Cinema news: ఒక్క పంచ్‌ డైలాగ్‌ లేదు.. విజువల్స్‌తో కట్టిపడేశారు!

కేవలం విజువల్స్‌తోనే మెస్మరైజ్‌ చేస్తున్న ఆ సినిమాలు వీడియోలు ఏంటో చూసేద్దామా?

Published : 05 Nov 2021 08:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ హీరో సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌లు ఎప్పుడు వస్తాయా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తుంటారు. టీజర్‌, ట్రైలర్‌ విడుదలైతే ఎన్ని క్లోజప్‌ షాట్‌లు పడ్డాయి? ఎన్ని గెటప్‌ల్లో కనిపించాడు? పంచ్‌ డైలాగ్‌లేంటి? ఇలా లెక్కలేసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తారు. కానీ, త్వరలో విడుదల కాబోయే కొన్ని చిత్రాలు ప్రచారం విషయంలో కొత్త పంథా అనుసరిస్తున్నాయి. హీరోల పంచ్‌ డైలాగ్‌లతో పని లేకుండా ‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అన్నట్టు కేవలం విజువల్స్‌తో టీజర్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేస్తున్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో ఆ సినిమాలు విడుదలవుతుండటం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ఇక వ్యూస్‌ పరంగా యూట్యూబ్‌లో మిలియన్లు దాటేస్తున్నాయి. కేవలం విజువల్స్‌తోనే మెస్మరైజ్‌ చేస్తున్న ఆ సినిమాలు వీడియోలు ఏంటో చూసేద్దామా?

ఆ ఒక్క వీడియోతో రాఖీభాయ్‌ రికార్డులు

భారతీయ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌-1’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌-2’ రాబోతోంది. ఈ ఏడాది జనవరిలో యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్‌ ఇప్పటివరకూ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 200మిలియన్‌ వ్యూస్‌కు పైగా సాధించింది. ఇందులో హీరోతో ఒక్క డైలాగ్‌ కూడా చెప్పించలేదు. 2 నిమిషాల 16 సెకన్ల పాటు సాగే ఈ వీడియోను కేవలం బ్యాగ్రౌండ్‌ వాయిస్‌తోనే అభిమానుల మనసు దోచేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘పుష్పరాజ్‌’ తగ్గేదేలే!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ సినిమా తొలి భాగం ఈ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో  బన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులోనూ హీరోతో భారీ పంచ్‌ డైలాగ్‌లు ఏమీ చెప్పించలేదు కేవలం ‘తగ్గేదేలే’ అనే మాట తప్ప మరో డైలాగ్‌ లేదు. పాన్‌ ఇండియా సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆ రెండు వీడియోలు అదుర్స్‌

భారతీయ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో చిత్రం ‘ఆర్ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. చారిత్రక కథ ఫిక్షన్‌ జోడించి జక్కన్న పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల పుట్టిన రోజు సందర్భంగా ఒకరికి మరొకరి వాయిస్‌తో పరిచయ వీడియోలను విడుదల చేసింది చిత్ర బృందం. కానీ, దీపావళి కానుకగా సోమవారం విడుదల ‘ఆర్‌ఆర్‌ఆర్‌ గ్లింప్స్‌’లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. కేవలం విజువల్స్‌తో కట్టిపడేసింది. ప్రేక్షకుడిని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఎక్కడ కన్ను మూస్తే ఏది మిస్‌ అయిపోతామోనని 46 సెకన్ల పాటు నెటిజన్లు కళ్లప్పగించి చూశారంటే అతిశయోక్తి కాదు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని