RRR - Naatu Naatu: ‘నాటు నాటు...’లో ఈ విషయాలు మీరు గమనించి ఉండరు!

ఆస్కార్‌ (Oscar) వేదిక మీద ‘నాటు నాటు’ (Naatu Naatu) తన అదృష్టం పరీక్షించుకోవడానికి మరో ఐదు రోజులే ఉంది. ఈ సమయంలో ఆ పాటలోని కొన్ని ఆసక్తికర అంశాలు, సగటు ప్రేక్షకుడు గుర్తించని అంశాలను ‘ఆర్ఆర్ఆర్‌’ (RRR) దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) వివరించారు. 

Updated : 12 Mar 2023 18:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘నాటు నాటు’ (Naatu Naatu Song) పాటలో రామ్‌చరణ్‌ (Ramcharan), తారక్‌ (Tarak) మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే ఆ పాటలో వాళ్లు వేసే స్టెప్పులు అలా ఉంటాయి మరి. అయితే ఇంకా కొన్ని ఆసక్తికర అంశాలున్నాయి. ఈ పాట ఆస్కార్‌ పురస్కారం కోసం బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ‘RRR’ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ పాటలో కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.


‘నాటు నాటు..’ పాటను తొలుత మన దేశంలోనే చిత్రీకరిస్తాం అనుకున్నారట. అయితే షూటింగ్‌ అనుకున్నప్పుడు దేశంలో వర్షాలు కురుస్తున్నాయి దీంతో వేరే ప్రాంతాల గురించి వెతుక్కుంటూ ఉక్రెయిన్‌లోని ఓ భవనాన్ని చూసి ఫిక్స్‌ అయ్యారట. 


అంతా ఓకే అనుకొని ఉక్రెయిన్‌ వెళ్లి షూటింగ్‌ చేసేద్దాం అనుకుంటుండగా.. అది ప్రెసిడెన్సియల్‌ ప్యాలెస్‌ అని తెలిసిందట. అనుమతులు కష్టమేమో అనుకుంటుండగా.. అక్కడి అధికారులు ‘నో ప్రాబ్లెమ్‌’ చేసుకోండి అన్నారట. అలాగే పాటలో ఉక్రెయిన్‌ పార్లమెంట్ భవనం డోమ్‌ కూడా ఓ షాట్‌లో కనిపించడం గమనార్హం.


పాటలో బ్యాగ్రౌండ్‌లో కనిపించే యువతులు, మ్యూజీషియన్స్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌లు కారట. నిజమైన డ్యాన్సర్లనే తీసుకొచ్చారు. అలాగే అసలైన మ్యూజీషియన్స్‌నే పాటలో సంగీత కళాకారులుగా చూపించారట. లైవ్లీ నెస్‌ కోసం అలా చేశామని జక్కన్న చెప్పారు. వాళ్లు కూడా తమకు స్టెప్స్‌ లేకపోయినా.. పాటను ఎంజాయ్‌ చేస్తూ కనిపించారు. పాటలో వాళ్లను గమనిస్తే బ్యాగ్రౌండ్‌లో వాళ్ల లైట్‌ మూమెంట్స్‌ కనిపిస్తాయి. 


పాటలోని ఐకానిక్‌ స్టెప్‌ కోసం డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌రక్షిత్‌ సుమారు 100కుపైగా స్టెప్స్‌ కంపోజ్‌ చేసి ఇచ్చారట. అందులోంచి ఆ మూమెంట్‌ను రాజమౌళి ఎంచుకున్నారట. పాట విజయానికి ఫస్ట్‌ క్రెడిట్‌ ప్రేమ్‌ రక్షిత్‌దే అని చెప్పారు రాజమౌళి. 


నాటు నాటు స్టెప్‌ మొదలయ్యే ముందు రామ్‌, భీమ్‌ వేసుకున్న సస్పెండర్స్‌ను జెన్నీ లాగి వదులుతుంది. వెంటనే వాళ్లు స్టెప్స్‌ మొదలుపెడతారు. అయితే నిజానికి ఆ సస్పెండర్స్‌ లాగి వదిలినప్పుడు ఇద్దరికీ బలంగా తాకిందట. అక్కడ నవ్వేసినా.. కట్‌ చెప్పగానే ‘ఉఫ్‌’ అంటూ నొప్పితో ఇబ్బందిపడ్డారట. 


పాట మొత్తం తారక్‌, చరణ్‌ వేసుకున్న సస్పెండర్స్‌.. వాటితో ఆడుతూ వేసే మూమెంట్స్‌ చేసేటప్పుడు వేసుకున్న సస్పెండర్స్‌ ఒకటి కావట. ఆ స్టెప్పుల కోసం కాస్త వదులుగా ఉన్నవి డిజైన్‌ చేయించారట. స్టెప్‌ ఆఖరులో ఈ విషయం ఈజీగా గమనించొచ్చు కూడా. అలాగే ఆ స్టెప్‌.. రాజమౌళికి పాటలో నచ్చిన మూమెంట్‌ అట. 


పాటలో రామ్‌చరణ్‌, తారక్‌ల బ్రొమాన్స్‌ కనిపిస్తుంది. అయితే ఈ పాటలో ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌లో ఫైట్‌ చేసేలా ఉంటుంది. కొన్ని పోస్చర్స్‌లో ఆ ఫైటింగ్‌ బాడీ లాంగ్వేజ్‌ గమనించొచ్చు అని రాజమౌళి చెప్పారు. 


పాట ఆఖరున మట్టిలో డ్యాన్స్‌ చేయించేటప్పుడు కాస్ట్యూమ్స్‌తో చాలా ఇబ్బంది పడ్డారట. కట్‌ చెప్పడం ఆలస్యం.. మొత్తం కాస్ట్యూమ్స్‌ టీమ్‌ దుస్తుల్ని శుభ్రం చేయడానికి సిద్ధమయ్యేవారట. దీని కోసం ఒకే తరహా డ్రెస్సులు మూడు సిద్ధం చేయించారట. అలాగే ఆ క్లాత్‌ను ఎలా పడితే అలా ఉతికే పరిస్థితి లేదట. దీంతో కాస్ట్యూమ్స్‌ టీమ్‌ కొంత ఇబ్బంది పడిందట. అలాగే అన్ని రోజుల షూటింగ్‌లో కంటిన్యుటీ మిస్‌ కాకుండా చూసుకున్నారట. 


ఈ పాటను ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని చెప్పిన రాజమౌళి.. పాటలో బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్లకు ఫ్యాన్‌ అయిపోయారట.  వాళ్లకు స్టెప్స్‌ ఇబ్బందిగా అనిపించినా.. ఎక్కడా ముఖంలో ఎక్స్‌ప్రెషన్‌ కనిపించకుండా చక్కగా నటించారని జక్కన్న చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ‘10 కమాండ్‌మెంట్స్‌’లోని ఓ ఫ్రేమ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పారు. 


పాట షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఓ ఫ్రేమ్‌ కోసం మొత్తం టీమ్‌ అడిగి మరీ పదే పదే చూశారట. అది రామ్‌చరణ్‌, తారక్‌ స్టెప్‌ కాదట. జెన్నీ (ఒలీవియా మోరిస్‌) వాళ్ల డ్యాన్స్‌ను చూస్తూ ‘వావ్‌’ ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తుంది. ఆ ఫ్రేమ్‌ అండ్‌ షాట్‌ కోసం టీమ్‌.. మోనిటర్‌ రూమ్‌ దగ్గరకు వచ్చి అడిగి మరీ చూశారట. ఆ షాట్‌ తన దృష్టిలో అదే బెస్ట్‌ అని చెప్పారు రాజమౌళి. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు