K Viswanath: విశ్వరూప విన్యాసం విశ్వనాథుడి ప్రయాణం

కళలకి కిరీటం పెట్టి...  విలువలకి పెద్ద పీట వేసి... తెలుగు చిత్రానికి ‘స్వాతి ముత్యం’... ‘స్వర్ణ కమలం’తో సొబగులద్ది మురిపించిన సినీ పిపాసి మన కళా తపస్వి! ఆధునికత పేరుతో ఎటో వెళ్లిపోతున్న సినీ పోకడకి నేర్పుగా కళ్లెం వేసి... ‘కాలం మారింది’ కానీ మరవకూడని మన మూలాలు ఇవిగో అంటూ అందులోని గొప్పదనాన్ని చూపించిన సినీ దార్శనికుడు మన కాశీనాథుని విశ్వనాథుడు (K Viswanath).

Updated : 04 Feb 2023 07:02 IST

కళలకి కిరీటం పెట్టి...  విలువలకి పెద్ద పీట వేసి... తెలుగు చిత్రానికి ‘స్వాతి ముత్యం’... ‘స్వర్ణ కమలం’తో సొబగులద్ది మురిపించిన సినీ పిపాసి మన కళా తపస్వి! ఆధునికత పేరుతో ఎటో వెళ్లిపోతున్న సినీ పోకడకి నేర్పుగా కళ్లెం వేసి... ‘కాలం మారింది’ కానీ మరవకూడని మన మూలాలు ఇవిగో అంటూ అందులోని గొప్పదనాన్ని చూపించిన సినీ దార్శనికుడు మన కాశీనాథుని విశ్వనాథుడు (K Viswanath).

ఆయన ‘శుభోదయం’ తెలుగు సినిమాకి నవోదయం
ఆయన ‘సప్తపది’ సామాజిక రుగ్మతల  సంస్కరణకి పరమావధి
‘సిరి సిరి మువ్వ’... సంప్రదాయ సంగీత నృత్యాలకి ఓ వెలుగు దివ్వె
‘సిరివెన్నెల’... మన తెరని పునీతం చేసిన పండు వెన్నెల
‘శంకరాభరణం’... భారతీయ సినిమాకే ఓ  కంఠాభరణం

* సాగర సంగమం, శ్రుతిలయలు, సూత్రధారులు, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం... ఇలా ఒకదాన్ని మించి మరొకటి?

* కళాఖండం అనే మాటకి అసలు సిసలు అర్థం చెబుతూ... తరాలు మారినా తరగని కళా సంపదని తెలుగు వారి సొంతం చేసి ఇక సెలవంటూ వెళ్లిపోయారు దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌. కానీ ఆయన సినిమాలు  నిత్యనూతనంగా కనిపిస్తూ మనలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి. తెలుగు తెరపై నిండైన ఆ పెద్దరికం... నిలువెత్తు ఆ సంప్రదాయం ఇక జ్ఞాపకమే కావొచ్చు. కానీ అందులోని స్వచ్ఛత మాత్రం ఎప్పుడూ మనతోనే!

సౌండ్‌ రికార్డింగ్‌ విభాగం నుంచి రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన సుదీర్ఘమైన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు. దర్శకుడిగా ‘ఆత్మగౌరవం’తో ప్రయాణం మొదలుపెట్టిన కె.విశ్వనాథ్‌ చివరి చిత్రం  ‘శుభప్రదం’. తొలి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించగా, చివరి చిత్రంలో అల్లరి నరేష్‌ కథానాయకుడు. హిందీలో పది చిత్రాల్ని తెరకెక్కించారు. ఎక్కువగా ఆయన సినిమాలకి రీమేక్‌గా తెరకెక్కినవే. ఎన్టీఆర్‌తో నాలుగు చిత్రాలు తీసిన ఆయన, అప్పటి కొత్తతరం కథానాయకులైన కృష్ణ, శోభన్‌బాబులతోనూ సినిమాలు చేశారు. తెలుగులో  కమల్‌హాసన్‌, చంద్రమోహన్‌, శోభన్‌బాబు తదితర కథానాయకులు స్టార్‌డమ్‌ని సొంతం చేసుకోవడానికి ఆయన సినిమాలు దోహదం చేశాయి. సుదీర్ఘమైన తన సినీ ప్రయాణంలో ఏదీ కూడా ప్రణాళిక ప్రకారం జరగలేదని చెప్పేవారు కె.విశ్వనాథ్‌. తన దర్శకత్వ ప్రయాణం ‘సిరిసిరి మువ్వ’కి ముందు, ఆ తర్వాత అన్నట్టుగా ఉంటుంది. అప్పటివరకు అనుబంధాలకి పెద్దపీట వేస్తూ సినిమాలు తీస్తే, ‘సిరిసిరి మువ్వ’ నుంచి ఆయన దృష్టి కళలవైపు మళ్లింది. ‘‘మనిషి జీవితంలో రకరకాల దశల్లాగే, ఒకొక్క దర్శకుడు ఒక్కో సమయంలో ఒక్కో రకమైన కథల్ని సిద్ధం చేసుకుంటుంటాడు. అయితే నా జీవితంలో ఇది కూడా భగవంతుడు నిర్దేశించిందే అని నమ్ముతుంటా. సంగీతం, నృత్యం ప్రాధాన్యం తగ్గిపోతోందనే బాధ నాలో ఎక్కువగా ఉండేది.  ఆ విషయంలో నావంతు బాధ్యతగా ఏదైనా చేయాలనే ఆలోచనతోపాటు, కెరీర్‌ పరిధిని కూడా విస్తృతం చేసుకోవాలనే ఓ ప్రయత్నం ఈ దశ వెనక ఉందని నమ్ముతా. అప్పట్నుంచి అందుకు తగ్గ కథల్ని అల్లుకున్నా’’ అని చెప్పేవారు.

ఖాకీ అందుకే

కె.విశ్వనాథ్‌ సినిమా సెట్‌ అంటే...అందులో తెర వెనక పనిచేసే బృందం అంతా ఖాకీ దుస్తుల్లో కనిపించేవారు. దాని వెనక కథని అడిగితే సరదాగా ఆ సంగతులు బయటపెట్టేవారు కె.విశ్వనాథ్‌. ‘‘నిజాయతీగా తీసుకున్న నిర్ణయమే అది. నా బృందం అంతా ఖాకీ చొక్కా, నిక్కరు ధరిస్తే, నేను ప్యాంట్‌ ధరించేవాణ్ని. ‘మీరు ఖాకీ దుస్తులు వేసుకోవడం ఏమిటండీ?’ అని మా కళా దర్శకుడు నాతో గొడవపడేవాడు. మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే... వెంటనే టాక్సీ డ్రైవర్‌గా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలుంటుందో లేదో కదా?  ముందే ఓ జత సిద్ధంగా ఉన్నట్టుంటుందని సరదాగా చెప్పేవాణ్ని. కానీ అందులో కొంత నిజం కూడా ఉండేది. తొలి సినిమా తీస్తున్న రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అనే భయం వెంటాడేది కూడా! దర్శకుడినయ్యాననే తలబిరుసుతనం నాలో రాకూడదని, అందరిలానే తానూ ఓ సాధారణ మనిషిననే విషయం నాకు గుర్తుండాలనే ఖాకీ దుస్తులు ధరించేవాణ్ని. సినిమాకి సంబంధించి  ఏ విభాగంలో అడుగుపెట్టినా వాళ్ల చిట్ట చివరి లక్ష్యం దర్శకుడు కావడమే. నేను సౌండ్‌ రికార్డర్‌గా ప్రయాణం మొదలుపెట్టి దర్శకుడినయ్యా. కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుందని గ్రహించే ఖాకీ ధరించడం మొదలుపెట్టాన’’ని చెప్పేవారు.


‘ఎస్‌’ సెంటిమెంట్‌ కాదు.. కానీ!

కళాత్మక చిత్రాలతోనే అదిరిపోయే కమర్షియల్‌ విజయాల్ని అందుకొని సత్తా చాటారు దర్శకుడు కె.విశ్వనాథ్‌. ఆయన 50కిపైగా సినిమాలు తెరకెక్కించగా.. వాటిలో ‘ఎస్‌’ అక్షరంతో ప్రారంభమయ్యే చిత్రాలన్నీ విశేష ఆదరణ దక్కించుకోవడం విశేషం. 1973లో తెరకెక్కిన ‘శారద’ చిత్రంతో ఆ ఒరవడి మొదలైంది. ‘సిరిసిరి మువ్వ’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’, ‘శుభోదయం’, ‘సప్తపది’, ‘శుభలేఖ’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణకమలం’, ‘సూత్రధారులు’, ‘స్వాతికిరణం’, ‘శుభసంకల్పం’, ‘స్వరాభిషేకం’, ‘శుభప్రదం’ చిత్రాలతో అది కొనసాగింది. అయితే ఇలా ‘ఎస్‌’ అక్షరంతో టైటిల్‌ పెట్టాలన్న ఆలోచన ఉద్దేశపూర్వకంగా వచ్చినది కాదని కళాతపస్వి ఓ సందర్భంలో చెప్పారు. తానెప్పుడూ కథకు తగ్గ టైటిలే పెడతానని.. కాకపోతే చివరకు ఆ పేరు ‘ఎస్‌’తో ప్రారంభమయ్యేదని తెలిపారు.


బాలూ చొరవతో నటనవైపు

దర్శకుడిగానే కాదు, నటుడిగానూ కె.విశ్వనాథ్‌ వెండితెరపై తనదైన ముద్ర వేశారు. ఊరి పెద్దతగా, తండ్రిగా, తాతగా పలు పాత్రల్లో ఒదిగిపోయారు. తెలుగుతోపాటు, తమిళం, కన్నడ సినిమాల్లోనూ ఆయన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తను నటనవైపు రావడం గమ్మత్తుగా జరిగిందని చెప్పేవారు. ‘‘తెరపైకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్మాతగా ‘శుభసంకల్పం’ ప్రారంభించాం. అందులో రాయుడు పాత్ర చాలా కీలకం. కమల్‌హాసన్‌ ఎప్పుడూ చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడుతుంటాడు. ఆ పాత్రకి తగ్గట్టుగా గంభీరమైన వ్యక్తిని ఎంపిక చేయాలనుకున్నాం. శివాజీ గణేశన్‌ సహా పలువురు పేర్లు ప్రస్తావనకొచ్చాయి. రకరకాల కారణాలతో ఆ పాత్రకి నటుల ఎంపిక జరగలేదు. ఈలోగా చిత్రీకరణ మొదలైంది. రాయుడు పాత్ర తేలడం లేదు. ఎవరో తొందరగా తేల్చమని నిర్మాత బాలుని అడిగితే... ‘కథ చెప్పేటప్పుడే ఆ పాత్రకి మీరైతే సరిపోతారని అనిపించింది. మీరు ఆ పాత్ర పోషిస్తేనే ఈ సినిమా చేద్దాం,  లేదంటే మానేద్దాం’ అంటూ వెళ్లిపోయాడు. నాకో పట్టాన అర్థం కాలేదు. ఆ తర్వాత యూనిట్‌లో కొంతమంది నచ్చజెప్పి ఒప్పించారు. అలా తొలిసారి ముఖానికి రంగేసుకున్నా’’ అంటూ తన నట ప్రయాణం ఆరంభం గురించి చెప్పేవారు. ‘కలిసుందాం రా’, ‘నరసింహనాయుడు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘సంతోషం’, ‘స్వరాభిషేకం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘పాండురంగడు’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ తదితర చిత్రాల్లో కె.విశ్వనాథ్‌ పోషించిన పాత్రలు గుర్తుండిపోతాయి.


తీరని కోరిక..

‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘జీవన జ్యోతి’, ‘శుభలేఖ’, ‘స్వాతిముత్యం’.. ఇలా తన కెరీర్‌లో సూపర్‌ హిట్లుగా నిలిచిన పలు చిత్రాల్ని హిందీలోనూ రీమేక్‌ చేసి సత్తా చాటారు కె.విశ్వనాథ్‌. అయితే వీటితో పాటు తాను తెలుగులో తెరకెక్కించిన ‘స్వయంకృషి’, ‘అల్లుడు పట్టిన భరతం’ లాంటి సినిమాల్నీ హిందీలో రీమేక్‌ చేయాలని అనుకున్నారు విశ్వనాథ్‌. కానీ, ఆయన కోరిక తీరలేదు. అలాగే ఆయన టీవీ సీరియల్‌ కోసం ‘సర్వమంగళ’ అనే కథ రాశారు. దీన్ని మరో దర్శకుడితో తెరకెక్కించాలని ప్రయత్నించారు. కానీ, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది.


అందుకే ఆ గొప్ప చిత్రాలొచ్చాయి..

సంగీతం, నాట్య ప్రధానంగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించి.. ప్రేక్షకుల్ని రంజింపజేశారు కళాతపస్వి విశ్వనాథ్‌. నిజానికి ఆయనకు ఆ రెండు కళలూ తెలియదు. కానీ, ఆయా వస్తువులతో గొప్ప సినిమాలు ఎలా తీశారంటే ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారాయన. ‘‘నాకు సంగీతం తెలియదు. కానీ, సంగీత దర్శకుల నుంచి నాకు కావాల్సిన రీతిలో, నా పద్ధతిలో సంగీతం రాబట్టుకోవాలని తపన ఉండేది. ‘నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు’ అని ఎవరైనా అడిగితే నేను చెప్పను. ‘ఇంకా బాగుంటే బాగుంటుంది’ అని చెబితే వేళాకోళం అనిపిస్తుంది. కేవీ మహదేవన్‌, ఇళయరాజా వంటి మహానుభావుల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే వెర్రి కూతలవుతాయి. నృత్యం కూడా అంతే. నాకు తెలిసినంత వరకు మాత్రమే జోక్యం చేసుకునేవాణ్ని. వాళ్లు సహృదయంతో వినేవాళ్లు. అందుకే మంచి ఫలితాలు వచ్చాయి’’ అని ఓ సందర్భంలో తెలియజేశారు విశ్వనాథ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని