cinematic universe:  ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సినిమాటిక్‌ యూనివర్స్‌ట్రెండ్‌ నడుస్తోంది. కథా ప్రపంచంలో ఒకదానితో ఒకటి మిళితం అవుతూ ఆయా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Published : 31 Jan 2023 14:05 IST

cinematic universe: రామాయణం.. మహాభారతం.. ఈ రెండు మహా కావ్యాలలోని వివిధ ఘట్టాలతో వెండితెరపై ఎన్నో చిత్రాలు అలరించాయి. ఒక్కోసారి ఒక్కో పాత్ర సెంట్రిక్‌గా ఆయా సినిమాలను తీర్చిదిద్దారు. ప్రతి క్యారెక్టర్‌.. ఇంకొక క్యారెక్టర్‌తో కానీ, కథతో కానీ కనెక్ట్‌ అయి ఉండేలా వాటిని తీసిన విధానం మెప్పించింది. ఇక హాలీవుడ్‌లో సూపర్‌ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాల గురించి తెలిసిందే. ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో సినిమాటిక్‌ యూనివర్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. కథ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి మళ్లీ మొదలయ్యేదే కొనసాగింపు చిత్రమైతే, కథలతో సంబంధం లేకుండా ఆ కథల ప్రపంచాన్నో, లేదంటే పాత్రల్నో కొనసాగిస్తూ సినిమాల్ని రూపొందిస్తున్నారు దర్శకులు. మరి ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమైన ఆ సినిమాటిక్‌ యూనివర్స్‌లేంటో తెలుసా?

మోస్ట్‌ ఇంట్రెస్టింగ్‌ యూనివర్స్‌ ‘ఎల్‌సీయూ’

ఒక్క పాట లేకుండా, హీరోయిన్‌ లేకుండా సినిమా తీసి హిట్‌ కొట్టవచ్చా? అలాంటి సందర్భాలు చాలా అరుదు. కానీ, అలాంటి మేజిక్‌ నాకు కరతలామలకం అంటున్నారు లోకేశ్‌ కనగరాజ్‌. ‘ఖైదీ’ చూసి, ‘ఇలా కూడా తీయొచ్చా’ అని ఆశ్చర్యపరిచారు. ‘విక్రమ్’తో ఆయన ‘ఖైదీ’ని కనెక్ట్‌ చేసిన విధానం చూసి, సినీ విమర్శకులు సైతం ‘వావ్‌’ అనేశారు. దీంతో ‘ఎల్‌సీయూ’ (లోకేష్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌)లో మరిన్ని పాత్రలు రానున్నాయి. ముఖ్యంగా విక్రమ్‌ (కమల్‌హాసన్‌), ఢిల్లీ (కార్తి), రోలెక్స్‌ (సూర్య) పాత్రలు కొనసాగనున్నాయి. ప్రస్తుతం విజయ్‌తో లోకేష్‌ తీస్తున్న మూవీ కూడా ఎల్‌సీయూలో భాగమేనని అంటున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. దీని తర్వాత ‘ఖైదీ2’, ‘విక్రమ్‌2’ కొనసాగుతాయి. అన్నదమ్ములైన కార్తి-సూర్యాలు పోటీపడి నటిస్తే, చూడాలని అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.


‘హిట్‌’.. విజయమే టార్గెట్‌..

క్రైమ్‌ థ్రిల్లర్‌ కథలకు ఇటీవల కాలంలో మంచి డిమాండ్‌ ఉంది. ఆ నేపథ్యంలోనే దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌: ది ఫస్ట్‌కేస్‌’. విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు, బాలీవుడ్‌లోనూ రీమేక్‌ అయింది. దీనికి కొనసాగింపుగా, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ను తీసుకొచ్చారు. అడవిశేష్‌ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో నిర్మాత నాని కీలక పాత్రతో ‘హిట్‌: ది థర్డ్‌కేస్‌’ షురూ చేయనున్నారు. ‘హిట్‌2’లో ఈ మేరకు వివరాలను సైతం ప్రకటించారు. ‘హిట్‌’ యూనివర్స్‌ను మొత్తం ఏడు భాగాలుగా తీయనున్నట్లు దర్శకుడు చెబుతున్నారు. చివరి భాగంలో అందరూ హీరోలు కలుస్తారని అంటున్నారు. అంటే ‘అవెంజర్స్‌: ది ఎండ్‌గేమ్‌’ మాదిరిగా అన్నమాట. ఒక రకంగా ఇది పాన్‌ ఇండియా మూవీనే అవుతుంది. చూద్దాం మిగిలిన భాగాల్లో ఎవరెవరు నటిస్తారో..!


అస్త్ర యూనివర్స్‌

గత ఏడాది బాక్సాఫీస్‌ వద్ద అలరించిన ఫాంటసీ అడ్వెంచర్‌ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తీసేటప్పుడే మూడు భాగాలుగా వస్తుందని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్రకటించారు. ఇందులో భాగంగానే ‘బ్రహాస్త్ర: పార్ట్‌-1 శివ’ను తెరకెక్కించారు. రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌, నాగార్జున, అమితాబ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి కొనసాగింపుగా మరో రెండు సినిమాలు రానున్నాయి. ఈ రెండింటినీ ఏకకాలంలో చిత్రీకరణ చేయనున్నట్లు దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ప్రకటించారు. ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-2 దేవ్‌’ పేరుతో రెండో భాగాన్ని తీసుకురానున్నారు. ఇందులో రణవీర్‌ సింగ్‌, దీపిక పదుకొణె నటిస్తారని టాక్‌. తొలి భాగంలో అతిథి పాత్రల్లో మెరిసిన షారుఖ్‌, నాగార్జునలు మిగిలిన రెండు భాగాల్లోనూ కొనసాగే అవకాశం ఉంది.


ప్రశాంత్‌ నీల్‌ యూనివర్స్‌

ఇండియాలో రాజమౌళి తర్వాత ఆ స్థాయి క్రేజ్‌ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీయఫ్‌’తో కన్నడ చిత్ర పరిశ్రమకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చారు. ఆ సినిమాలో హీరో ఎలివేషన్స్‌, సన్నివేశాల్లో ఎమోషన్స్‌కు భారతీయ సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దానికి కొనసాగింపు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ అయితే బాక్సాఫీస్‌ను దున్నేసింది. ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమా చివరిలో ‘కేజీయఫ్‌3’ ఉంటుందని హింట్‌ ఇచ్చారు. మరోవైపు ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ ‘సలార్‌’ తీస్తున్నారు. ఇది కూడా పాన్‌ ఇండియా మూవీ. దీని తర్వాత ఎన్టీఆర్‌తోనూ ప్రశాంత్‌ ఓ మూవీని ప్రకటించారు. ఇవన్నీ ఒక సినిమాతో మరొకటి కనెక్ట్‌ అయి ఉంటాయని టాక్‌. ప్రస్తుతం దీన్ని ప్రశాంత్‌ నీల్‌ యూనివర్స్‌గా వ్యవహరిస్తున్నారు.


ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌

‘అ!’ సినిమాతో ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ప్రస్తుతం తేజ సజ్జాతో ఆయన తీస్తున్న మైథలాజికల్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హనుమాన్‌’. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో సినిమాకు మంచి బజ్‌ వచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ను క్రియేట్‌ చేసి, వరుస సినిమాలు చేయనున్నట్లు తెలిపారు. ‘హనుమాన్‌’ తర్వాత ‘అధీర’ అనే చిత్రాన్ని చేయనున్నారు. అది పూర్తయిన తర్వాత మహిళా ప్రాధాన్యం ఉన్న కథను మూవీగా చేయలనుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని