karthi: దిల్లీ వెళ్లినా ‘ఢిల్లీ’ గురించి అడుగుతున్నారు.. ‘సర్దార్’ ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు!

కార్తి కథానాయకుడిగా నటించిన ‘సర్దార్’ అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు మీకోసం..

Published : 20 Oct 2022 23:03 IST

‘సర్దార్’లో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారని, ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది తమ అలవాట్లు మార్చుకుంటారని కథానాయకుడు కార్తి అన్నారు. ఆయన కీలక పాత్రలో పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సర్దార్’. రాశిఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘సర్దార్’ యథార్ధ సంఘటనల స్ఫూర్తి ఆధారంగా ఉంటుందా?

కార్తి: సర్దార్ పాత్ర రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్థాన్‌లో జనరల్‌గా పని చేశారు. దీని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు. ఇందులో తండ్రీ-కొడుకుల పాత్రల్లో కనిపిస్తా. 60ఏళ్ల వ్యక్తిగా కనిపించడానికి చాలా హోంవర్క్‌ చేయాల్సి వచ్చింది. గెటప్ వేసుకుంటే వృద్ధుడిలా కనిపించవచ్చు. కానీ, ‘సర్దార్’ యాక్షన్ కూడా చేయాలి. అందుకు తగినట్లుగా సిద్ధమయ్యా. ‘ఖైదీ’ చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి దీటుగా ఉండాలని తీశాం. ఈ సినిమాకు కూడా అలాగే పనిచేశాం. కెమెరామెన్‌ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980ల నాటి కాలాన్ని సృష్టించారు.

‘పొన్నియిన్ సెల్వన్’తో విజయం అందుకున్నారు. ఇప్పుడు ‘సర్దార్’తో వస్తున్నారు. ఎలా అనిపిస్తోంది?

కార్తి: ‘పొన్నియిన్ సెల్వన్’ ఈ ఏడాది వేసవికి రావాలి. ఆలస్యమైంది. ఇప్పుడు ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్‌గా వస్తోంది. ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ కథ వినకముందు దాని గురించి ఆలోచన లేదు. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని మామూలు అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకం ఉంది.

‘సర్దార్’కు పాన్‌ ఇండియా సినిమా అవకాశం ఉంది కదా!

కార్తి: అవును. ఒక వారం తర్వాత బాలీవుడ్‌లోనూ విడుదల చేస్తాం. సర్దార్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. నిజానికి ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకంతోనే ఇలాంటి భారీ సినిమాలు చేస్తున్నాను. కాష్మోరా, ఖాకీ, ఖైదీ, పొన్నియిన్ సెల్వన్ ఇలా అన్నీ చిత్రాలని ఆదరిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోంది.

తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?

కార్తి: కొన్ని కథలు వింటున్నాను. నిజానికి తెలుగును  వేరే పరిశ్రమ అనుకోను. ఇది నా సొంత ఇల్లు. అమ్మ ఇంటి నుండి పిన్ని ఇంటికి వచ్చినట్లే ఉంటుంది. (నవ్వుతూ) తెలుగులో ‘సర్దార్’ నాగార్జున అన్నయ్య విడుదల చేస్తున్నారు. సినిమాకి కావాల్సిన అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటా. ఇక దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ది మంచి వ్యక్తిత్వం. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది.

దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి? ఎలాంటి పోటీ ఉంటుందని భావిస్తున్నారు?

కార్తి: గతంలో పది సినిమాలు కూడా వచ్చాయి. (నవ్వుతూ). పోటీ అంటూ ఏమీ ఉండదు. సినిమా బాగుంటే కచ్చితంగా చూస్తారని నమ్ముతా

‘ఖైదీ2’ ఎప్పుడు?

కార్తి: దిల్లీ వెళ్ళినా ఢిల్లీ గురించి అడుగుతున్నారు( నవ్వుతూ). విక్రమ్ తర్వాత దీనికి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే చేస్తాం. ఆ వివరాలు కూడా చెబుతా.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని