tauktae: టైగర్‌, మైదాన్‌ సెట్లను నాశనం చేసిన తుపాను

ఓ పక్క కరోనా చిత్రసీమను అతలాకుతలం చేస్తుంటే మరోపక్క తౌక్టే తుపాను కూడా చిత్రసీమను కష్టాల్లోకి నెట్టేసింది. వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, గాలులతో ముంబయి నగరం అతలాకుతలం అయ్యింది. ఈ

Updated : 21 May 2021 15:32 IST

ఓ పక్క కరోనా చిత్రసీమను అతలాకుతలం చేస్తుంటే మరోపక్క తౌక్టే తుపాను కూడా చిత్రసీమను కష్టాల్లోకి నెట్టేసింది. వరసగా కురుస్తున్న భారీ వర్షాలు, గాలులతో ముంబయి నగరం అతలాకుతలం అయ్యింది. ఈ ప్రభావం బాలీవుడ్‌పై ఎక్కువగానే కనిపిస్తుంది. పలు భారీ చిత్రాలకు నష్టాలు మిగులుస్తోంది తౌక్టే తుపాను. పలు సినిమాల కోసం ఇప్పటికే భారీ సెట్లు వేశారు. కరోనా కారణంగా చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో సెట్లు పాడవుతున్నాయి.

తాజాగా ‘మైదాన్‌’ చిత్రం కోసం వేసిన సెట్‌ పూర్తిగా నాశనం అయ్యింది. అజయ్‌దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబయి శివార్లలో ఈ ప్రత్యేక సెట్‌ను తీర్చిదిద్దారు. తౌక్టే తుపాను తీవ్రతకు సెట్‌ పూర్తిగా దెబ్బతింది. ఈ చిత్రానికి ఇలాంటి నష్టం జరగడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ప్రత్యేకంగా సెట్‌ను వేశాను. కొవిడ్‌ తీవ్రంగా ఉండటంతో షూటింగులు ఆగిపోయాయి. వర్షాలకు సెట్‌ పాడయ్యే అవకాశం ఉండటంతో సెట్‌ను కూల్చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి మళ్లీ సెట్‌ను నిర్మించారు. కానీ రెండో దశ కరోనా ప్రభావంతో ఇప్పుడు కూడా షూటింగ్‌ పూర్తి కాలేదు. ఇంతలోనే తౌక్టే దెబ్బకు ఆ సెట్‌ పాడైపోయింది. ఫుట్‌బాల్‌ నేపథ్యంగా సాగే ఈ చిత్రానికి అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దీనిపై బోనీ కపూర్‌ స్పందిస్తూ ‘‘మైదాన్‌’ కోసం భారీ ఫుట్‌బాల్‌ స్టేడియం సెట్‌ను తీర్చిదిద్దాం. చివరి షెడ్యూల్లో భాగంగా ఇందులో 8 మ్యాచ్‌లను తెరకెక్కించాలనుకున్నాం. నాలుగు మ్యాచ్‌ల చిత్రీకరణ పూర్తయింది. ఇంతలోనే కరోనా రెండోదశ ప్రభావంతో అంతా ఆగిపోయింది. ఇప్పుడు తౌక్టే తుపాను దెబ్బకు సెట్‌ నాశనం అయ్యింది’’అని చెప్పారు.

టైగర్‌...బ్రహ్మాస్తకు నష్టమే: సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. ఈ సినిమా కోసం ముంబయిలో దుబాయి మార్కెట్‌ సెట్‌ను తీర్చిదిద్దారు. ఈ సెట్‌ కూడా పాక్షికంగా దెబ్బతింది. దీంతో పాటు అలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా కోసం వేసిన సెట్‌ కూడా పాడయ్యింది. ఈ విషయం గురించి ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఎంప్లాయిస్‌ అధ్యక్షుడు బిజేంద్రనాథ్‌ తివారీ మాట్లాడుతూ ‘‘తౌక్టే దెబ్బకు సెట్లు దెబ్బతిన్నాయి. కానీ అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు’’అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చిత్ర నిర్మాణ సంస్థలు తమ చిత్రాల కోసం వేసిన సెట్లను వచ్చే వర్షాకాలం నుంచి రక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ‘గంగూబాయి కతియావాడి’ సెట్‌కు ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు చేశారు చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ. అలియాభట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా కరోనా ప్రభావంతో ఆగిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని