Chatrapathi: ‘ఛత్రపతి’ రీమేక్‌ చేసేందుకు భయపడ్డా.. సాయి నటనకు ఆశ్చర్యపోయా: వినాయక్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా దర్శకుడు వి. వి. వినాయక్‌ తెరకెక్కించిన రెండో సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమా మే 12న విడుదలకాబోతున్న సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 09 May 2023 22:40 IST

హైదరాబాద్‌: తెలుగు సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’ (Chatrapathi)ని హిందీలో రీమేక్‌ చేసే అవకాశం వచ్చినప్పుడు భయపడ్డానని ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్‌ (VV Vinayak) తెలిపారు. మాతృకలోని సన్నివేశాలను మార్చకుండా సినిమాని తెరకెక్కించామన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas) హీరోగా ఆయన రీమేక్‌ చేసిన ‘ఛత్రపతి’ ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత బెల్లంకొండ సురేశ్ (Bellamkonda Suresh), వినాయక్‌ పాల్గొన్నారు.

సాయి నటన చూసి ఆశ్చర్యపోయా: వినాయక్‌

‘‘ఇంత మంచి కథను అందించినందుకు రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారికి ధన్యవాదాలు. రాజమౌళి, ప్రభాస్‌ కలిసి చేసిన ఈ సినిమాని చాలా జాగ్రత్తగా రీమేక్‌ చేశాం. అందులోని ఐకానిక్‌ సన్నివేశాలను మార్చలేదు. అవసరం అనుకున్న చోట ఒకటికి పదిసార్లు ఆలోచించి చిన్న చిన్న మార్పులు చేశాం. ఇంటర్వెల్‌ సీన్‌లో సాయి నటన చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. ఎంతో పరిణతి కనబరిచాడు.     
హిందీలో అతడు పెద్ద స్టార్‌గా ఎదుగుతాడు. కొవిడ్‌ రెండు వేవ్‌లు, ఇతరత్రా అడ్డంకులు అధిగమించిన ఈ సినిమా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. సాయి తెలుగులో నటించిన సినిమాలన్నింటినీ పెన్‌ స్టూడియోస్‌ సంస్థే హిందీలో డబ్‌ చేసి, విడుదల చేస్తుంటుంది. ఆ సంస్థ సాయితో మరో రెండు సినిమాలు నిర్మించనుంది’’ అని వినాయక్‌ తెలిపారు.

మాతృకకు ఏమాత్రం తగ్గదు: బెల్లంకొండ సురేశ్‌

‘‘దర్శకుడు వి. వి. వినాయక్‌.. నా కొడుకుని ‘అల్లుడు శీను’తో ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పట్లో ఆ సినిమా రికార్డు సృష్టించింది. ఆ చిత్రం నుంచీ ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్‌ వరకు అన్నీ హిందీలో డబ్‌ అయి, బాలీవుడ్‌ ప్రేక్షకులనూ విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘జయ జానకి నాయక’ చిత్రం యూట్యూబ్‌లో 720 మిలియన్‌కిపైగా వ్యూస్‌ సొంతం చేసుకుని, వరల్డ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ‘ఛత్రపతి’ ఒరిజినల్‌కి ఏమాత్రం తగ్గకుండా వినాయక్‌ ఈ సినిమా తీశారు’’ అని నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ పేర్కొన్నారు. అనంతరం, వీరిద్దరు.. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

* ఈ సినిమాని ఎందుకు రీమేక్‌ చేయాలనుకున్నారు?

వినాయక్‌: బెల్లంకొండ సురేశ్‌ అనుకున్నది సాధించే వరకు వదలరు. ఈ సినిమా విషయంలోనూ అంతే. ఇక్కడ సూపర్‌హిట్‌ అయిన చిత్రాన్ని రీమేక్‌ చేయాలని చెప్పగానే ముందు భయపడ్డా. భయందేనికంటూ నన్ను ప్రోత్సహించారు. ఎలా చేస్తే బాగుంటుందో సలహా అడిగేందుకు ‘ఛత్రపతి’ కథ రాసిన విజయేంద్రప్రసాద్‌గారినే ముందు సంప్రదించా. ఈ సినిమా కోసం సాయి చాలా కష్టపడ్డాడు. 

* ఒరిజినల్‌ విడుదలై చాలా ఏళ్లైంది. ఈ గ్యాప్‌లో వచ్చిన సినిమాల్లో హీరోయిజం, ఎలివేషన్‌ సీన్లలో ఎన్నో మార్పులొచ్చాయి కదా. వాటిని పరిగణనలోకి తీసుకున్నారా?

వినాయక్‌: నేటి యువతలో చాలామంది ఒరిజినల్‌ ‘ఛత్రపతి’ సినిమాని చూసి ఉండరు. వారికి ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఒకవేళ దాన్ని చూసినా ఈ రీమేక్‌ కూడా బాగుందని అంటారనే నమ్మకం ఉంది. పాటలు, లొకేషన్లు.. ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి.

*  సినిమాని రీమేక్‌ చేయకుండా రాజమౌళి సినిమాని చేయడానికి కారణం?

వినాయక్‌: ‘ఛత్రపతి’ విడుదలైనప్పుడే పెన్‌ స్టూడియోస్‌ దాని రీమేక్‌ హక్కులు సొంతం చేసుకుంది. వాళ్ల దగ్గర ఈ చిత్రానికే రైట్స్‌ ఉన్నాయి కాబట్టి చేయాల్సి వచ్చింది.

* ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారా?

వినాయక్‌: కేవలం హిందీలోనే విడుదల చేస్తున్నాం. బెల్లంకొండ సురేశ్‌ స్పందిస్తూ.. ‘మన తెలుగు హీరో హిందీలో నటిస్తే మన ప్రేక్షకులు హిందీలోనే చూస్తారనే నమ్మకంతోనే తెలుగులో డబ్‌ చేయలేదు’ అని తెలిపారు.

* మాతృక చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రీకరించారా? మీ మార్క్‌ యాక్షన్‌ సన్నివేశాలు ఆశించొచ్చా?

వినాయక్‌: నా శైలిలో సాగే ఓ ఛేజింగ్‌ సీన్‌ ఉంటుంది.

* మీ తొలి చిత్రం ‘ఆది’ని హిందీలో రీమేక్‌ చేసే అవకాశం ఉందా?

వినాయక్‌: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. భవిష్యత్తులో జరుగుతుందేమో చూద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని