Womens Day: పడిలేచారు.. స్ఫూర్తినిచ్చారు.. అందరిదీ ఒకటే మంత్రం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (happy womens day 2023) సందర్భంగా.. కొందరు తారల స్ఫూర్తిగాథలు చదువుదామా..

Updated : 07 Mar 2023 12:54 IST

వీరంతా నటిగా రాణించాలనే లక్ష్యంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. కెరీర్‌ దూసుకెళ్తున్న సమయంలో.. కలలో కూడా ఊహించని భయంకరమైన వ్యాధికి గురయ్యారు. అయినా కుంగిపోకుండా మహమ్మారిని ఎలా జయించాలో ఆలోచించారు. ఆ దిశగా అడుగులు వేసి, విజేతలుగా నిలిచి, మళ్లీ అవకాశాలు అందుకుని ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఏ తార ఏ వ్యాధికి గురయ్యారు? ఎలా కోలుకున్నారు?.. వారు పంచుకున్న అనుభవాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం (international womens day) సందర్భంగా గుర్తుచేసుకుంటూ వారి విజయ సూత్రాన్ని పాటిద్దాం..

ఆ మాటలే స్ఫూర్తి: సుస్మితాసేన్‌

‘‘ఇటీవల నేను గుండెపోటుకు గురయ్యా. ప్రధాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. తగిన చికిత్స తీసుకున్నా. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. ‘నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది’.. మా నాన్న సుబీర్‌సేన్‌ నాకు చెప్పిన ఈ మాటలే నాకు స్ఫూర్తి’’ (Sushmita Sen).

మీ ప్రేమే బలం: సమంత

‘‘కొన్ని నెలల నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది’’ (Samantha Ruth Prabhu).

చిరునవ్వే ఆయుధం: హంసా నందిని

‘‘నాకున్న సమస్యను నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకున్నా. నా భయమే నిజమైంది. రొమ్ము క్యాన్సర్‌ ఉందని తేలింది. అది కూడా గ్రేడ్‌-3. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ వ్యాధి భవిష్యత్తులో తిరిగి వ్యాప్తి చెందదని స్పష్టం చేశారు. కానీ, నా ఆనందం నిమిషాల్లోనే ఆవిరైపోయింది. BRCA1 (వంశపారంపర్య రొమ్ము క్యాన్సర్‌) పరీక్షలో నాకు పాజిటివ్‌ అని తేలింది. దాని జన్యు పరివర్తన కారణంగా భవిష్యత్తులో నాకు 70 శాతం రొమ్ము క్యాన్సర్‌, 45 శాతం అండాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కచ్చితంగా పొంచి ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ ముప్పు నుంచి బయటపడాలంటే కొన్ని రోగనిరోధక శస్త్ర చికిత్సలు చేయించుకోవాలన్నారు. అలాగని నేను అధైర్యపడలేదు. ఈ మహమ్మారికి నన్ను జయించే అవకాశం, నా జీవితాన్ని శాసించే అధికారం ఇవ్వాలనుకోలేదు. చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతోనే ఈ యుద్ధాన్ని గెలవాలనుకున్నా.. గెలిచా’’ (Hamsa Nandini).

పాఠాలు నేర్చుకున్నా: సోనాలిబింద్రే

‘‘క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్‌కి తర్వాత అన్నట్టు ఉంటాయి. మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌కు గురైన నా పరిస్థితీ అంతే. మనిషి తన జీవితంలో ఏదో ఒక దాని వల్ల పాఠాలు నేర్చుకోవాలి. నేను దీని (క్యాన్సర్‌) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నా. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నా’’ (Sonali Bendre).

వారే ధైర్యం: మమతా మోహన్‌దాస్‌

‘‘లింఫ్‌నోడ్స్‌పై ప్రభావం చూపే క్యాన్సర్‌కు గురికావడంతో నా కలలన్నీ చెదిరిపోయాయి. ఏడేళ్లు పోరాడి ఆ మహమ్మారి నుంచి బయటపడ్డా. మళ్లీ నా ప్రపంచాన్ని నేను సృష్టించుకునేందుకు సానుకూలంగా ఆలోచించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. కానీ, అలా కొన్నేళ్ల పాటు గడపాలంటే మన చుట్టూ పాజిటివ్‌ వాతావరణం ఉండాలి. అమ్మానాన్నలు, కజిన్స్‌, స్నేహితులు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. నాకు చేసిన వైద్యమూ ఫలించింది. అందుకే మీ ముందు ఇలా ఉన్నా’’ (Mamta Mohandas).

మాట్లాడితే భారం తగ్గుతుంది: శ్రుతిహాసన్‌

‘‘నాకు ఆందోళన సమస్యలున్నాయి. తీవ్ర ఒత్తిడికి గురవుతుంటా. ఒక్కోసారి ప్రతి చిన్నదానికీ అసహనానికి లోనవుతా. దాంతో, ‘ఊరికే విసుక్కుంటుంది, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది’ అని చాలామంది అనుకుంటారు. నా పరిస్థితి గురించి చెప్పలేక మొదట్లో భయపడి ఊరుకునేదాన్ని. తర్వాత ఎంతో మంది మానసిక ఆరోగ్యంపై మాట్లాడటం మొదలుపెట్టారు. నేను నా సమస్యను ఎందుకు చెప్పకూడదనిపించింది. అందుకే ఇప్పుడు ‘నెలసరి’లోనూ నోరు విప్పుతున్నా. పీరియడ్‌ వచ్చినప్పుడు డ్యాన్సో, ఫైటో ఉంటే సరిగా చేయలేను. నేను ఎందుకు చేయలేకపోతున్నానో చిత్ర బృందానికి వివరిస్తుంటా. మానసిక ఆరోగ్యానికి చికిత్స తీసుకున్నా. సంగీతం కూడా నాకు ఉపశమనం కలిగిస్తుంది. బాగా ఇబ్బంది అయిన సందర్భంలో థెరపీ కోసం వెళతా. అయితే దాన్ని దాయాలని అనుకోను. దాచినప్పుడే మరింత ఒత్తిడి. మనలో చాలామంది ఇతరులు ఏమనుకుంటారో అని భయపడతాం. మనసు విప్పి మాట్లాడితే భారం తగ్గుతుంది’’ (Shruti Haasan).

* సీనియర్‌ హీరోయిన్లు మనీషా కొయిరాల, గౌతమి తదితరులు క్యాన్సర్‌ను జయించిన వారే. వీరందరి విజయ సూత్రం ధైర్యం. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు