spy thriller movies: బాక్సాఫీస్‌ బాసులు.. వెండితెర గూఢచారులు..

spy thriller movies: మన తెలుగు హీరోలు స్పై థ్రిల్లర్‌ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ హీరోలెవరో చూసేయండి

Updated : 11 Apr 2023 10:14 IST

spy thriller movies: బాండ్‌.. జేమ్స్‌ బాండ్‌ అంటూ కథానాయకుడు తెరపై విన్యాసాలు చేస్తూ, రకరకాల గన్స్‌తో విలన్‌ గ్యాంగ్‌ను కాల్చిపారేస్తుంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి వచ్చే కిక్కేవేరు. గూఢచారులుగా, నిఘా ఏజెంట్‌లు, సెక్యురిటీ కమాండోలుగా అలరించేందుకు మన కథానాయకులు సిద్ధమయ్యారు. మరి వారెవరో చూసేయండి.

‘అయ్యగారు’ ఆ ఇమేజ్‌ నుంచి బయటపడతారా?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన యువ కథానాయకుడు అఖిల్‌ ఇప్పటివరకూ సరైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టలేదు. ఆయన కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్‌ మూవీ ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముటి కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అఖిల్‌ స్పై ఏజెంట్‌ పాత్రలో యాక్షన్‌ అదరగొట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. మరి ఈ సినిమా ‘అయ్యగారి’ లవర్‌బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడేస్తుందో లేదో చూడాలి.


మళ్లీ గోపిగా అలరించేందుకు..

విలక్షణ పాత్రలను ఎంచుకుంటూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు అడవిశేష్‌. ఆయన కెరీర్‌లో ‘గూఢచారి’ చిత్రం ఓ మైలురాయి. ఇప్పుడు ఆ 'సినిమాకు సీక్వెల్‌నే సిద్ధం చేస్తున్నారు. వినయ్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం ‘జీ2’గా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో జరిగే కథతో తీర్చిదిద్దుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. మరి అడవిశేష్ గూఢచారిగా ఏ కథతో రాబోతున్నారు? ఆయన చేసే సాహసాలు ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!


రూటు మార్చిన నిఖిల్‌

‘కార్తికేయ2’తో పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంత చేసుకున్నాడు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా ఓ స్పై యాక్షన్‌ మూవీ తెరకెక్కుతోంది. గ్యారీ బీహెచ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని హై ఓల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ కూడా బాగానే జరుగుతోందని టాక్‌. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్ట్రీమింగ్‌ రైట్స్‌ను భారీ ధరపెట్టి కొనేసింది. ఇందుకోసం అమెజాన్‌ రూ.40కోట్లు వెచ్చించినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరు? ఎలాంటి కథ? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


బ్రిటిష్‌ గూఢచారిగా..

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నవీన్‌ మేడారం దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘డెవిల్‌’.  ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌.. అన్నది ఉపశీర్షిక.  అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు. 1945 కాలం నాటి మద్రాస్‌ ప్రెసిడెన్సీ నేపథ్యంగా సాగుతుంది. ఇందులో కల్యాణ్‌రామ్‌ బ్రిటిష్‌ గూఢచారిగా కనిపించనున్నారు మరి ఆయన కథేంటి? గూఢచారిగా ఆయన చేసిన సాహసాలేంటి? అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


వరుణ్‌తేజ్‌ కూడా అదే బాట?

‘గాండీవధారి అర్జున’ (Gandivdhari Arjuna)గా యాక్షన్‌ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. పూర్తిగా లండన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో వరుణ్‌ తేజ్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా యాక్షన్‌తో అదరగొట్టనున్నారు.


స్పై యూనివర్స్‌ సృష్టించిన యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌

గత కొంతకాలంగా విజయాలు లేక సతమతమైన బాలీవుడ్‌కు మంచి కిక్‌ ఇచ్చిన మూవీ ‘పఠాన్‌’. షారుఖ్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1000కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ‘యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌’లో మరికొన్ని ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. సల్మాన్‌ కథానాయకుడిగా ‘టైగర్‌3’ ఇప్పటికే సెట్స్‌ ఉంది. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో ‘వార్2’ తెరకెక్కనుంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు. (ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.) ఈ రెండూ పూర్తయిన తర్వాత ఇండియన్‌ బిగ్గెస్ట్‌ మూవీ ‘టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌’ రూపొందనుంది. ఇలా వరుస స్పై చిత్రాలు బాలీవుడ్‌ను అలరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని