Mahesh Babu: ఆ సినిమాను వందసార్లు చూశాను: మహేశ్‌ బాబు

‘హరోం హర’ (Harom Hara) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అందులో మహేశ్‌ బాబుతో సుధీర్‌ బాబు మాట్లాడిన ఆడియోను వినిపించారు.

Published : 12 Jun 2024 10:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’ (Harom Hara). జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరోలు అడివి శేష్‌, విశ్వక్‌ సేన్‌ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 

సుధీర్‌ బాబు (Sudheer Babu) మాట్లాడుతూ.. ‘అడివి శేష్‌ నాకు స్ఫూర్తి. తన తలరాతను తానే రాసుకున్నాడు. సినిమా కథల విషయంలో చాలా మంది అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేసుకుంటారు. ఈ రోజుల్లో ఒక హీరోకు మరో హీరో సపోర్ట్‌ చేసుకోవాలి. ఏ సినిమా ప్రీరిలీజ్‌ అయినా విశ్వక్‌సేన్‌ హాజరవుతారు. అది తనలో ఉన్న గొప్ప లక్షణం. ‘హరోంహర’లో నేను సుబ్రహ్మణ్యం పాత్రలో కనిపిస్తాను. ఇది మంచి విజయం సాధిస్తుంది. దీని కోసం చాలా మంది కష్టపడ్డారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. నన్ను ఇలాంటి పాత్రలో చూడాలని మా మావయ్య (కృష్ణ) కోరుకున్నారు. ఆయన ఉంటే ఆనందించేవారు. ఈ చిత్ర నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ సుబ్రహ్మణ్యంలా ఫీలవుతారు. ముఖ్యంగా హీరో మహేశ్‌ బాబుకు థ్యాంక్స్‌ చెప్పాలి. ట్రైలర్‌ చూశాక చాలా సపోర్ట్‌ చేశారు. ఆయనతో సినిమా తీయాలంటే రెండేళ్లు పడుతుంది. ఈ గ్యాప్‌లో నేను మీ ముందుకు వచ్చి అలరిస్తాను. ఆయన ఇచ్చినంత కిక్‌ ఇవ్వకపోవచ్చు గానీ.. కచ్చితంగా మీ అందరికీ వినోదాన్ని పంచుతాను’ అని చెప్పారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అడివి శేష్ అన్నారు. సుధీర్‌ మంచి సినిమా చేశారన్నారు. ‘హరోం హర’ చిత్రబృందంతో తనకు పనిచేయాలనుందని విశ్వక్‌సేన్‌ అన్నారు.

ఇక ఇదే ఈవెంట్‌లో మహేశ్‌ బాబుతో (Mahesh Babu) మాట్లాడిన ఫోన్‌ రికార్డును సుధీర్‌బాబు ప్లే చేశారు. అందులో సుధీర్‌ అడిగిన కొన్ని ప్రశ్నలకు మహేశ్‌ సమాధానమిచ్చారు.

సుధీర్‌బాబు: సినిమాల్లో మొదటిసారి గన్స్‌ ఉపయోగించినప్పుడు ఎలా అనిపించింది?
మహేశ్‌ బాబు: గన్స్‌ ఉపయోగించడంపై నేను ప్రత్యేక శిక్షణేం తీసుకోలేదు. ‘టక్కరి దొంగ’లో ఎక్కువగా గన్స్‌ వాడాం. ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం.

సుధీర్‌బాబు:  గన్స్‌ను చూపించిన సినిమాల్లో నీకు నచ్చింది ఏది?
మహేశ్‌ బాబు: నాన్న గారు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఆ సినిమాను వందసార్లు చూసుంటాను. నాకు చాలా ఇష్టమైన చిత్రమది.

సుధీర్‌బాబు: ‘హరోంహర’లో నీకు బాగా నచ్చిన పాట?
మహేశ్‌ బాబు: టైటిల్ సాంగ్‌ చాలా నచ్చింది. అది వినగానే నేను నీకు మెసేజ్‌ కూడా చేశాను.

సుధీర్‌బాబు: ‘హరోంహర’ ట్రైలర్‌లో నీకు నచ్చిందేంటి?
మహేశ్‌ బాబు: నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్‌. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది. 

సుధీర్‌బాబు: నువ్వు నటించిన ‘నిజం’ సినిమా గురించి ఆసక్తికర విషయాలేమైనా గుర్తున్నాయా?
మహేశ్‌ బాబు: నాకు చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్‌ చెప్పాలి. ‘నిజం’ చేసినందుకు ఇప్పటికీ గర్వపడుతుంటాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని