Baahubali: ‘బాహుబలి’ ఇంటర్వెల్‌.. ఆ డైలాగ్స్‌ వెర్షన్‌తో తెరకెక్కించి ఉంటే!

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ చిత్రం గురించి పలు ఆసక్తికర విశేషాలివీ..

Updated : 10 Jul 2024 13:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా ‘బాహుబలి’ (Baahubali). ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమాకి 9 ఏళ్లు. ప్రభాస్‌ (Prabhas), రానా (Rana Daggubati), అనుష్క (Anushka Shetty), తమన్నా (Tamannaah Bhatia), రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ల నటన.. రాజమౌళి (Rajamouli) టేకింగ్‌, ఎం.ఎం.కీరవాణి సంగీతం, సెంథిల్‌ కెమెరా వర్క్‌.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. 2015 జులై 10న విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్‌’ (Baahubali: The Beginning) గురించి ఆసక్తికర విషయాలు మీకోసం (9 Years For Baahubali)..

అనుకొన్నది ఒకటి.. తెరకెక్కించింది మరొకటి!

ప్రస్తుతం ఉన్న సినిమాలో బాహుబలి విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వస్తుంది. కానీ, తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్‌ ఇద్దామనుకున్నారు దర్శకుడు రాజమౌళి. ‘‘మాహిష్మతి ఊపిరి పీల్చుకో. నా కొడుకు వచ్చాడు. బాహుబలి తిరిగొచ్చాడు’ అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వెల్‌ ఇవ్వాలి. దానికన్నా ముందు శివుడు భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం.. ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు. కానీ, ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు. శివుడు మాహిష్మతిలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు. అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుడిని చూసి బాహుబలి అనుకుంటాడు. ‘ప్రభూ.. నన్ను ఏమీ చేయొద్దు’ అని వేడుకుంటాడు.

అతడు అక్కడినుంచి తప్పించుకొని వచ్చి, బిజ్జలదేవుడికి విషయం చెబుతాడు. కానీ, అతడు నమ్మడు. ‘బాహుబలి చచ్చిపోయాడు. వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశాం’ అని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకొని శివుడు రావాలి. ‘వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశాం’ అనగానే అగ్ని కీలలు దాటుకుంటూ రావాలి. ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్‌కు ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నాం. అక్కడ ఇంటర్వెల్‌ ఇద్దామనుకున్నాం. కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వెల్‌ వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడి డైలాగ్స్‌ అన్నీ తీసేశాం. శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను ‘నిప్పులే శ్వాసగా’ అని సాంగ్‌లా తీశాం’’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో తెలిపారు.

ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ కూడా రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో భాగంగా రూపొందిన యానిమేటెడ్‌ సిరీస్‌ ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ (Baahubali Crown of Blood) ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని