Gundamma katha: ఎన్టీఆర్ ,ఏయన్నార్ విజిల్స్.. సినిమా సూపర్ హిట్

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, సావిత్రి, జమున, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్‌ మూవీ ‘గుండమ్మ కథ’.

Published : 07 Jun 2022 10:51 IST

ఎన్టీఆర్ ,ఏయన్నార్ విజిల్స్.. సినిమా సూపర్ హిట్

ఇంటర్నెట్‌డెస్క: ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, సావిత్రి, జమున, సూర్యకాంతం కీలక పాత్రల్లో నటించిన క్లాసిక్‌ మూవీ ‘గుండమ్మ కథ’. ఈ సినిమా విడుదలైన 2022 జూన్‌ 7వ తేదీతో 60ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఓ సీన్‌లో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ల మధ్య డైలాగ్స్‌ ఉండవు. సీన్‌ మొత్తం కేవలం విజిల్స్‌తో నడుస్తుంది. రచయిత డి.వి.నరసరాజు ఆ సీన్‌ మద్రాసులోని ఇంట్లో కూర్చొని రాశారట. ఎన్టీఆర్‌ గుండమ్మ గారింట్లో పనివాడి (మారు) వేషంలో ఉంటాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏయన్నార్‌ తన ప్రేయసి (జమున) కోసం వస్తాడు. ‘ఇంట్లో నా ప్రేయసి ఉందా?’ అని ఎన్టీఆర్‌ని ఏయన్నార్‌ అడుగుతాడు అని మొదట నరసరాజు రాశారట. ‘ప్రేయసి’ బరువైన మాటలాగా అనిపించి, ‘ఇంట్లో నా పిట్ట ఉందా?’ అని మార్చారట. ‘పిట్ట’ మరీ చీప్‌గా అనిపించి, ‘ఇంటో ఆమె (జమున) ఉందా?’ అని స్ఫురించేలా ఏయన్నార్‌ ఈలతో అడిగినట్లు, వెంటనే ‘ఉంది’ అని ధ్వనించేలా ఎన్టీఆర్‌ ఈలతోనే సమాధానం చెప్పినట్టు రాసి, ఇంటికి ప్రొడక్షన్‌ కారు రావడంతో నరసరాజు ఆ పూటకి సగం సీన్‌ మాత్రమే రాసి, స్క్రిప్టును తీసుకెళ్లి విజయా స్టూడియోలో చక్రపాణికి చూపించారట. వెంటనే చక్రపాణి విజిల్స్‌తో సంభాషణ బాగుందని, సీన్‌లోని మిగిలిన భాగాన్ని కూడా విజిల్స్‌తోనే కొనసాగించమని అన్నారట. నరసరాజు అలానే రాశారు. హాల్లో జనం అగ్రనటుల విజిల్స్‌ సీన్‌ చూసి తెగ ఈలలు వేశారు. రాసేటప్పుడు రచయిత సరైన మాట దొరక్క విజిల్స్‌ను ఆశ్రయిస్తే ఆ సీన్‌ సూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రంలో ఎస్వీఆర్‌ పాత్రనూ ప్రేక్షకులు మర్చిపోలేరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని