Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్‌..!

‘తెలిసి తెలిసి ఫ్లాప్‌ సినిమా తీయం కదా’ చాలా మంది దర్శకులు/నటులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాట. కావచ్చు.. కానీ, చూసిన కథలనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుడు కూడా చూడలేడు కదా!

Published : 01 Jul 2022 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తెలిసి తెలిసి ఫ్లాప్‌ సినిమా తీయం కదా’.. చాలా మంది దర్శకులు/నటులు ఇంటర్వ్యూల్లో చెప్పే మాట ఇది. కావచ్చు.. కానీ, చూసిన కథలనే మళ్లీ మళ్లీ ప్రేక్షకుడు కూడా చూడలేడు కదా! విభిన్న కథలతో కొందరు దర్శకులు సినిమాలు తీస్తుంటే.. మరికొందరు దర్శకులు/నటులు ఇంకా అవే పాత కథలకు కొత్త పెయింట్‌ వేసి వదిలేస్తున్నారు. ఒకప్పుడు కథ-కాకరకాయ లేకపోయినా స్టార్‌ హీరో అనే ట్యాగ్‌తో సినిమాలు సేల్‌ అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేక్షకుడికి అంత సమయం కూడా లేదు. సినిమా బాగుందా? లేదా?అంతే! మరి ఈ ఆర్నెల్ల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయిన సినిమాలివే!

భారీ అంచనాలతో విడుదలై..

అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi)ది 150 చిత్రాల అనుభవం. ఆయన చూడని ఎత్తు పల్లాలు లేవు. కానీ, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ‘ఆచార్య’(acharya) గుణపాఠమే చెప్పింది. తనయుడు రామ్‌చరణ్‌(Ram charan) నటించడం, కొరటాల శివ దర్శకత్వం వహించడం సినిమాపై అంచనాలను పెంచాయి. కానీ, ఆ అంచనాలను అందుకోలేక అటు దివ్య వనానికి ఇటు తీర్థజలానికి కాకుండా పాదఘట్టంలో ఉండిపోవాల్సి వచ్చింది. కొరటాల శివ(koratala siva) వరుస విజయాలకి బ్రేక్‌ పడింది. కథను నడిపించడంలో నిదానమే ప్రదానం అంటూ సాగే కొరటాల సినిమాలు ఇంతకు ముందు ఏదో ఒక సామాజిక సందేశంతో ప్రేక్షకుల దగ్గర మార్కులు వేయించేసుకున్నా ‘ఆచార్య’కి వచ్చేసరికి ఆ డొల్లతనం స్పష్టంగా బయటపడింది. ఇక ‘రాధేశ్యామ్‌’ (Radhe shyam) విషయానికొస్తే ప్రభాస్‌(Prabhas) హీరో.. పూజా హెగ్డే(pooja hegde) కథానాయిక.. వింటేజ్‌ లవ్‌ స్టోరీ.. విదేశాల్లో షూటింగ్‌ వెరసి మూవీపై అంచనాలు సినిమా చివరిలో కనిపించే షిప్‌ అంత కనిపించాయి. క్లైమాక్స్‌లో అదే షిప్‌ మునిగిపోయినట్లు సినిమా కూడా మెప్పించలేకపోయింది. ప్రభాస్‌ అనే స్టార్‌ ట్యాగ్‌ కూడా పనిచేయలేదు.

ఒకప్పుడు రవితేజ(Ravi teja) అంటే మినిమం గ్యారెంటీ హీరో. కానీ, రొటీన్‌ మాస్‌ సినిమాలతో ఆయన కూడా సగటు వెగటు సినిమాలను తీయడంతో వరుస ఫ్లాప్‌లు అందుకున్నారు. మధ్య ‘రాజా ది గ్రేట్‌’, ‘క్రాక్‌’లు  ఉన్నా మళ్లీ ‘ఖిలాడీ’(Khiladi) అంటూ రొటీన్‌ మాస్‌ కమర్షియల్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బాక్సాఫీస్‌వద్ద విజయాన్ని అందుకోలేకపోయారు. ‘మహానటి’తో మంచి ఇమేజ్‌ తెచ్చుకున్న కీర్తి సురేశ్‌(Keerthy suresh) కూడా ‘గుడ్‌ లక్‌సఖి’(GoodLuck Sakhi)తో ప్రేక్షకులను పలకరించినా.. ‘బ్యాడ్‌ లక్‌’ ఎదురైంది. విలక్షణ నటుడు మోహన్‌బాబు(Mohan babu) నటించిన ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’(Son of india)ది అదే పరిస్థితి. తొలి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటాడని వరుణ్‌తేజ్‌కు మంచి పేరుంది. కానీ, ‘గని’ దెబ్బలో పసలేదు. అదే పాత చింతకాయ పచ్చడి. కాస్త తాలింపు, ఇంగువ వేసి వదిలారు.

మారితేనే మెచ్చుతారు..

కథా, కథనం అనేవి సినిమాకి గుండె లాంటివి. వాటిని సరిగ్గా అందించి, నడిపించినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఆధునికత జోడించడమూ అవసరమే. హై బడ్జెట్ హంగులు, మూస ఫార్ములాలు, పాన్‌ ఇండియా హోదాలు సినిమా విజయానికి ఉపకరిస్తాయే తప్ప విజయానికి ప్రధాన కారణం కావు. కథ పాతదే అయినా కొత్తగా, ఆకట్టుకునేలా కథనాన్ని మలిచి విజయాలను అందుకుంటున్నారు మరికొందరు దర్శకులు. మోతాదుకు మించని వైవిధ్యత ప్రదర్శించినప్పుడే సినిమా ప్రేక్షకుల మెప్పును పొందుతుంది. అవే అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి. 2022 అర్ధభాగంలో మంచి అంచనాలు ఏర్పడి వాటిని అందుకోలేకపోయిన చిత్రాలకు ఇవి కొన్ని ఉదాహరణ మాత్రమే. ఈ జాబితాలో చిన్న హీరోలు/చిత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని