Telugu Movies: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

ఇటీవల కాలంలో హీరోతో సినిమా చేద్దామనుకున్న దర్శకులు.. మరొకరితో సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుకు అనుకున్న కథలనే ఈ హీరోలతో తీస్తున్నారా? అది వేరే కథ అసలు ఏ మార్పు ఎలా జరిగింది?

Published : 29 Nov 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేవని ఆగవు కొన్ని’ అన్నాడో సినీ కవి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. దర్శకుడు తన కథ, అందులోని పాత్రకు ఏ హీరో సరిపోతాడో ఎంచుకుని, అతడికి దాన్ని వినిపిస్తుంటారు. తొలిసారి కథ విన్న సమయంలో హీరో కూడా సానుకూలంగానే స్పందిస్తాడు. ఇంకేముంది... అధికారికంగా ప్రకటించడమే అంటూ సోషల్‌ మీడియా హోరెత్తిపోతుంది. వారం రోజులు అదే ట్రెండ్‌.. ఆ తర్వాత అదుగో పులి అంటే, ఇదిగో తోక అంటారు. ఆ తర్వాత ఎప్పటికో ఆ దర్శకుడు మరో హీరోతో సినిమా ప్రకటిస్తాడు. ఇలా నాలుగు ఆసక్తికర ప్రాజెక్టుల ఒక హీరో నుంచి మరో హీరోకు మారాయి. అయితే, అదే కథ, లేదా వేరే కథ అనేది కాలమే చెప్పాలి.


నెంబర్‌-1: ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ మూవీ

‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ కలిసి ఓ మూవీ చేస్తారని ఇండస్ట్రీలో టాక్‌ బాగా వినిపించింది. ‘ఆర్ఆర్‌ఆర్’ తర్వాత తారక్‌ చేసే చిత్రం అదేనంటూ వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌ చెప్పిన పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ జూనియర్‌కు బాగా నచ్చిందని అన్నారు. అంతే కాదండయ్‌, గురూజీ మార్కు టైటిల్‌ ‘అయినను పోయిరావలె హస్తినకు’ ట్రెండ్‌ అయింది. కానీ ఏమైందో ఏమో తెలియదు. మహేశ్‌తో సినిమా ఓకే అవ్వడం, అది పట్టాలెక్కడం జరిగిపోయింది.


నెంబర్‌-2: అల్లు అర్జున్‌ - కొరటాల

‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప’ మూవీ మొదలైంది. దీని తర్వాత బన్ని ఎవరి దర్శకత్వంలో నటిస్తారా? అని ఎదురు చూసిన అభిమానులకు కొరటాల శివతో మూవీ అనేసరికి మంచి బజ్‌ వచ్చింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌కు సామాజిక సమస్యను జోడించి తీర్చిదిద్దడంలో కొరటాల శివ మార్క్‌ సపరేట్‌. దీంతో బన్నికి మరో బ్లాక్‌ బస్టర్‌ ఖాయం అనుకున్నారు. ‘పుష్ప’ రెండు భాగాలు కావడం, మధ్యలో కొరటాల శివ ‘ఆచార్య’ తీయడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ‘పుష్ప1’ భారీ హిట్‌ కావడంతో అల్లు అర్జున్‌ దృష్టి అంతా ‘పుష్ప 2’పై పెట్టారు. దీంతో కొరటాల శివ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. అప్పటికే ఎన్టీఆర్‌ కోసం కొరటాల ఓ కథను సిద్ధం చేయగా, దాన్నే ఇప్పుడు నిర్మిస్తున్నారు.


నెంబర్‌-3: ఎన్టీఆర్‌తో అనుకుంటే చరణ్‌ వచ్చాడు

తొలి చిత్రం ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ వర్గాలనే కాదు, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు బుచ్చిబాబు సాన. ఈ చిత్రం విడుదలై దాదాపు 20 నెలలు అయినా, బుచ్చిబాబు తన తర్వాతి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఎన్టీఆర్‌ కోసం కథ సిద్ధం చేసుకుని కూర్చొన్నారని టాక్‌ వినిపించింది. క్రీడా నేపథ్యంలో సాగే కథలో ఎన్టీఆర్‌ పాత్ర పూర్తి మాస్‌గా ఉంటుందని అన్నారు. ‘పెద్ది’ అనేటైటిల్‌ కూడా వినిపించింది. సడెన్‌గా సోమవారం రామ్‌చరణ్‌తో మూవీ అని ప్రకటన చేశారు. ఇటీవల తన గురువు సుకుమార్‌ను అనేకమార్లు కలిశారు బుచ్చిబాబు. తన కొత్త చిత్రం కోసం సలహాలు సూచనలు తీసుకున్నారని టాక్‌ కూడా వినిపించింది. అయితే, అది ఎన్టీఆర్‌ కోసమే అనుకున్నారు. కానీ, రామ్‌చరణ్‌ చిత్రమని ఈ రోజు ప్రకటనతో స్పష్టత వచ్చింది. గతంలో సుకుమార్‌ ‘రంగస్థలం’తో చరణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చారు.


నెంబర్‌4: అల్లు అర్జున్‌ - బోయపాటి

‘సరైనోడు’తో ఊర మాస్‌ విజయాన్ని అందుకున్నారు అల్లు అర్జున్‌ - బోయపాటి శ్రీను. ‘పుష్ప’ చేస్తుండగానే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి ఉంది. అయితే, ‘పుష్ప 1’ విజయం ప్రభావం ఈ కాంబోపైనా పడింది. దీంతో ఆ మూవీ యువ కథానాయకుడు రామ్‌కు వెళ్లిపోయింది. అయితే, అదే కథ, వేరేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.


ఇలా ఇటీవల కాలంలో ఒకరి సినిమా చేద్దామనుకున్న దర్శకులు.. మరొకరితో సినిమా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుకు అనుకున్న కథలనే ఈ హీరోలతో తీస్తున్నారా? అది వేరే కథ. అనేది కాలమే సమాధానం చెబుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు