A R Rahman: ఆ సినిమాలో.. మైకేల్‌ జాక్సన్‌తో పాట పాడిస్తే బాగుంటుందనుకున్నాం: రెహమాన్‌

మైకేల్‌ జాక్సన్‌తో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌.

Published : 11 Jul 2024 00:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాప్‌స్టార్‌ మైకేల్‌ జాక్సన్‌ (Michael Jackson)తో తాను కలిసి పనిచేయాలనుకున్నానని, ఆ కల నెరవేరకముందే ఆయన కన్నుమూశారని సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ (A R Rahman) కాస్త ఎమోషనల్‌ అయ్యారు. జాక్సన్‌ మంచి వ్యక్తి అంటూ ఆయనతో పరిచయాన్ని గుర్తుచేసుకున్నారు. మలేసియాలో నిర్వహించిన ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో అభిమానులు అడగ్గా.. జాక్సన్‌ గురించి రెహమాన్‌ మాట్లాడారు.

‘‘మైకేల్‌ జాక్సన్‌తో నాకు మంచి పరిచయం ఉంది. నేను ‘ఆస్కార్‌’ అందుకున్న తర్వాత ఓ సారి ఆయన ఇంటికి వెళ్లా. ఆయనెప్పుడూ ప్రపంచ శాంతి గురించే మాట్లాడుతుండేవారు. నేను ఇండియాకి తిరిగొచ్చాక దర్శకుడు శంకర్‌తో ఆ సంగతులు పంచుకున్నా. అప్పుడు మేం ‘రోబో’ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నాం. ‘జాక్సన్‌తో ఏదైనా పాట పాడిద్దామా’ అంటూ శంకర్‌ మనసులో మాట బయటపెట్టారు. ఆలోచన బాగుంది. కానీ, ఆయన తమిళ పాట పాడతారా?’ అని నేనన్నాను. ఆ తర్వాత కొంత కాలానికే దరదృష్టవశాత్తు ఆయన కన్నుమూశారు’’ అని పేర్కొన్నారు.

అభిమానులనుద్దేశించి రెహమాన్‌ మాట్లాడుతూ.. ‘‘మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. 1996 నుంచి నేను ఇక్కడికి వస్తున్నా. మీ అభిమానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘ఆస్కార్‌’ సహా ఎన్నో అవార్డులు సాధించిన మీరు ఇంత వినయంగా ఎలా ఉండగలుతున్నారు  అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రెహమాన్‌ ఇలా సమాధానమిచ్చారు. ‘‘అహంకారం అందరిలోనూ ఉంటుంది. కానీ, దానిని మంచి వైపు నియంత్రించాలా, చెడు మార్గం వైపు మళ్లించాలా అనేది మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.  ఈ రెండింటికీ తేడా తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభం’’ అని చెప్పారు. ‘‘ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉండాలంటే ‘గొర్రెలా కాకుండా పులిలా ఉండాలి’’ అంటూ వర్ధమాన గాయకులకు సలహా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని