చిరు సినిమా.. నో చెప్పా: ఇంద్రజ

‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఇంద్రజ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’తో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఒకానొక సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకున్నారట....

Published : 24 Apr 2021 13:38 IST

హైదరాబాద్‌: ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఇంద్రజ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’తో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఒకానొక సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకున్నారట. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న ఇంద్రజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

‘యమలీల’తో ఫామ్‌లోకి వచ్చిన అనంతరం చిరు కథానాయకుడిగా నటించిన ‘అల్లుడా మజాకా’ అవకాశాన్ని చేజార్చుకున్నానని, ఆ సినిమాలో ఊహ పోషించిన పాత్రకు దర్శకుడు మొదట తననే సంప్రదించారని ఇంద్రజ తెలిపారు. చిరు చెల్లిగా నటిస్తే ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం ఉండదని భావించి ఆ ప్రాజెక్ట్‌ తిరస్కరించానని, అలాగే ‘హిట్లర్‌’లోనూ సోదరి పాత్ర కోసం తనకి అవకాశం వచ్చిందని ఆమె చెప్పారు. అయితే ‘హిట్లర్‌’ వద్దనుకోవడానికి డేట్స్‌ లేకపోవడం కూడా ఓ కారణమని ఆమె వివరించారు.

చిరంజీవి అంటే తనకెంతో అభిమానమని.. ఆయన పక్కన నటించాలనే ఆకాంక్ష ఉందని తెలిపారు. ఆయన డ్యాన్స్‌ ఎంతో బాగుంటుందని.. ఇటీవల విడుదలైన ‘లాహే లాహే’ పాటలో చిరు స్టెప్పులు చూసి ఫిదా అయిపోయానని ఇంద్రజ చెప్పారు. కెరీర్‌ ఆరంభంలోనే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమల్లో నటించిన ఇంద్రజ వివాహం అనంతరం కుటుంబ బాధ్యతల రీత్యా కొన్ని సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ‘దిక్కులు చూడకు రామయ్య’తో రీఎంట్రీ ఇచ్చిన ఇంద్రజ.. ‘శతమానం భవతి’, ‘లయన్‌’, ‘అల్లుడు అదుర్స్’లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె రాజ్‌తరుణ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘స్టాండ్‌ అప్‌ రాహుల్‌’లో కీలకపాత్రలో కనిపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని