రజనీకాంత్‌కు ‘సన్నాఫ్‌ ఇండియా’ కథ చెప్పా.. అలా చేసి ఉంటే హిట్‌ అయ్యేది: డైమండ్‌ రత్నబాబు

‘సన్నాఫ్‌ ఇండియా’ (Son Of India) సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రత్నబాబు (Ratna babu). అవకాశం వస్తే రీమేక్‌ చేస్తానని చెప్పారు.

Published : 05 Jun 2023 21:16 IST

హైదరాబాద్‌:  తాను దర్శకత్వం వహించిన చిత్రం ‘సన్నాఫ్‌ ఇండియా’ (Son Of India) పరాజయంపై స్పందించారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు (Diamond Ratnababu). ఎక్కువమంది ఆర్టిస్టులతో కమర్షియల్‌గా ఆ చిత్రాన్ని తెరకెక్కించి ఉంటే తప్పకుండా మంచి విజయాన్ని అందుకునేదని ఆయన అన్నారు. అంతేకాకుండా గతంలో తాను ఈ కథను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చెప్పానని తెలిపారు. ‘అన్‌స్టాపబుల్‌’ (unstoppable) ప్రమోషన్‌లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన్ను ఓ విలేకరి.. ‘‘సన్నాఫ్‌ ఇండియా’ కథను మీరు రజనీకాంత్‌కు చెప్పారట కదా?’ అని ప్రశ్నించారు.

దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘మోహన్‌బాబు గారి వల్లే రజనీకాంత్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. అప్పట్లో ఆయనకు ‘సన్నాఫ్‌ ఇండియా’ కథను చెప్పాను. కథ బాగుందన్నారు. అయితే, నేను చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు అంగీకరించలేదు. దాదాపు 500 మంది నటీనటులు, జూనియర్‌ ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని భారీగా తీసి ఉంటే మరోలా ఉండేది. భవిష్యత్తులో అవకాశం వస్తే దీన్ని రీమేక్‌ చేయాలనే ఆలోచన నాకు ఉంది’’ అని రత్నబాబు తెలిపారు.

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘సన్నాఫ్‌ ఇండియా’ గతేడాది విడుదలై పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత రత్నబాబు.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సన్నీ, నటుడు సప్తగిరిలతో ‘అన్‌స్టాపబుల్‌’ను తెరకెక్కించారు. పూర్తిస్థాయి కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని