Super Star Krishna: వరుసగా ఐదేళ్లు గెలిచి.. సూపర్‌స్టార్‌గా నిలిచి

కృష్ణకు సూపర్‌స్టార్‌ అనే ట్యాగ్‌ ఎలా వచ్చిందో తెలుసా? ఆ వివరాలివీ..

Updated : 15 Nov 2022 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా రంగంలో ‘పట్టుదలకు ప్రతీక. సాహసానికి చిరునామా’ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కృష్ణ (Krishna). కొందరు అభిమానులు ఆయన్ను ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్‌’ అంటారు. మరికొందరు ‘డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో’ అని కొనియాడతారు. ఇంకొందరు సూపర్‌స్టార్‌ అని పిలుచుకుంటారు. ఆయన చేసిన ప్రయోగాల వల్ల ‘జేమ్స్‌బాండ్‌’, ‘డేరింగ్‌, డాషింగ్‌’గా గుర్తింపు పొందారనేది తెలిసిన విషయమే. మరి, కృష్ణ సూపర్‌స్టార్‌ ఎలా అయ్యారంటే? నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాల్సిందే.

 ‘వందల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన మిమ్మల్ని ప్రభుత్వం ఏ అవార్డుతోనూ గుర్తించక పోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న కృష్ణకు ఎదురైంది. ఆయన నవ్వుతూ.. ‘‘ప్రభుత్వాలు నన్ను గుర్తించలేదని నేనెప్పుడూ బాధపడలేదు. ప్రజల గుర్తింపు అవార్డులకంటే పెద్దదని భావిస్తా. ప్రభుత్వాలు ఇవ్వకపోయినా ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌ అఛీవ్‌మెంట్‌ అందుకున్నా. ‘అంతంకాదిది’ సినిమాకిగాను ఉత్తమ నటుడిగా ఓ ప్రముఖ మ్యాగజైన్‌ నుంచి అవార్డు స్వీకరించా. ఓ సినీ పత్రిక నిర్వహించిన ‘సూపర్‌స్టార్‌’ బ్యాలెట్‌ పోటీలో వరుసగా ఐదు సంవత్సరాలు నాకు గౌరవం దక్కింది. అప్పటి నుంచే అంతా నన్ను సూపర్‌స్టార్‌ అని పిలవడం మొదలైంది’’ అని కృష్ణ వివరించారు. ఆ తర్వాత, 2009లో భారత ప్రభుత్వం ఆయనకు ‘పద్మ భూషణ్‌’ పురస్కారం అందించిన సంగతి తెలిసిందే.

కృష్ణ సినిమాల్లోకి రాకపోయుంటే..

కృష్ణ నటుడుకాకపోయుంటే.. ఇలాంటివి ఊహించుకోవడానికే తెలుగు ప్రేక్షకులు ఇష్టపడరేమో. అంతగా ప్రభావం చూపారాయన. ‘‘అక్కినేని నాగేశ్వరరావుని చూసి హీరోనికావాలనుకున్నా. చదువు పూర్తయిన వెంటనే నా కల నెరవేరింది. అందుకే నటుణ్నికాకపోయుంటే అనే ఆలోచనకు తావులేదు’’ అని కృష్ణ ఓ సందర్భంలో చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని