Cinema News: వచ్చే ఏడాది కలుద్దాం..

‘నిదానమే ప్రధానం’ అన్నది కథానాయకుల మాటైతే.. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నది అందాల నాయికలు నమ్మే సూత్రం. ఈ మాటకు తగ్గట్లుగానే సంక్రాంతికి ఒకటి.. వేసవికి ఇంకొకటి.. దసరాకి మరొకటి అంటూ ఏడాది పొడవునా వరుస సినిమాలతో సందడి చేసే ప్రయత్నం చేస్తుంటారు.

Updated : 23 Oct 2022 13:49 IST

‘నిదానమే ప్రధానం’ అన్నది కథానాయకుల మాటైతే.. ‘ఆలస్యం అమృతం విషం’ అన్నది అందాల నాయికలు నమ్మే సూత్రం. ఈ మాటకు తగ్గట్లుగానే సంక్రాంతికి ఒకటి.. వేసవికి ఇంకొకటి.. దసరాకి మరొకటి అంటూ ఏడాది పొడవునా వరుస సినిమాలతో సందడి చేసే ప్రయత్నం చేస్తుంటారు. జెట్‌ స్పీడ్‌తో కెరీర్‌ను పరుగులు పెట్టించాలని ఉవ్విళ్లూరుతుంటారు. పూజా హెగ్డే, సాయిపల్లవి, రష్మిక, కృతిశెట్టి, రాశీ ఖన్నా తదితర భామలంతా ఈ ఏడాది ఇదే తరహాలో జోరు చూపించారు. కొవిడ్‌తో బాకీ పడిన వినోదాలన్నింటినీ వడ్డీతో సహా కొసరి కొసరి వడ్డించారు. ఇక కీర్తి సురేష్‌, తమన్నా, నిత్యా మేనన్‌, అనుపమ పరమేశ్వరన్‌, నివేదా థామస్‌ వంటి మరికొందరు భామలు కనీసం ఒక్కో చిత్రంతోనైనా బాక్సాఫీస్‌ ముందు సందడి చేసి మురిపించారు. అయితే ఈ ఏడాది తెలుగు సినీ క్యాలెండర్‌లో ఇంత వరకు కనిపించని ఇంకొందరు స్టార్‌ నాయికలూ ఉన్నారు. వచ్చే ఏడాది కలుద్దామంటూ ఊరిస్తున్నారు. మరి ఆ అందాల నాయికలు ఎవరు? వారి కొత్త చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం..


ఆచితూచి అడుగులు

వకాశాలు రాక ఎదురు చూసే వాళ్లు కొందరైతే.. అవకాశాలున్నా ఆచితూచి అడుగేయాలన్న ఆలోచనతో నెమ్మదిగా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న వారు ఇంకొందరు. అనుష్క ఈ రెండో కోవకే చెందుతుంది. ‘అరుంధతి’, ‘భాగమతి’ సినిమాలతో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారిన స్వీటీ.. అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో మరీ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీంతో కొన్నేళ్లుగా ఆమె నుంచి ఏడాదికి ఒక్కో చిత్రం రావడమే గగనమైపోయింది. ‘నిశ్శబ్దం’ తర్వాత రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. ఆచితూచి ఓ చిత్రానికి పచ్చజెండా ఊపింది. అదే నవీన్‌ పొలిశెట్టి హీరోగా యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న సినిమా. మహేష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం ఈ ఏడాదిలోనే బాక్సాఫీస్‌ ముందుకొచ్చి ఉండేది. కానీ, కొవిడ్‌ పరిస్థితుల వల్ల సినిమా సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైంది. దీంతో అనుష్క ఈ ఏడాది బోణీ కొట్టలేకపోయింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ వినూత్న ప్రేమకథా చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


కొత్త ఏడాదిలోనైనా కనిపించేనా?

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు సినీప్రియుల మనసులు దోచుకుంది నటి నభా నటేష్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ వంటి విజయాలతో జోరు చూపించింది. అయితే ‘మ్యాస్ట్రో’ తర్వాత ఆమె నుంచి మరో కొత్త కబురు వినపడలేదు. దీంతో నభా సినీ కెరీర్‌లో 2022 ఖాళీ ఏడాదిగా మిగిలిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఓ యువ హీరో చిత్రం కోసం ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఖాయమైతే మాత్రం మళ్లీ వచ్చే ఏడాది ఆమెను తెరపై చూసే అవకాశం దొరుకుతుంది. అయితే ఇది కార్యరూపం దాల్చుతుందో.. లేదో చూడాలి.


చేతి నిండా చిత్రాలు.. కానీ!

ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమె ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేసింది. కానీ, వాటిలో తెలుగు చిత్రం ఒక్కటీ లేదు. ‘కొండపొలం’ సినిమా తర్వాత ఆమె దాదాపు అరడజనుకు పైగా చిత్రాలకు సంతకాలు చేసినా.. వాటిలో ఒక్క తెలుగు సినిమా లేకపోవడం గమనార్హం. దీంతో ఆమె ఈ ఏడాది తెలుగు తెరపై సందడి చేసే అవకాశాలు లేవు. తమిళంలో మాత్రం ‘ఇండియన్‌2’, ‘అయలాన్‌’ చిత్రాల్లో సందడి చేస్తోంది. ఇవి అనువాదాలుగా వచ్చే ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


మూడు చిత్రాలతో ముచ్చటగా..

వెండితెరపై పదేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న కొద్దిమంది నాయికల్లో శ్రుతిహాసన్‌ ఒకరు. ‘కాటమరాయుడు’ తర్వాత మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నాయిక ‘క్రాక్‌’ లాంటి హిట్‌తో తెలుగు తెరపైకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి మునుపటిలా వరుస చిత్రాలతో జోరు చూపించాలని ప్రణాళికలు రచించింది. ఇందుకు తగ్గట్లుగానే ‘సలార్‌’, ‘వాల్తేర్‌ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే చేతిలో మూడు చిత్రాలున్నా.. ఈ ఏడాదిని ఖాతా తెరవకుండానే ముగించేందుకు సిద్ధమైంది శ్రుతి. నిన్నమొన్నటి వరకు ఆమె ‘వీరసింహారెడ్డి’తో డిసెంబరులో బాక్సాఫీస్‌ ముందుకు కనిపించనున్నట్లు వార్తలు వినిపించాయి.  కానీ, ఇప్పుడది సంక్రాంతికి వెళ్లిపోవడంతో శ్రుతి ఈ ఏడాదిని ఖాళీగా ముగించాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది బాకీ పడిన వినోదమంతటినీ వచ్చే ఏడాది వడ్డీతో సహా తిరిగి వడ్డించనుంది. ప్రస్తుతం చిత్రసీమలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ‘వాల్తేరు వీరయ్య’ సైతం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే శ్రుతిని పెద్ద పండక్కే ఒకేసారి రెండు చిత్రాల్లో చూసే అవకాశం దొరుకుతుంది. లేదంటే వేసవిలో తిరిగి చూసుకునే ఛాన్స్‌ వస్తుంది. ఇక ‘సలార్‌’ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని