NTR: వాన జోరు .. దేవర పోరు

‘దేవర’గా థియేటర్లలో యాక్షన్‌ హంగామా చూపించనున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు

Published : 18 Jun 2024 03:46 IST

‘దేవర’గా థియేటర్లలో యాక్షన్‌ హంగామా చూపించనున్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ను ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్, సైఫ్‌లపై గోవా అడవుల్లో ఓ ఆసక్తికర యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికి స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహించారు. భారీ వర్షాలతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ తారక్, సైఫ్‌లతో పాటు మిగిలిన చిత్ర బృందం సహకారంతో ఫైట్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లోని కాబ్రీ దీవుల్లో ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ రొమాంటిక్‌ గీతాన్ని చిత్రీకరించనున్నారు. దీనికోసం వాళ్లిద్దరూ ఇప్పటికే అక్కడికి పయనమయ్యారు. మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘దేవర: పార్ట్‌ 1’ పేరుతో సెప్టెంబరు 27న విడుదల కానుంది. దీనికి అనిరుధ్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని