K Viswanath: సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ సంయోగ సమభూశితే...

కె.విశ్వనాథ్‌ (K Viswanath) సినిమా అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది సంగీతం, సాహిత్యం, నాట్యం. ఆయన సినిమాల్లోని పాటలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సంస్కృతంలో సాగే పాటలైనా సరే ఆ శ్రావ్యత ప్రేక్షకుల్ని కవ్విస్తూనే ఉంటుంది.

Updated : 04 Feb 2023 07:01 IST

* కె.విశ్వనాథ్‌ (K Viswanath) సినిమా అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది సంగీతం, సాహిత్యం, నాట్యం. ఆయన సినిమాల్లోని పాటలు నిత్యనూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. సంస్కృతంలో సాగే పాటలైనా సరే ఆ శ్రావ్యత ప్రేక్షకుల్ని కవ్విస్తూనే ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’తోనే సీతారామశాస్త్రి గీత రచయితగా పరిచయం అయ్యారు. ఇందులోని ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...’ ఆయనకి తొలి గీతం. ఈ సినిమా పేరే ఆయనకి ఇంటి పేరయ్యింది. మరో ప్రముఖ రచయిత వేటూరి సుందరరామమూర్తి రచనా జీవితం కూడా కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఓ సీత కథ’తోనే ఊపందుకుంది. ఆ చిత్రం కోసం ఆయనతో మూడు పాటలు రాయించారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కలయిక ప్రభంజనం సృష్టించింది.


సాహసాలు.. ప్రయోగాలు

సాహసాలకి పెట్టింది పేరు కె.విశ్వనాథ్‌. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నెన్నో ప్రయోగాలు కనిపిస్తాయి. అందగాడుగా పేరున్న శోభన్‌బాబుని ‘చెల్లెలి కాపురం’ సినిమాలో డీ గ్లామరైజ్‌ చేసి చూపించడం... ఆరుపదుల వయసున్న సోమయాజులుని తన ‘శంకరాభరణం’లో  కథానాయకుడిగా చూపించడం...మాస్‌ ఇమేజ్‌ ఉన్న చిరంజీవిని ‘స్వయంకృషి’తో చెప్పులు కుట్టే వ్యక్తిగా చూపించడం... అంధుడైన కథానాయకుడు, మాటలు రాని కథానాయిక నేపథ్యంలో ‘సిరివెన్నెల’ తీయడం...  ఇలా ఎన్నో  ప్రయోగాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు.


దైవానుగ్రహమే ఎక్కువ..  

తన విజయాల్లో దైవానుగ్రహమే ఎక్కువనేవారు దర్శకుడు కె.విశ్వనాథ్‌. దానికి తన స్వయం కృషి కాస్త తోడైందని చెప్పేవారాయన. ‘‘నా ఉద్దేశంలో 20శాతం నా కష్టం.. మిగిలిన 80శాతం దేవుడి కృప. ఎందుకంటే నా విజయాల్లో నా కష్టమే ఎక్కువనుకుంటే అది పొరపాటు. నా చదువేమిటో నాకు తెలుసు. నేనేమీ రామాయణం, భారతం, భాగవతం చదవలేదు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని కథలు తయారు చేయలేదు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి? ఇలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినట్లు! విద్య అయినా ఉండాలి, లేదంటే ఎక్స్‌పోజరైనా అయి ఉండాలి. నాకు ఇవేం లేవు. కాబట్టి ఇదంతా దైవానుగ్రహం కాకపోతే ఇంకేమైనట్లు’’ అని తన విజయసూత్రాన్ని వివరించేవారు కళాతపస్వి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు