Anupam thripati: స్క్విడ్‌గేమ్‌లో ‘అలీఅబ్దుల్‌’ మనోడే..

నెలకింద అనుపమ్‌ త్రిపాఠి ఇన్‌స్టాలో 3వేల మంది అనుసరిస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 3.5 మిలియన్లకు చేరింది

Published : 01 Nov 2021 01:14 IST

అంతర్జాతీయంగా ప్రేక్షకాదరణ పొందుతున్న వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్’‌. నెల రోజుల నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ముదులుపుతోంది. మనీహైస్ట్‌, లుపిన్‌లను దాటేసి ఎక్కువ మంది చూసిన డెబ్యూ వెబ్‌సిరీస్‌గా రికార్డు సృష్టించింది. ఇందులో ప్లేయర్‌ 199గా, అలీ అబ్దుల్‌గా అదరగొట్టిన నటుడికి ఇండియాతో ప్రత్యేక అనుబంధముంది. అదేంటో చదివేద్దామా?

పుట్టి పెరిగిందంతా ఇక్కడే

‘స్క్విడ్‌గేమ్‌’ మొదటి రౌండ్‌లోనే హీరో ప్రాణాలను కాపాడతాడు అలీ అబ్దుల్‌. అలా తెరపై కనిపిస్తూనే ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు. పాకిస్థాన్‌ వలస కార్మికుడిగా కీలకమైన పాత్రలో మెరిసిన అనుపమ్‌ త్రిపాఠి భారతీయ నటుడవడం విశేషం. దేశ రాజధాని దిల్లీలోనే పుట్టి పెరిగాడు. నాటకరంగం మీదున్న ఆసక్తితో 2006 నుంచి 2010 వరకు దిల్లీలోని ప్రముఖ నాటక సంస్థలలో పనిచేశాడు. కొన్నాళ్లకు దక్షిణ కొరియాలోని ‘కొరియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌’లో స్కాలర్‌షిప్‌ దక్కడంతో ఆ నేలపై అడుగుపెట్టాడు. శిక్షణ పూర్తయ్యాక నటుడిగా నిరూపించుకోడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. కొరియన్‌ భాషపై పట్టు సాధించాడు. చిత్రపరిశ్రమలో పలువురితో పరిచయాలు పెంచుకున్నాడు.

శరణార్థుల పాత్రలే ఎక్కువ

శిక్షణ పూర్తిచేసుకున్నాక కొరియన్‌ నాటకాల్లో పలు ప్రదర్శనలిచ్చాడు. సినిమా అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగాడు. ఒక మంచి రోల్‌ ఇవ్వమని అడగడానికి ఏ రోజూ సిగ్గుపడలేదు అనుపమ్‌ త్రిపాఠి. నటుడిగా నిరూపించుకోడానికి ఏం చేయడానికైనా సిద్ధమైపోయేవాడు. ఆయనకు వచ్చినవన్నీ చిన్నపాత్రలే. అందులోనూ శరణార్థుల పాత్రలే ఎక్కువ. ‘ఓడ్‌ టు మై ఫాదర్’, ‘స్పేస్‌ స్వీపర్స్’‌, ‘హాస్పిటల్‌ ప్లేలిస్ట్‌’ చిత్రాల్లో చేసినవి అలాంటివే. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘స్క్విడ్‌గేమ్‌’లోనూ పాకిస్థాన్‌ వలస కార్మికుడి పాత్రలోనే కనిపిస్తాడు. మిగతా వాటితో పోల్చితే ఇది కాస్త భిన్నం. నిడివి ఎక్కువ. నటనకు ఆస్కారమున్న పాత్ర. అందుకే రెచ్చిపోయి నటించాడు. ఆ కష్టం ఊరికే పోలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాక రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. ఇంతపెద్ద విజయం దక్కడం, తన పాత్రకు మంచి పేరు రావడంతో గాల్లో తేలిపోతున్నాడు. 

అలీ కోసం ఆరు కేజీలు

కొరియన్‌ చిత్ర పరిశ్రమలో తరచూ చిన్నపాత్రలే పలకరించినా.. కాదనకుండా చేశాడు. ఈ క్రమంలో తనను తాను నటుడిగా మలచుకున్నాడు. మొదట్లో కొరియన్‌ భాష,  సాంప్రదాయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటన్నింటినీ అధిగమించి నటుడిగా స్థిరపడేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నాడు. అలా 2020 జనవరిలో ‘స్క్విడ్‌గేమ్‌’ ఆడిషన్స్‌లో పాల్గొని పాక్‌ వలసకార్మికుడి పాత్రకి ఎంపికయ్యాడు. పాత్ర అవసరాల రీత్యా 6 కేజీల బరువు పెరిగాడు. యూట్యూబ్‌ వీడియోలు చూసి ఉర్దూ భాషపై పట్టు పెంచుకున్నాడు. పాక్‌లో స్నేహితులను కలసి, ప్రతిరోజూ గమనిస్తూ అలీ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు.

మానవత్వానికి నిలువుటద్దం 

‘స్క్విడ్‌గేమ్‌’లో ప్రాణాలతో బయటపడాలంటే పక్కవాడిపై ఆలోచన ఉండకూడదు. అలా చేస్తూ వెళ్తే ఏదో దశలో మనకు చావు ముప్పు తప్పదు. అలీ పాత్ర మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. తన ప్రాణాలకు ముప్పుంటుందని తెలిసినా.. ఎదుటి వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు. హీరోను రక్షించే మొదటి సన్నివేశంలోనే అలీ పాత్ర ఎంత బలమైనదో తెలుస్తుంది. మనుషులను అమితంగా ప్రేమించే వ్యక్తిగా, నమ్మకస్థుడిగా,  అమాయకుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేస్తాడు. ఆటలో ఎప్పుడు ప్రాణాలుపోతాయో తెలియని సంక్లిష్ట పరిస్థితుల్లోనూ మంచి సంబంధాలను ఏర్పర్చుకుంటూ ముందుకు సాగుతాడు. మిగతా అందరూ తనవాడు అనుకునేలా అలీ పాత్ర ఉంటుంది. సొంత కుటుంబ సభ్యుడిలానే భావిస్తారు. మానవత్వానికి నిలువుటద్దం లాంటి పాత్ర కాబట్టే వీక్షకుల మనసులు గెలిచాడు. ఇంతమంది అభిమానాన్ని చూరగొన్నాడు.

3 వేల నుంచి 3.5 మిలియన్లు

‘స్క్విడ్‌గేమ్‌’ ప్రసారం కాకముందు అనుపమ్‌ త్రిపాఠి ఇన్‌స్టా ఖాతాను 3 వేల మంది మాత్రమే అనుసరించేవారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుంచి ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ప్రతిరోజూ వేలసంఖ్యలో అభినందనలు తెలుపుతూ సందేశాలు వస్తున్నాయి. అంతేకాదు నెలకింద 3వేల మంది ఫాలోవర్లు ఉండగా, ఆ సంఖ్య ఇప్పుడు 3.5 మిలియన్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రేమ దక్కుతుండటంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఈ సంఖ్య త్వరలోనే అరకోటికి చేరకుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. తన సంతోషాన్ని కన్నతల్లితో పంచుకున్నాడు. దానికి ఆమె...‘ఇప్పుడే గాల్లో తేలిపోకు. పాదాలను నేల మీదే ఉంచు’ అని జాగ్రత్తలు చెప్పిందని వెల్లడించాడు అనుపమ్‌ త్రిపాఠి.

సొంతనేలపై నిరూపించుకోవాలని

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ తనకు మాతృదేశంలో సొంతమనుషుల మధ్య నటుడిగా నిరూపించుకోవాలని ఉందని అంటున్నాడు.  ప్రస్తుతం చేస్తున్నవన్నీ కొరియన్‌ సినిమాలే. అక్కడ అవకాశాలు వెల్లువెత్తున్నాయి. మరింత బలమైన పాత్రతో ముందుకు వస్తానంటున్నాడీ దిల్లీ కుర్రాడు. 5 ఏళ్ల పాటు దిల్లీలోని నాటకసంస్థలతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. బాలీవుడ్‌ నుంచి ఇప్పటివరకు అవకాశాలు తలుపు తట్టలేదు. మంచి పాత్రలొస్తే నిరూపించుకునేందుకు సిద్ధమని మనసులో మాటను బయటపెట్టాడు. భారతీయ నటుల్లో తనకు షారుక్‌ అంటే చాలా ఇష్టమని.. బాలీవుడ్‌ క్లాసిక్‌ సాంగ్స్‌ అంటే పడిచస్తానని చెబుతున్నాడు. అంతర్జాతీయ స్టార్‌గా వెలుగొందుతున్న అనుపమ్‌ త్రిపాఠి బాలీవుడ్‌లోనూ విజయం సాధించాలని కోరుకుందాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని