Akash Puri: నాన్నా.. అప్పుడే మీతో సినిమా చేస్తా : ఆకాశ్‌ పూరి

స్టార్‌ డైరెక్టర్‌ కొడుకైనా సొంతంగానే హీరో కావాలనే ప్రయత్నం..టాలెంట్‌తో  తప్పా సిఫారసులు,, సొంత బ్యానర్లు వద్దనుకునే నైజం..చిన్నప్పటి నుంచే నటిస్తూ సొంత బాణీని ఏర్పర్చుకున్నాడు. 

Published : 16 Jun 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెప్క్‌: స్టార్‌ డైరెక్టర్‌ కొడుకైనా సొంతంగానే హీరో కావాలనే ప్రయత్నం.. టాలెంట్‌తో తప్ప సిఫారసులు, సొంత బ్యానర్లు వద్దనుకునే నైజం.. చిన్నప్పటి నుంచే నటిస్తూ సొంత బాణీని ఏర్పర్చుకున్నాడు. అతనే ఆకాశ్‌ పూరి. ఇప్పటికే ఒక హిట్‌ ఇచ్చి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఆకాశ్‌ ఈటీవీలో ఆలీతో సరదా కార్యక్రమానికి వచ్చారు. ఎన్నో విశేషాలను పంచుకున్నారు.

పండు అని ఎవరు ఎక్కువగా వాడుతుంటారు..?

ఆకాశ్: డాడీ ఎక్కువగా మాట్లాడుతుంటారు. అమ్మని అలా పిలుస్తారు. 

నీ మొదటి రెమ్యూనరేషన్‌ ఎంత..? ఏం చేశావు..?

ఆకాశ్: నాకు ప్రకాశ్‌రాజ్‌గారు రూ.లక్ష ఇచ్చారు. నాన్న.. ఈ డబ్బు ఏం చేయాలని అడిగా. ఒక పని చేయి..రూ.50వేలు నానమ్మకు, రూ.50 వేలు అమ్మమ్మకు ఇవ్వు అన్నారు. అలాగే ఇద్దరిని కూర్చొబెట్టి ఇచ్చా.

‘చోర్‌ బజారు.. హీరోగా ఎన్నో సినిమా..?

ఆకాశ్: ఇది నా మూడో సినిమా. చాలా కష్టపడి చేశాను.

మీ నాన్న అమితాబ్‌ ఫ్యాన్‌.. ఈ సినిమాలో బచ్చన్‌ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది...?

ఆకాశ్: ఈ సినిమా గురించి జీవన్‌ వచ్చి కథ చెప్పి.. క్యారెక్టర్‌ పేరు బచ్చన్‌ సాబ్‌ అన్నారు. చాలా బాగా అనిపించింది. వాడికో బచ్చన్‌సాబ్‌ అని టాటూ ఉంటుంది. పెద్దాయన పేరు పెట్టుకోవడంతో ఎవరైనా సాబ్‌ అని పిలవాల్సిందే.

నీ పక్కన ఓ పెద్దావిడ నటించారు..? ఎవరో తెలుసా.?

ఆకాశ్: అర్చనగారు. అమ్మ ఒకసారి ‘నిరీక్షణ’ చూడమని చెప్పింది. ఆ సినిమా చూసిన తర్వాత మాటల్లేవ్‌. అర్చన గారు పదే పదే అనే వారు.. మీ అమ్మకు నాకు చాలా పోలికలుంటాయని.. అమ్మ కూడా ఆవిడ నేను ఒకేలా ఉంటామని చాలా మంది అనే వారని చెప్పింది.

నువ్వు పుట్టక ముందే నాన్న డైరెక్టర్‌ అయ్యారు కదా.. నాన్న మొదటి సినిమా గుర్తుందా..?

ఆకాశ్: బద్రి. దానికన్నా ముందు రెండు సినిమాలు మొదలై ఆగిపోయాయి. 

మీ చెల్లెలు, నువ్వు బుజ్జిగాడు సినిమాలో లవర్స్‌గా చేసిన తర్వాత మీ స్నేహితుల స్పందన ఎలా ఉంది..?

ఆకాశ్: పాఠశాలలో అందరూ కామెడీ చేసి నవ్వారు. డాడీ.. ఈ సినిమా చేయనని చెప్పా. పవిత్ర బాగోదని చెప్పా. పెద్దాయ్యాక నువ్వు నీ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటావురా అన్నారు. ఇది యాక్టింగ్‌.. చేయి అన్నారు. ముందు చిరుత చేశా. ఆ తర్వాత బుజ్జిగాడు సినిమా చేశాను.

చిరుత సినిమా చూస్తూ అమ్మ ఎమోషనల్‌గా బయటకు వచ్చేశారట.. ఎందుకు?

ఆకాశ్: ఆ రోజు మదర్స్‌ డే. నీ కొడుకును తీసుకొని ఆఫీసుకు రా అని అమ్మకు చెప్పారు. ఆ సినిమాలో జైల్లో గిన్నె పట్టుకొని వెళ్తుంటే లాగేయడం, అన్నం తినకుండా కొట్టేయడం చూసి తట్టుకోలేకపోయింది. బాగా ఏడ్చేసింది. ఆ సీన్‌ చూసి అశ్వనీదత్‌గారు కూడా హగ్‌ చేసుకున్నారు. 

స్టార్‌ డైరెక్టర్‌ కొడుకుగా ఉండి జిమ్‌లో క్లీనింగ్‌ చేయడానికి వెళ్లావా..?

ఆకాశ్: పదో తరగతి అయిపోయింది. చదువు ఆపేశా. ఇక నేను చదవను అని నాన్నతో చెప్పాను. అసిస్టెంట్‌ డైరెక్టరో, హీరోనో అవుతా అని చెప్పా. టెన్త్‌కే ఎంబీబీఎస్‌ చేసిన ఫీలింగ్‌ వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉన్నానని గమనించి.. నాన్న ఓ రోజు ఫోన్‌ చేసి నీకు పార్ట్‌టైం జాబ్‌ చూశా.. వెళ్లు అన్నారు. ఓకే అన్నా. మేనేజరు జిమ్‌కు తీసుకెళ్లి వదిలారు. జిమ్‌ అతను ఎందుకు పని చేయాలనుకుంటున్నావని అడిగితే.. ఫైనాన్షియల్‌ ప్రాబ్లం అని చెప్పా. బెంజికారు, ఐఫోన్‌ వాడుతున్నానని జిమ్‌ యజమానికి అనుమానం వచ్చింది. పక్కనున్న వాళ్లు పూరి అబ్బాయని చెప్పడంతో పనిలో పెట్టుకోలేదు. నాన్నకు ఫోన్‌ చేసి.. ‘నేను పని చేస్తానన్నా నన్ను చేయనీయడం లేదు’ అని చెప్పాను. రెండ్రోజుల్లో మరో జాబ్‌ చూస్తాలే అని ఆయన ఫోన్‌ పెట్టేశారు.

ఒకరోజు ప్రొడక్షన్‌ బాయ్‌గా కూడా పని చేశావట..?

ఆకాశ్: నేనింతే సినిమాకు ప్రొడక్షన్‌ బాయ్‌గా చేయాలని డాడీ చెప్పారు. కారావ్యాన్‌లోకి కూడా రావొద్దన్నారు. రవితేజకు టీ ఇస్తే.. ఏరా బాబూ నువ్వు టీలు ఇస్తావేంటీ అంటూ ఒళ్లో కూర్చొబెట్టుకున్నారు. డాడీ మళ్లీ పనికి పంపించారు. అలా ఒకరోజు ప్రొడక్షన్‌ బాయ్‌గా పని చేశా. అమ్మ పెంపకం కావడంతో నాకు గర్వం తలకెక్కలేదు. హ్యాపీగా పని చేశా. ఇక పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నా.

ఒక సీన్‌ తయారు చేసుకొని నాన్న పొద్దున లేవగానే మంచం దగ్గరకు వెళ్లి డైలాగులు చెప్పావట..? ఏ సినిమా డైలాగులు అవి..?

ఆకాశ్: అవును. ఇంద్ర, చాలా సినిమాల డైలాగులు చెప్పేశా.  డాడీని ఒక వయస్సులో బాగా రిక్వెస్టు చేశా. రెండేళ్లు సైడ్‌ యాక్టర్‌గా పెట్టాలని గొడవ చేశా. ఆంధ్రావాలాలో క్యారెక్టర్‌ ఫిక్స్‌ అయ్యింది. సడన్‌గా ఫోన్‌ చేసి నువ్వు చేయడం లేదని చెప్పారు. బాగా ఏడ్చా. తట్టుకోలేక పోయా. నన్ను ఎందుకు చేయనీయడం లేదు. నన్ను తొక్కేస్తున్నారని గొడవ పెట్టుకున్నా. ఆ సినిమా పోయినా చిరుతలో నటించడం గొప్ప అనుభూతి.

చెల్లి పవిత్ర ఏం చేస్తోంది?

ఆకాశ్: ఎంబీఏ అయిపోయింది. ఈవెంట్‌ మేనేజ్‌మెంటు లాంటివి ప్లాన్‌ చేస్తోంది. కొద్ది రోజుల్లో నిర్మాతగా అడుగు పెట్టాలనే ఆలోచన ఉంది.

ఇంట్లో నాన్న నీతో ఫ్రెండ్‌లా ఉంటారా..? స్ట్రిక్టుగా ఉంటారా..?

ఆకాశ్: స్ట్రిక్ట్‌గా ఎప్పుడూ లేరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకెందుకో డాడీ అంటే చిన్నప్పటి నుంచి భయం.

ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఓ అమ్మాయి నచ్చిందని చెప్పావటా..?

ఆకాశ్: ఏదో తెలిసీ తెలియని తనం.. ఆ అమ్మాయి బాగా నచ్చింది. అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మాయి నచ్చింది.. లవ్‌ చేస్తున్నా అని చెప్పా. అమ్మ గంట సేపు క్లాస్‌ పీకింది.

చోర్ బజార్‌ కథ విన్నప్పుడు నీ ఫీలింగ్‌ ఏంటి..?

ఆకాశ్: ఈ సినిమాలో ఏదో మ్యాజిక్‌ ఉంది. జీవన్‌రెడ్డి ఏదో చేశారు. ప్రతి సీన్‌ బాగుంటుంది. ముంబయి హీరోయిన్ నటించింది. ఈ కథను ఐదు గంటలు వినిపించినా ఎక్కడా బోర్‌ కొట్టలేదు. జార్జిరెడ్డి సినిమా చూసిన తర్వాత జీవన్‌రెడ్డిపై నమ్మకం వచ్చింది.

ఇప్పుడున్న హీరోలలో ఎవరితో క్లోజ్‌గా ఉంటావు..?

ఆకాశ్: రాహుల్‌, విజయ్‌ బాగా సన్నిహితం, రోషన్‌ను తరచూ కలుస్తుంటా. ప్రభాస్‌తో సరదాగా మాట్లాడుతుంటా.

సెవన్త్‌ క్లాస్‌ అన్ని సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యావట కదా..? అమ్మ స్కూల్‌కు వచ్చిందట కదా..?

ఆకాశ్: అది మరచిపోలేని ఘటన. పరీక్షలు బాగా రాశా. 50శాతం మార్కులు వస్తాయని ఫ్రెండ్స్‌తో అన్నాను. అలా వస్తే రికార్డే. కానీ ఫలితాలు వచ్చే రోజు చూస్తే వందకు ఏడు మార్కులు వచ్చాయి. మూడు అడిషనల్స్‌ తీసుకుంటే ఇలా ఎలా వచ్చాయి. అమ్మ పాఠశాలకు వచ్చింది. నానా హంగామా. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకు ఫోన్‌ చేసి నా గురించి చెప్పింది. ఫెయిల్‌ అయ్యావా..? ఒక్క సబ్జెక్టూ పాస్‌ కాలేదా..? సర్లే అని డాడీ ఫోన్‌ పెట్టేశారు. అప్పుడు ఆయన తిట్టలేదు. దాంతో కసిగా మళ్లీ బాగా రాశా. మంచి మార్కులు వచ్చాయి.

నువ్వు ఎక్కువగా నమ్మేది కథనా, డైరెక్టర్‌నా? సినిమా మీదున్న ప్యాషనా..?

ఆకాశ్: కథ విన్నపుడు ప్రేక్షకుడిగానే వింటా. థియేటర్‌కు వెళ్లి  సినిమా చూస్తే నచ్చుతుందా..? లేదా,.? పరిశీలిస్తా. చెప్పిన కథను డైరెక్టర్‌ ఎలా తీస్తారనేది చాలా ముఖ్యం. కథ, డైరెక్టర్‌నే నమ్ముతా.

ఒక పెద్ద హీరో రోజంతా నీకు రకరకాల హెయిర్‌స్టయిల్స్‌ చేశారట.. ఎవరతను..?

ఆకాశ్: రామ్‌చరణ్‌. చిరుత సినిమా అప్పుడు ఆయన పక్కన కూర్చున్నా. పెద్ద ఫైటింగ్‌ సీన్‌లో బ్రేక్‌ ఇచ్చారు. హెయిర్‌ స్టయిలిస్టు ఆయన జుట్టును సరి చేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి జెల్‌ అంటే ఫాంటసీ. అన్నయ్య నాకు కొంచెం జెల్‌ ఇస్తారా అని అడిగా. నన్ను దగ్గరకు తీసుకొని రకరకాల హెయిర్‌స్టయిల్స్‌ చేయించారు.

ఒకరోజు నువ్వూ పవిత్ర బీచ్‌ దగ్గర ఆడుకుంటుంటే అల వచ్చి పవిత్రను లాక్కెళ్లిందట..? ఎక్కడది వైజాగ్‌లోనా..?

ఆకాశ్: అదో పెద్ద హీరోయిక్‌ మూమెంట్‌ నాకు.. ఆల్‌ మోస్ట్ పవిత్ర లేదనుకున్నా. పెద్ద అల వచ్చింది.. లాక్కొని వెళ్తోంది.. జంప్‌ చేసి వెళ్లి పట్టుకొని లాక్కొని వచ్చాను. నాకు ఈత బాగా వచ్చు. పవిత్రను ఒడ్డుకు తీసుకొని వచ్చిన తర్వాత ఏడ్చేస్తున్నా. చాలా ఎమోషన్‌కు గురయ్యా. పవిత్ర, నేనూ చిన్నతనం నుంచి కొట్టుకునే వాళ్లం.. తిట్టుకునే వాళ్లం.. ఆ రోజు అనుకున్న రక్త సంబంధం అంటే ఇదే కాబోలని...!

పూరి జగన్నాథ్‌ కాకుండా నీకు నచ్చిన డైరెక్టర్‌ ఎవరు?

ఆకాశ్: రాజమౌళి బాగా ఇష్టం. త్రివిక్రమ్‌, వి.వి.వినాయక్‌ కూడా ఇష్టం. వాళ్ల సినిమాలు నాపై బాగా ప్రభావం చూపించాయి. 

గబ్బర్‌ సింగ్‌ సినిమా సమయంలో హరీశ్‌ శంకర్‌ ఎందుకు తిట్టారు..?

ఆకాశ్: ట్రాక్టర్‌ మీదెక్కి ‘ఇవాళ మీరు పెద్దోళ్లు.. నేను చిన్నవాడిని. పెద్దయ్యాక నేను పారిపోను.. పరిగెత్తిస్తా..’ డైలాగ్‌ గట్టిగా చెప్పాలి. నేను నార్మల్‌గా చెబుతున్నా.. ‘ఏంట్రా సరిగా అరవడం రాదా..?’ అంటూ కోప్పడ్డారు. కోపంతో గట్టిగా అరిచా.. అది కావాలి నాకు అంటూ వెళ్లిపోయారు. ఏ డైలాగ్‌ను ఎంత ఎమోషన్‌లో చెప్పాలో దాంతో అర్థమయ్యింది. ఆ రోజు తిట్టడంతో నాకు సాయపడింది. పవన్‌ కల్యాణ్‌ గారిని ఎలా నటించానో అడగాలనుకున్నా కానీ కుదరలేదు. ఆ పాత్రలో నటించడంతో చాలా మంచి పేరు వచ్చింది. 

అరేయ్‌ ‘నీతో సినిమా చేస్తున్నా ఓకేనా’ అంటే మీ నాన్నకు నో చెప్పావట..?

ఆకాశ్: మొదటి కొవిడ్‌ లాక్‌డౌన్‌ తర్వాత అనుకుంటా.. రొమాంటిక్‌ సినిమా అయిపోయింది. లాక్‌డౌన్‌ ఎత్తేస్తే సినిమా విడుదల చేస్తామనుకుంటున్నాం. ‘వచ్చే నెలలో నీతో సినిమా చేద్దామనుకుంటున్నా’ అని నాన్న అంటే, ‘వద్దు నాన్న. బయట అందరూ పూరి కొడుకు అంటున్నారు. అది పోయాక నీతో సినిమా చేస్తా’ అని చెప్పా. అలా అనుకున్నపుడే ‘చోర్‌ బజార్‌’ వచ్చింది. నేను సొంతంగా సక్సెస్‌ కావాలి. ఆ తర్వాతే ఆయనతో సినిమా చేస్తా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని