అనుష్క.. సమంత.. కీర్తి.. మెరిసిందెవరు?

అప్పుడప్పుడు వెండితెరను అలరించినాకథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే

Updated : 22 Dec 2020 09:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పుడప్పుడు వెండితెరను అలరించినా, కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే, ఇటీవల కాలంలో ఈ చిత్రాల జోరు మరింత పెరిగిందనే చెప్పాలి. 2020 చిత్ర పరిశ్రమకు ఒక పీడకల. కరోనా కారణంగా యావత్‌ ప్రపంచంతో పాటు, సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. దీంతో చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ వేదికగా సందడి చేశాయి. ఎప్పటిలాగే కొన్ని కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలూ, ఈ ఏడాది ప్రేక్షకులను అలరించాయి. అలా ఆకట్టుకున్న చిత్రాలు, నాయికలు.. ఎవరో చూద్దామా!

తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ప్రాధాన్యం ఉన్న కథానాయిక అంటే గుర్తొచ్చే పేరు అనుష్క. ‘అరుంధతి’తో వచ్చిన స్టార్‌డమ్‌ ఇప్పటికీ ఆమెను ఓ మెట్టుపైనే నిలబెడుతోంది. దీంతో దర్శక-నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా ఈ ఏడాది ఆమె కీలక పాత్రలో హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నిశ్శబ్దం’. థియేటర్‌లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం చివరకు ఓటీటీ వేదికగా విడుదలైంది. బధిర యువతిగా అనుష్క నటన మెప్పించినా, అభిమానుల అంచనాలను ‘నిశ్శబ్దం’ అందుకోలేకపోయింది.

‘మహానటి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేశ్‌ ఒకవైపు గ్లామర్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తోంది. అలా ఈ ఏడాది ఆమె ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ చిత్రాల్లో నటించింది. ఈ రెండు కూడా ఓటీటీ వేదికగానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇవి ‘కీర్తి’ని పెంచలేకపోయాయి. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా ‘పెంగ్విన్‌’ పర్వాలేదనిపిస్తే, ‘మిస్‌ ఇండియా’ పూర్తి మిస్‌ ఫైర్‌ అయింది.

వివాహం తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది సమంత. గతేడాది ‘ఓ బేబీ’తో అలరించిన ఆమె ఈ ఏడాది ‘జాను’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘96’ రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. శర్వానంద్‌, సమంత నటనతో మెప్పించిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కేవలం ఓ ఫీల్‌ గుడ్‌ మూవీలా మిగిలిపోయింది. తమిళంలో జరిగిన మేజిక్‌ తెలుగులో జరగలేదు.

యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితకథ ఆధారంగా దీపిక పదుకొణె నటించిన చిత్రం ‘ఛపాక్‌’. మేఘానా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. యాసిడ్‌ దాడులకు గురైన వారు శారీరకంగా, మానసికంగా ఎంత కుంగిపోతారు? సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటారన్న దాన్ని మేఘన చక్కగా చూపించారు. లక్ష్మీ అగర్వాల్‌ పాత్రలో దీపిక అద్భుతంగా నటించింది.

బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న నటి తాప్సి. గతేడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ నాలుగింటిలోనూ ఆమె కీలక పాత్రే పోషించారు. కాగా అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో తాప్సి నటించిన చిత్రం ‘థప్పడ్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచిటాక్‌నే తెచ్చుకుంది. ఇందులో అమృత అనే మహిళ పాత్రను తాప్సి పోషించింది. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన అమృతను అందరి ముందు చెంప దెబ్బ కొడతాడు ఆమె భర్త. దీంతో అమృత తీవ్ర మనస్థాపానికి గురవుతుంది. చివరకు అది విడాకుల వరకూ దారి తీస్తుంది. ప్రేమతో పాటే ఆత్మగౌరవం కూడా ముఖ్యమని భావించే అమృత తన విక్రమ్‌ను తిరిగి కలిసిందా? లేక విడిపోయిందా? అన్న అంశం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్‌’తో వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్‌. తల్లి నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని అందంతో పాటు అభినయాన్ని ప్రదర్శిస్తోంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’. ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం ఓటీటీ వేదికగా ఈ సినిమాను విడుదల చేసింది. ఇందులో జాన్వీ నటన, హావభావాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే, అభిమానులను సంతృప్తి పరిచేస్థాయిలో సినిమా లేకపోవడం కాస్త నిరాశ పరిచింది.

తొలి నుంచి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌గా పేరుగాంచింది కంగనా రౌనౌత్‌. గతేడాది ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’, ‘జడ్జిమెంట్‌ హై క్యా’లతో అలరించింది. ఇక ఈ ఏడాది ఆమె సినిమాల కన్నా వివాదాలతో ఎక్కువగా సావాసం చేసింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఎక్కువ ట్రెండ్‌ అయింది. అశ్విన్‌ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘పంగా’ ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది.

హ్యూమన్‌ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతల దేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శకుంతల దేవి’. గణితంలో అసమాన ప్రతిభ కలిగిన ఆమె కథతో చిత్రం వస్తోందంటే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటి విద్యా బాలన్‌ టైటిల్‌ రోల్‌ పోషించడంతో ఆ ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. శకుంతల దేవిగా విద్యా బాలన్‌ మెప్పించినా, శకుంతల దేవి జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయింది. పైగా నిడివి కూడా సినిమాకు మైనస్‌ అయింది.

ఇవీ చదవండి...

ఈ ఏడాది కిక్ ఇచ్చిన క్లిక్స్‌ ఇవే..!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని