RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ హిందీ వెర్షన్‌ వచ్చేస్తోంది... అయితే ఉచితం కాదు!

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ తారక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భార....

Published : 13 May 2022 02:18 IST

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ తారక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 వేదికగా దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా మే 20 నుంచి అందుబాటులోకి రానుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌పై తాజాగా ప్రకటన వెలువడింది. ‘బుక్‌ మై షో స్ట్రీమ్‌’ వేదికగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హిందీ వెర్షన్‌ మే 20 నుంచే ప్రసారం కానుంది. అయితే, హిందీ వెర్షన్‌లో ఈ చిత్రాన్ని చూడాలనుకునే వారికి సదరు సంస్థ రెండు సౌకర్యాలు కల్పించింది. అందులో ఒకటి.. ప్రీ-రెంట్‌ కింద రూ.349 చెల్లించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని 30 రోజులకు అద్దెకు తీసుకోవచ్చు.

సినిమా చూడటం ప్రారంభించిన తర్వాత కేవలం రెండు రోజులు మాత్రమే దాన్ని చూసేందుకు వీలు ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిగ్గా మీ యాప్‌ నుంచి ఆ సినిమా డిలీట్‌ అయిపోతుంది. మళ్లీ రెంట్‌కి కావాలంటే అంతే మొత్తం చెల్లించి కొనుక్కోవచ్చు. ఇక రెండోది కొనుక్కోవడం. రూ.899 చెల్లించి ఈ చిత్రాన్ని కొనుక్కొని ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఈ రెండు ప్లాన్స్‌లోనూ ఆఫ్‌లైన్‌ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుంది. 4K క్వాలిటీలో సినిమాను అందిస్తామని సంస్థ చెబుతోంది. బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఒలీవియా మోరీస్‌, ఆలియా భట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, అలిసన్‌ డ్యూడీ, సముద్రఖని.. ఇలా పలువురు బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు నటించారు. మరోవైపు జీ5 వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మే 20 నుంచి సినిమా స్ట్రీమ్‌ కానుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని