Hunt Review: రివ్యూ: హంట్
సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్ కలిసి నటించిన యాక్షన్ చిత్రం ‘హంట్’. గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
Hunt Review చిత్రం: హంట్; నటీనటులు: సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్, కబీర్ సింగ్, చిత్రా శుక్ల, మైమ్ గోపీ, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, రవి వర్మ తదితరులు; యాక్షన్: రేనాడ్, బ్రయాన్ విజియర్; సంగీతం: జిబ్రాన్; ఛాయాగ్రహణం: అరుళ్ విన్సెంట్; దర్శకత్వం: మహేష్; నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్; విడుదల తేదీ: 26-01-2023.
జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో సినీ ప్రియుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు (Sudheer Babu). కానీ, కొన్నాళ్లుగా ఆయన కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు సరిగ్గా సరిపోయే ఓ యాక్షన్ కథను ఎంచుకొని ‘హంట్’తో ప్రేక్షకుల ముందుకొచ్చారాయన. మహేష్ తెరకెక్కించిన చిత్రమిది. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ వంటి వారు కీలక పాత్రలు పోషించడం.. ప్రచార చిత్రాలు సరికొత్త యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆసక్తికరంగా ఉండటంతో సినీ అభిమానుల దృష్టి ‘హంట్’పై పడింది. మరి, ఈ సినిమా కథేంటి? అది ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించింది? తెలుసుకుందాం పదండి (Hunt Review)..
కథేంటంటే: అర్జున్ అలియాస్ అర్జున్ ప్రసాద్ (సుధీర్‌బాబు) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. సైబరాబాద్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తుంటారు. ఓ రోడ్డు ప్రమాదం వల్ల గతం మర్చిపోతాడు. ఆ ప్రమాదం జరగడానికి ముందు తన మిత్రుడు, తోటి ఐపీఎస్ ఆఫీసర్ ఆర్యన్ దేవ్ (భరత్) హత్య కేసును డీల్ చేస్తాడు. ఆ హత్యకు కారకులైన వారిని కనిపెట్టినట్టు పోలీస్ కమిషనర్ మోహన్ భార్గవ్ (శ్రీకాంత్)కు ఫోన్లో చెబుతుండగానే ప్రమాదానికి గురవుతాడు. కానీ, ఆ తర్వాత గతం మర్చిపోవడంతో ఆ కేసును మళ్లీ కొత్తగా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అసలు తనెవరో తనకే తెలియని అర్జున్.. తన గత జీవితం గురించి తెలుసుకుంటూ మరోవైపు ఆర్యన్ హత్య కేసును ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అసలు అర్జున్ గతమేంటి? అతనికి, ఆర్యన్‌కు మధ్య ఉన్న స్నేహ బంధం ఎలాంటిది? ఆర్యన్ దేవ్ హత్య కేసుకు క్రిమినల్ రాయ్ (మైమ్ గోపీ), కల్నల్ విక్రమ్ (కబీర్ సింగ్), టెర్రరిస్ట్ గ్రూప్ హర్కతుల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఆర్యన్‌ను చంపిన వాళ్లను అర్జున్ ఎలా కనిపెట్టాడు? ఆఖర్లో ఆయన ఇచ్చిన షాక్ ఏంటి? అన్నవి తెరపై చూసి తెలుసుకోవాలి (Hunt Review).
ఎలా సాగిందంటే: ప్రచార కార్యక్రమాల్లో సుధీర్ ఈ సినిమాని ఓ సాహసోపేతమైన ప్రయత్నంగా అభివర్ణించారు. ఆయనెందుకు ఆ మాట అన్నారన్నది క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. నిజంగా తను ఇలాంటి పాత్రను అంగీకరించినందుకు ఆయన్ను మెచ్చుకుని తీరాల్సిందే. కానీ, తనేదైతే క్లైమాక్స్ ట్విస్ట్‌ను నమ్మి ఈ సినిమా కోసం రంగంలోకి దిగారో.. దానికి సరైన ఫలితం దక్కలేదనిపిస్తుంది. దీనికి దర్శకుడు ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దుకోకపోవడమే కారణం. మలయాళంలో విజయవంతమైన ‘ముంబయి పోలీస్’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. గతం మర్చిపోయిన ఓ పోలీస్ అధికారి.. తన గతాన్ని తెలుసుకుంటూ ఓ కీలక హత్య కేసును ఎలా ఛేదించాడన్నదే క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. దర్శకుడు సినిమాని ఆరంభించిన తీరు.. చకచకా కథలోకి తీసుకెళ్లిన విధానం చూస్తే ప్రేక్షకులకు కచ్చితంగా ఓ అదిరిపోయే థ్రిల్లర్ చూడబోతున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఆర్యన్ హత్య కేసును ఛేదించినట్టు మోహన్‌కు అర్జున్ ఫోన్లో చెప్పడం.. అంతలోనే అతని కారు ప్రమాదానికి గురవ్వడం.. కట్ చేస్తే తను గతం మర్చిపోవడం.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఓ ముఠా అతనిపై ఎటాక్ చేయడం.. ఇలా ప్రతి ఎపిసోడ్ ఆసక్తిరేకెత్తించేలా సాగిపోతుంది (Hunt Review).
కానీ, ఆ తర్వాత నుంచి కథలో వేగం తగ్గుతుంది. అర్జున్ గతం.. ఆర్యన్, మోహన్‌లతో అతని స్నేహ బంధం ఏమాత్రం ఆసక్తికరంగా అనిపించవు. ఆర్యన్ హత్యకు గురయ్యాక.. హంతకుడ్ని కనిపెట్టేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు ఏమాత్రం మెప్పించవు. ఈ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తుల బ్యాక్‌స్టోరీలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. అసలు థ్రిల్లర్ కథల్లో కనిపించాల్సిన ఆసక్తికరమైన చిక్కుముడులు, అనూహ్యమైన మలుపులు ఇందులో మచ్చుకైనా కనిపించవు. విరామ సన్నివేశాలు పూర్తిగా నిరుత్సాహపరుస్తాయి. ద్వితియార్థంలో హంతకుడెవరన్న విషయంలో సస్పెన్స్ రివీలవ్వడం మొదలయ్యాకే కథలో కాస్త స్పీడ్ పెరుగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో అర్జున్ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంది. ఆర్యన్ పాత్రను చంపడానికి గల కారణాన్ని దర్శకుడు బలంగా రాసుకోలేకపోయారు. ఆయన సినిమాని ముగించే విషయంలోనూ కంగారు పడినట్టు అర్థమవుతుంది. పతాక సన్నివేశాలు పూర్తిగా తేలిపోయాయి.
ఎవరెలా చేశారంటే: అర్జున్ పాత్రలో సుధీర్‌బాబు చక్కగా ఒదిగిపోయారు. గతం మర్చిపోవడానికి ముందు.. ఆ తర్వాత తన పాత్రలో కనిపించే మార్పుల్ని అద్భుతంగా చూపించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన అందర్నీ కట్టిపడేస్తుంది. శ్రీకాంత్, భరత్‌లవి కథలో కీలక పాత్రలే అయినప్పటికీ.. వాళ్లకు నటించే ఆస్కారం అంతగా లభించలేదు. మైమ్ గోపీ, కబీర్ సింగ్, రవివర్మ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు మహేష్ మాతృకను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, అందులోని థ్రిల్‌ను, ఫీల్‌ను తెరపైకి తీసుకురావడంలో విఫలయమ్యారు. కథలో విషయం ఉన్నా.. దాన్ని రసవత్తరంగా నడిపించడంలో పూర్తిగా తడబడ్డారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఏమాత్రం మెప్పించదు. యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన విధానం కొత్తగా ఉన్నా.. అవి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అరుళ్ విన్సెంట్ ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు: + కథా నేపథ్యం; + సుధీర్‌బాబు నటన; + పోరాట ఘట్టాలు
బలహీనతలు: -పేలవమైన స్క్రీన్‌ప్లే; - ప్రథమార్థం
చివరిగా: సుధీర్ ‘హంట్’ ఫలించలే!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
-
Crime News
Vizag: విశాఖ జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలుడి మృతి
-
Ap-top-news News
Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు