Samantha: చేయని నేరానికి నేనెందుకు ఇంట్లో కూర్చోవాలి.. విడాకులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

నటుడు నాగచైతన్యతో వైవాహిక బంధానికి స్వస్తి పలకడంపై నటి సమంత (Samantha) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేయని నేరానికి ఇంట్లో కూర్చోని బాధ పడటం తనకు నచ్చదని అన్నారు.

Updated : 29 Mar 2023 14:10 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక సమంత (Samantha) తన విడాకులపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయతీగా ఉన్నానని, కాకపోతే అది వర్కౌట్‌ కాలేదని అన్నారు. ఈ మేరకు ‘శాకుంతలం’ (Shaakuntalam) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితంపై ఎన్నో విషయాలను బయటపెట్టారు. ఇందులో భాగంగా ‘పుష్ప’ (Pushpa)లో ఐటెమ్‌ సాంగ్‌ చేయడంపైనా స్పందించారు.

ఐటెమ్‌ సాంగ్‌ చేయొద్దన్నారు..!

‘‘వైవాహిక బంధానికి స్వస్తి పలికిన కొంతకాలానికే నాకు ‘పుష్ప’లో ‘ఊ అంటావా’ ఆఫర్‌ వచ్చింది. నేనే తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించింది. వెంటనే దాన్ని ఓకే చేసేశాను. ఆ పాటను అనౌన్స్‌ చేసినప్పుడు కుటుంబసభ్యులు, తెలిసినవాళ్లు ఫోన్లు చేసి.. ‘‘ఇంట్లో కూర్చో చాలు. విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్‌ సాంగ్స్‌ చేయడం బాగోదు’’ అని సలహాలు ఇచ్చారు. నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దనే అన్నారు. కానీ నేను దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే.. వైవాహిక బంధంలో నేను 100శాతం నిజాయతీగా ఉన్నాను. కాకపోతే అది వర్కౌట్‌ కాలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని, ఎందుకు బాధపడాలి?’’

ఏ నటికి రాకూడని పరిస్థితి..!

‘‘నేను ఇప్పటికే ఎన్నో బాధలుపడ్డాను. నటిగా ప్రతి విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నాను. మయోసైటిస్‌, మెడికేషన్‌ కారణంగా నాపై నాకే కంట్రోల్‌ లేకుండా పోయింది. దానివల్ల ఒక్కోసారి నేను నీరసంగా కనిపించవచ్చు, ఒక్కోసారి బొద్దుగా కనిపించవచ్చు. నేను స్టైల్‌ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చు. కాకపోతే అది నిజం కాదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురిని నా కళ్లు తట్టుకోలేవు.  ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదు. ఎందుకంటే కళ్లతోనే నటీమణులు పలు భావాలు పలికించాలి. గడిచిన ఎనిమిది నెలలుగా ప్రతి రోజూ నేను పోరాటం చేస్తూనే ఉన్నాను. బాధను అనుభవిస్తూనే ఉన్నాను. అన్నింటినీ దాటుకుని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి, ఇప్పుడు ఎవరైనా సరే నా లుక్స్‌ గురించి కామెంట్స్‌ చేసినా నేను పెద్దగా పట్టించుకోను’’ అని సమంత (Samantha) వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని