Sudheer Babu: నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదు!

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు.

Updated : 14 Jun 2024 08:53 IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నారు కథానాయకుడు సుధీర్‌బాబు. ఇప్పుడీ క్రమంలోనే ‘హరోం హర’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సుధీర్‌బాబు(Sudheer Babu). 

ప్రేమకథ చెప్తాడనుకుంటే ఇలా షాకిచ్చాడు..

‘‘జ్ఞానసాగర్‌ తొలిసారి నన్ను కలిసినప్పుడు నాకేదైనా ప్రేమకథ వినిపిస్తాడేమో అనుకున్నా. కానీ, ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ కథ వినిపించాక చిన్న షాక్‌కు గురయ్యా’’.

కుప్పం జేమ్స్‌ బాండ్‌ కథ..

‘‘ఇది 1980ల నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథగా ఉంటుంది. దర్శకుడు అప్పట్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ సిద్ధం చేసుకున్నారు. దర్శకుడు చాలా వాస్తవికంగా తెరకెక్కించారు.. ట్రైలర్‌ చూసి మహేశ్‌బాబు కూడా అదే అన్నారు’. 

అలాంటి తప్పు ఒక్కటీ ఉండదు..

‘‘నా గత చిత్రాల్లో కొన్ని తప్పులు చేశాం. కానీ, ఇందులో అలాంటి తప్పు ఒక్కటీ ఉండదు.  దీంట్లో నా పాత్రకు ఒక మ్యానరిజం ఉంటుంది. పూర్తిగా కుప్పం యాసలో సంభాషణలు పలుకుతా. తెలుగులో వచ్చిన టాప్‌-10 యాక్షన్‌ సినిమాల్లో మా ‘హరోం హర’ తప్పకుండా ఉంటుంది. టాప్‌-5లో ఉన్నా ఆశ్చర్యపోము. యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగాలతో నిండి ఉన్న చిత్రమిది’’. 

వైవిధ్యభరిత కథలతోనే ఆ ప్రయాణం సాధ్యం

‘‘నేనెప్పుడూ నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి.. విభిన్నంగా ఉండాలనే కోరుకుంటా. అయితే ఈ ప్రయాణంలో కొన్ని క్లిక్‌ అయితే మరికొన్ని ఫ్లాప్‌ అవుతుంటాయి. కానీ, నా చిత్రాలు పరాజయం పాలైనప్పటికీ నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదనే అనుకుంటా.  ఈ మధ్యే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపా. మీ కుప్పం నేపథ్యంలో ఓ సినిమా చేశానని చెప్పా. ఈ చిత్రంలోని ‘ఇంక సెప్పెదేమ్‌ లేదు.. సేసేదే’ అనే డైలాగ్‌ ఎక్కడైనా సరిపోతుందని అనిపిస్తే చెప్పండని అడిగా (నవ్వుతూ). ఆయన నవ్వేశారు’’.

‘‘హరోం హర’కు సీక్వెల్‌ చేసే అవకాశం ఉంది. ఫలితాన్ని బట్టి దాన్ని ప్రకటిస్తాం. ఇటీవలే ఫస్ట్‌కాపీ చూసుకున్నా. ఇప్పటి వరకు ఏ చిత్ర విషయంలోనూ కలగనంత సంతృప్తి ఈ సినిమా విషయంలో కలిగింది. ప్రస్తుతం ‘మా నాన్న సూపర్‌హీరో’ అనే చిత్రం చేస్తున్నా. అలాగే మరో రెండు సినిమాలు ఓకే చేశా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని