Tollywood: అదిరేలా...ఆహార్యం

కొంతకాలం కిందట వరకు కథలు, కథానాయకుల పాత్రలు మూసధోరణిలో సాగేవి. కొత్త ప్రయత్నాలకి దాదాపుగా దూరంగా ఉండేవారు. ‘ప్రయోగాల జోలికి వెళ్లడం అవసరమా?’ అనేవారు. దాంతో కథ మొదలుకొని తెరపై కథానాయకుల వరకు ఎక్కడా మార్పు కనిపించేది కాదు. ఈ మధ్య సీన్‌ మారింది. కథానాయకులు చేసే ప్రతి సినిమా ఓ కొత్త రకమైన మేనరిజమ్‌ని, ప్రతీ పాత్ర ఓ కొత్త రకమైన స్టైల్‌ని కోరుకుంటుంది.

Updated : 16 Apr 2022 08:53 IST

ఎప్పుడూ ఒకేలా తెరపై కనిపిస్తే అందులో కిక్‌ ఏముంటుంది? అందుకే, కథలతోనే కాకుండా.. అప్పుడప్పుడూ వేషధారణతోనూ ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంటారు మన తారలు. కొన్నిసార్లేమో కథలే కొత్త రకమైన వేషధారణని డిమాండ్‌ చేస్తాయి. కొన్నిసార్లు కథలతో సంబంధం లేకుండా కథానాయకులు నయా గెటప్పులు ప్రయత్నిస్తుంటారు. సినిమా సినిమాకీ వైవిధ్యం ప్రదర్శించడంలో భాగమే అదంతా!

కొంతకాలం కిందట వరకు కథలు, కథానాయకుల పాత్రలు మూసధోరణిలో సాగేవి. కొత్త ప్రయత్నాలకి దాదాపుగా దూరంగా ఉండేవారు. ‘ప్రయోగాల జోలికి వెళ్లడం అవసరమా?’ అనేవారు. దాంతో కథ మొదలుకొని తెరపై కథానాయకుల వరకు ఎక్కడా మార్పు కనిపించేది కాదు. ఈ మధ్య సీన్‌ మారింది. కథానాయకులు చేసే ప్రతి సినిమా ఓ కొత్త రకమైన మేనరిజమ్‌ని, ప్రతీ పాత్ర ఓ కొత్త రకమైన స్టైల్‌ని కోరుకుంటుంది. దాంతో అప్రయత్నంగానే లుక్‌లో మార్పు జరుగుతోంది.

అల్లు అర్జున్‌ ఇదివరకు వాణిజ్య ప్రధానమైన సినిమాలే చేసినా, ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించేవారు. ఆ విషయంలో ఆయన వ్యక్తిగత అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంటుంది. హెయిర్‌ స్టైల్‌లో చిన్న మార్పు చేసైనా సరే, కొత్త లుక్‌తో కనిపించేలా జాగ్రత్త పడుతుంటారు. ‘పుష్ప’ సినిమాలో అయితే ఆయన పూర్తిగా పాత్రకి తగ్గట్టుగా మారిపోయారు. ఆ కథ అలా డిమాండ్‌ చేసింది. వెంటనే ‘పుష్ప2’ చేయనున్నారు కాబట్టి ఆయన అదే గెటప్‌లో కొనసాగుతున్నారు. లేదంటే ఇప్పటికే ఆయన లుక్‌ మారిపోయేది. పవన్‌కల్యాణ్‌ లుక్‌లోనూ పెద్దగా మార్పు కనిపించేది కాదు. ‘హరి హర వీర మల్లు’ సినిమాతో ఆయన ఆహార్యం పూర్తిగా మారిపోయింది. చారిత్రాత్మక గాథతో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి వస్త్రధారణ మొదలుకొని, తలకట్టు వరకు అన్ని విషయాల్లోనూ కొత్తదనం కనిపిస్తోంది.


ఎన్టీఆర్‌ మరోసారి...

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌... కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న కొత్త చిత్రం కోసం మరోసారి లుక్‌ని మార్చనున్నారు. ఆయన మరింత నాజూగ్గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా సన్నద్ధం కానున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కండలు పెంచి భీమ్‌ పాత్రకి తగ్గట్టుగా ఆయన మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొత్త పాత్రకి తగ్గట్టుగా కసరత్తులు షురూ చేసినట్టు సమాచారం. జూన్‌ నుంచి ఆ సినిమా పనులు మొదలు కానున్నాయి.


అప్పుడు ఫైటర్‌... ఇప్పుడు సోల్జర్‌

విజయ్‌ దేవరకొండని ‘లైగర్‌’లో ఫైటర్‌గా చూపించనున్నారు పూరి జగన్నాథ్‌. ఆ సినిమా కోసం ఆయన కండలతోపాటు, జుట్టు పెంచిన విషయం తెలిసిందే. అది చిత్రీకరణ పూర్తయింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలోనే  కొత్త సినిమా ‘జనగణమన’ ఇటీవల మొదలైంది. ఇందులో విజయ్‌ ఓ సైనికుడి పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రకి తగ్గట్టుగానే ఆయన లుక్‌ని మార్చేశారు.

* యువ కథానాయకుడు అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’ కోసం తన స్టైల్‌ని మార్చుకున్న విషయం తెలిసిందే. కండలు దేహంతో సిద్ధం కావడంతోపాటు, ఆయన హెయిర్‌స్టైల్‌ మారింది. కథానాయకుల్ని స్టైలిష్‌గా చూపించడానికి ఇష్టపడే దర్శకులు చాలామందే. సురేందర్‌ రెడ్డి అందులో ఒకరు. మన కథానాయకుల గెటప్పులు మారడంలో వాస్తవ గాథల ప్రభావమే ఎక్కువని పరిశ్రమ వర్గాల మాట. ఇదివరకు తమిళంలోనే ఆ తరహా కథలు రూపొందేవి. దాంతో ఆ కథానాయకులు గుర్తు పట్టలేని విధంగా తెరపై దర్శనమిచ్చేవారు. ఇప్పుడు మన కథానాయకులు ఆ తరహా ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.


నాని... రవితేజ

కొన్ని సినిమాలు నటుల నుంచి చాలానే డిమాండ్‌ చేస్తుంటాయి. మేనరిజమ్‌ మొదలుకొని, మాట్లాడే భాష యాస, గెటప్పు ఇలా అన్ని విషయాల్లోనూ మార్పు కోరుకుంటాయి. ఈమధ్య దర్శకులు సిద్ధం చేస్తున్న వాస్తవిక గాథలన్నీ  అలా డిమాండ్‌ చేస్తున్నవే. నటులు ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా పాత్రలు కోరుకున్నట్టే మారిపోతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు పాత్రలు కోరుకున్నట్టే తమని తాము మలచుకున్నారు. నాని ‘దసరా’ కోసం పూర్తిగా తన గెటప్‌ని మార్చుకోవల్సి వచ్చింది. గోదావరి ఖని నేపథ్యంలో సాగే ఆ కథ కోసం జట్టు, గెడ్డం పెంచి కనిపించడంతోపాటు, తెలంగాణ యాస మాట్లాడనున్నారు. రవితేజ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ కోసం ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా తెరపై కనిపించనున్నారు. ఆయన వేషభాషలూ మార్చుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని