
Pushpa: పుష్ప.. పుష్పరాజ్.. ‘మాస్క్ తీసేదేలే’..!
అల్లు అర్జున్ ‘పుష్ప’ మీమ్ షేర్ చేసిన సమాచార మంత్రిత్వ శాఖ
ఇంటర్నెట్‌డెస్క్: ట్రాఫిక్ ఉల్లంఘనలు, కొవిడ్ నిబంధనలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మధ్య అధికారులు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. సినిమాల్లో పాపులర్ డైలాగ్‌లతో మీమ్స్‌ను రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) బ్లాక్ బస్టర్ ‘పుష్ప (Pushpa: The Rise)’ సినిమాను ఎంచుకుంది. ఇందులోని ఫేమస్ ‘తగ్గేదేలే’ డైలాగ్‌తో ఓ మీమ్‌ను క్రియేట్ చేసింది.
కరోనా వైరస్‌పై తాజా సమాచారాన్ని అందించేందుకు '#IndiaFightsCorona @COVIDNewsByMIB' పేరుతో సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఓ ట్విటర్ పేజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ట్విటర్ ఖాతాలో నేడు ఓ మీమ్‌ను పోస్ట్ చేశారు. ‘పుష్ప (Pushpa: The Rise)’ సినిమాలో అల్లు అర్జున్ తగ్గేదేలే డైలాగ్ చెప్పే స్టిల్‌ను ఎడిట్ చేసి నటుడికి మాస్క్ పెట్టారు. ఈ ఫొటోపై అదే సినిమాలోని పాపులర్ డైలాగ్ అయిన ‘‘పుష్ప.. పుష్ప రాజ్ (PushpaRaj).. తగ్గేదేలే’’ ను కాస్త మార్చి.. ‘‘డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలే’’ అని రాశారు.
‘‘పుష్ప.. పుష్పరాజ్.. ఎవరైనా..! కొవిడ్‌పై మన పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నాలుగు విషయాలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. తరచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి’’ అని ఈ పోస్ట్‌కు జత చేశారు. ‘పుష్ప’ సినిమా నటీనటులు అల్లుఅర్జున్ (Allu Arjun), రష్మిక మందాన (Rashmika Mandanna)ను ఈ ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.